మ‌రో కొత్త ప‌రిశ్ర‌మ‌లో లెజెండ‌రీ త‌న‌యుడు!

లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ తనయుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.;

Update: 2026-04-13 14:30 GMT

లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ తనయుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వైవిధ్యమైన పాత్రలతో హిందీ ప్రేక్షకులను అలరించిన అభిషేక్ ఇప్పుడు సరిహద్దులు దాటి మరో కొత్త పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. నటుడు రితీష్ దేశ్‌ముఖ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న‌ రాజా శివాజీ చిత్రంతో అభిషేక్ మరాఠీ చిత్ర పరిశ్రమ లోకి అరంగేట్రం చేస్తుండటం విశేషం. ఛత్రపతి శివాజీ మహారాజ్ అజేయమైన జీవిత గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ భారీ చారిత్రక చిత్రంలో అభిషేక్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు.

రితీష్ దేశ్‌ముఖ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే శివాజీ మహారాజ్ పాత్ర పోషిస్తున్నారు. తన మిత్రుడైన రితీష్‌కు ఉన్న విజన్ , కథ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం చూసి అభిషేక్ వెంటనే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒక గొప్ప వీరుడి చరిత్రను చెప్పే సినిమాలో భాగం కావడం తనకెంతో గర్వంగా ఉందని అభిషేక్ పేర్కొన్నారు. అభిషేక్ బచ్చన్ ప్రయోగాలకు వెనకాడరు. గురు, పా, యువ వంటి చిత్రాల్లో ఆయన చూపిన నటన నేటికీ చర్చనీయాంశమే. ఇప్పుడు మరాఠీ భాషలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.

ఈ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా మరాఠీ భాషా యాసను, సంభాషణలను నేర్చుకుని బ‌రిలోకి దిగారు. బాలీవుడ్ అగ్ర నటులు ప్రాంతీయ చిత్రాల వైపు మొగ్గు చూపడం వల్ల ఆయా పరిశ్రమల స్థాయి , మార్కెట్ పరిధి జాతీయ స్థాయిలో పెరుగుతుంది. రితీష్ దేశ్‌ముఖ్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ రాక అదనపు బలాన్ని చేకూర్చింద‌న్నారు. మరాఠా సామ్రాజ్య వైభవాన్ని వెండితెరపై ఆవిష్కరించే క్రమంలో అభిషేక్ వంటి అనుభవం ఉన్న నటుడు ఎలాంటి కనిపిస్తారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.

వీరిద్దరి కాంబినేషన్ మరాఠీ వెండితెరపై సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బిగ్ బి వారసుడిగా బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన అభిషేక్ `రాజా శివాజీ`తో మరాఠీ హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధమవుతున్నారు. భాషా పరమైన అడ్డంకులను అధిగమించి మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో అభిషేక్ చూపిస్తున్న ఆసక్తి అభినందనీయం. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న సినిమా విడుద‌లకు సిద్ద‌మ‌వుతుంది. ఈ కొత్త ప్రయాణం అభిషేక్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంద‌ని ఆయ‌న అభిమాను భావిస్తున్నారు

ఈ చిత్రంతో అభిషేక్ బచ్చన్ మరాఠీ తెరపై మెరవడమే కాదు. తండ్రి అమితాబ్ బచ్చన్ - తల్లి జయా బచ్చన్ గతంలో మరాఠీ చిత్రాల్లో పోషించిన అతిథి పాత్రల వారసత్వాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్తున్నట్లే. హిందీ సినిమాల‌తో పాటు పూర్తిస్థాయి మరాఠీ సినిమాల్లో న‌టించ‌గ‌ల్గితే తన కెరీర్ పరిధిని మరింత విస్తరించు కుంటు న్నట్లే. చారిత్రక కథలను ఇష్టపడే నేటి ప్రేక్షకులు అభిషేక్ వంటి గంభీరమైన నటుడు మరాఠా వీరుల గాథలో ఎలా ఒదిగిపోతారో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రితీష్ దేశ్‌ముఖ్ ఈ ప్రాజెక్ట్‌ను ఒక సినిమాగా మాత్రమే కాకుండా మహారాష్ట్ర సంస్కృతికి నివాళిగా భావించ‌డంతో? అభిషేక్ చేరిక చిత్రానికి జాతీయ స్థాయిలో మరింత గౌరవాన్ని తీసుకొస్తుంది.

Tags:    

Similar News