మితిమీరిన అంచనాలు.. నష్టం తప్పదా?

ఈమధ్య కాలంలో దర్శకులు, హీరోలు తమ డ్రీమ్ ప్రాజెక్టుల గురించి పదేపదే ప్రస్తావిస్తూ ఆడియన్స్ లో అంచనాలు పెంచేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2026-01-22 16:30 GMT

ఈమధ్య కాలంలో దర్శకులు, హీరోలు తమ డ్రీమ్ ప్రాజెక్టుల గురించి పదేపదే ప్రస్తావిస్తూ ఆడియన్స్ లో అంచనాలు పెంచేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎప్పుడో తెరపైకి రావాల్సిన సినిమాలు వరుసగా వాయిదా పడడం లేదా అసలు తమ డ్రీమ్ ప్రాజెక్టు తెరపైకి రావడానికి సరైన దారులు లేకపోవడం లాంటి కారణాలవల్ల ఆ చిత్రాలు వాయిదా పడుతూ ఉంటాయి. అయితే కారణాలు ఏవైనా సరే ఖచ్చితంగా తమ కెరియర్లో తమ డ్రీమ్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఎంతోమంది తపన పడుతూ ఉంటారు. అందులో భాగంగానే అసలు తెర పైకే రాని ఆ చిత్రం గురించి పదేపదే ప్రస్తావిస్తూ ఆడియన్స్ లో అంచనాలు పెంచేస్తున్నారు.

అయితే మితిమీరిన అంచనాలు తీవ్ర నష్టానికి దారి తీయవచ్చు అని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న రాజమౌళి ఎలా అయితే తన డ్రీం ప్రాజెక్టు మహాభారతం అని చెప్పారో.. అటు బాలీవుడ్ లో స్టార్ హీరోగా, ప్రొడ్యూసర్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న అమీర్ ఖాన్ కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఎప్పుడైతే అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అని చెప్పారో.. అప్పటినుంచి అమీర్ ఖాన్ నుంచి సినిమా విడుదలయినా లేదా ఆయన నిర్మాణంలో సినిమాలు వచ్చిన ప్రతిసారి కూడా అమీర్ ఖాన్ అభిమానులు ఆయన కలల ప్రాజెక్టు అయిన మహాభారతం గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. దీనికి తోడు అటు అమీర్ ఖాన్ కూడా.. తాను నటించిన 'సితారే జమీన్ పర్' సినిమాతో పాటు తన నిర్మాణంలో వీర్ దాస్ దర్శకత్వం వహించిన 'హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్' చిత్రాల సమయంలో అనేక ఇంటర్వ్యూ లతో పాటు పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలు తెలిపారు.

అయితే ఇందులో ఆయన ఈ చిత్రాల గురించి మాత్రమే కాకుండా మహాభారతం గురించి ప్రస్తావన తీసుకురావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును లార్డ్ ఆఫ్ ద రింగ్స్, అవతార్ ఫ్రాంచైజీ లతో పోలుస్తూ కామెంట్లు చేశారు. అంతేకాదు ప్రతి వివరాలను సరిగ్గా పొందాలనుకుంటున్నానని, దీనిపై తన చిత్ర బృందం ఇంకా పనిచేస్తోందని అమీర్ ఖాన్ తెలిపారు. అలా ఎప్పటికప్పుడు మహాభారతంపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు అమీర్ ఖాన్. కానీ ఈ భారీ ప్రాజెక్టు కి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా బయటకు వదలకపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే అమీర్ ఖాన్ పదేపదే అసలు తెరపైకే రాని సినిమా గురించి ప్రస్తావన తీసుకొస్తే.. అధిక చర్చలు సినిమా ప్రభావాన్ని దెబ్బతీస్తాయని అటు సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు . ముఖ్యంగా మహా భారతం సినిమాకి ఒకవేళ సమయం ఎక్కువ పడితే మాత్రం ఉత్సాహం కాస్త తగ్గిపోయి అది విడుదలయ్యే సమయానికి సినిమాపై ఆసక్తి కూడా ఆడియన్స్ కోల్పోతారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. కనీసం ఇప్పటికైనా అమీర్ ఖాన్ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత సినిమాలపై ఫోకస్ చెయ్యాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News