ధురంధర్ డైరెక్టర్.. ఇప్పట్లో మళ్లీ టచ్ చేయరా?
ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్.. కొన్ని రోజులుగా ఆయన కోసమే సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.;
ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్.. కొన్ని రోజులుగా ఆయన కోసమే సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తక్కువ సినిమాలతోనే భారీ క్రేజ్ తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టడంతో ఆసక్తి నెలకొంది. అయితే ఆయన కొంతకాలం స్పై జానర్ కు దూరంగా ఉండబోతున్నారన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
దర్శకుడిగా ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో అరంగేట్రం చేసిన ఆదిత్య ధర్, మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కావడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. అంతేకాదు.. ఆ సినిమా ద్వారా జాతీయ అవార్డు అందుకోవడం ఆయన కెరీర్ లో పెద్ద మైలురాయిగా నిలిచింది.
ఆ విజయంతో వచ్చిన గుర్తింపును ఆయన తదుపరి ప్రాజెక్టుల్లో కూడా కొనసాగించారు. స్పై యాక్షన్ నేపథ్యంలో రూపొందించిన ధురంధర్ సిరీస్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వరుసగా వచ్చిన ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడంతో పాటు ఆయనకు మాస్ అండ్ క్లాస్ ప్రేక్షకుల్లో సూపర్ ఇమేజ్ తీసుకొచ్చాయి. దీంతో ఆదిత్య ధర్ తదుపరి ఏ జానర్ ను ఎంచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం, ఆయన ఇప్పట్లో స్పై జానర్ ను మళ్లీ టచ్ చేయాలని అనుకోవడం లేదని తెలుస్తోంది. ఒకే తరహా కథలు రిపీట్ చేయకుండా, ఫ్రెష్ గా సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రస్తుతం ఆయన సైన్స్ ఫిక్షన్, పౌరాణిక అంశాలను కలిపిన భారీ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఆయన తెరకెక్కించబోయే నెక్స్ట్ చిత్రం ది ఇమ్మోర్టల్ అశ్వత్థామగా తెలుస్తోంది.
పౌరాణిక పాత్ర అశ్వత్థామ ఆధారంగా రూపొందుతున్న ఆ సినిమా మొదటగా 2021లోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి, అలాగే భారీ బడ్జెట్ సమస్యల కారణంగా ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు మారడంతో, నిర్మాతలు కూడా భారీ ప్రాజెక్టులకు ముందుకు రావడంతో ఆ చిత్రం మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమాను ట్రయాలజీగా రూపొందించే ఆలోచన కూడా ఉందని సమాచారం.
అదే కాకుండా.. ఆదిత్య ధర్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్ పై కూడా పని చేస్తున్నారని తెలుస్తోంది. చంద్రగుప్త మౌర్యుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. అంతేకాదు ఆ రెండు ప్రాజెక్టుల తర్వాత ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలన్న ఆలోచన ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అంటే వరుసగా భిన్నమైన జానర్లలో సినిమాలు చేయడం ద్వారా తన టాలెంట్ ను మరింత విస్తరించాలని ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది. దీంతో ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆయన తదుపరి సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.