అర్జున్ రెడ్డి.. చేసినందుకు ఇప్పటికీ చింతిస్తున్నా!
టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ, ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిన 'అర్జున్ రెడ్డి' బాలీవుడ్‌లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది.;
టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ, ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిన 'అర్జున్ రెడ్డి' బాలీవుడ్‌లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి హిందీలో 'కబీర్ సింగ్' అనే టైటిల్‌తో రీమేక్ అయిన విషయం తెల్సిందే. 2019లో విడుదలైన కబీర్ సింగ్‌లో హీరోగా షాహిద్ కపూర్ నటించగా, తెలుగు వర్షన్‌కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగ హిందీ వర్షన్‌కి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. హిందీలో ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల వసూళ్లు సాధించినట్లు బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతూ ఉంటారు. అక్కడ షాహిద్ కపూర్‌తో పాటు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్థాయి అమాంతం పెంచింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి వంగతో ప్రముఖ హీరోలు నటించేందుకు రెడీగా ఉన్నారంటే కారణం కబీర్ సింగ్ మూవీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కబీర్ సింగ్ పై ఆదిల్ హుస్సేన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్‌లో కబీర్ సింగ్ విడుదలై అయిదు ఏళ్లు పూర్తి అయినా ఇప్పటికీ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలాంటి సినిమాలో కాలేజ్ డీన్ పాత్రలో నటించిన ప్రముఖ నటుడు ఆదిల్ హుస్సేన్ తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆ సినిమాలో నటించకుండా ఉండాల్సిందని అన్నాడు. అంతే కాకుండా సినిమాలో తాను స్త్రీ ద్వేషంతో కూడిన పాత్రను చేయడంను ఎప్పటికీ చింతిస్తున్నాను అన్నాడు. కబీర్ సింగ్‌లోని నా పాత్ర గురించి చాలా మంది సినిమా విడుదల తర్వాత విమర్శించారు. నాకు తెలిసిన వారు, పలువురు మహిళలు అలాంటి పాత్రలు చేయడం ఎంత వరకు సబబు అని మీరు భావిస్తున్నారు అంటూ ప్రశ్నించడం ఇబ్బంది కలిగించిందని ఆదిల్ చెప్పుకొచ్చాడు. కబీర్ సింగ్ సినిమా చేయడం అనేది నా కెరీర్‌లో చేసిన పెద్ద తప్పుగా తాను ఒప్పుకుంటున్నట్లు చెప్పకనే చెప్పుకొచ్చాడు.
అర్జున్ రెడ్డి చూడకుండా ఒప్పుకున్నా..
ఈ సినిమాకు సంబంధించిన ఛాన్స్ వచ్చిన సమయంలో నేను కనీసం స్క్రిప్ట్ చూడలేదు, అంతే కాకుండా ఒరిజినల్ వర్షన్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను చూడలేక పోయాను. ఆ సమయంలో ఉన్న బిజీ కారణంగా సినిమాను గుడ్డిగా ఒప్పేసుకోవడం నేను చేసిన తప్పు అని ఒప్పుకుంటున్నాను అని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఆ సమయంలో నేను ఉన్న బిజీ కారణంగా సినిమా వివరాలు తెలుసుకోకుండా ఒప్పుకున్నాను. కానీ ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకోవడానికి చాలా పెద్ద పారితోషికం డిమాండ్ చేయడం, ఇతర కండీషన్స్ పెట్టినా కూడా నిర్మాతలు నాతో మాట్లాడి ఆ విషయాలన్నింటికి ఓకే చెప్పి సినిమాను చేయించారు. సినిమాను వద్దు అనుకుంటూనే చివరకు చేయాల్సి వచ్చిందని ఆదిల్ హుస్సేన్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
షాహిద్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కబీర్ సింగ్
సినిమా విడుదల తర్వాత నేను చేసిన సన్నివేశాలను చూసుకున్న సమయంలో ఇది నేనేనా చేసింది అనిపించింది. అంతే కాకుండా నా మహిళ స్నేహితులు కొందరు నిరాశ వ్యక్తం చేస్తూ చేసిన మెసేజ్‌లను మరిచి పోలేను అన్నాడు. సినిమాను కమిట్ అయ్యే ముందు అందులోని పాత్రను తెలుసుకుని, కథను విన్న తర్వాత ఓకే చెప్పాలి. కానీ నేను అలా చేయలేదు. కథ వినకుండానే ఓకే చెప్పాను, అది ఖచ్చితంగా నాదే తప్పు. ఈ తప్పుకు నేను ఎవరినీ టార్గెట్ చేయాలి అనుకోవడం లేదు.
కబీర్ సింగ్ తర్వాత చాలా సినిమాలకు తాను కథ పూర్తిగా విన్న తర్వాత, పాత్ర గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే కమిట్ అవుతున్నాను అన్నాడు. ఒక సారి కమిట్ అయిన తర్వాత సినిమాను చేయాల్సిందే. అలా చేసి ఇప్పుడు బాధ పడుతున్న మూవీ కబీర్ సింగ్ అని ఆదిల్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు. సినిమాలో ఆయన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు, ఉన్నంతలో ఆయన స్త్రీ ద్వేషంతో కనిపించడం వల్ల విమర్శలు ఎదుర్కొన్నట్లుగా ఆయన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.