స్టేజ్‌పై స్పీచ్ మధ్యలోనే పరుగు… ఆమిర్ ఖాన్ ఫన్నీ మూమెంట్ వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మ‌రోసారి తన సహజత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.;

Update: 2026-04-27 10:24 GMT

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మ‌రోసారి తన సహజత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సాధారణంగా స్టేజ్‌పై స్పీచ్‌లు అంటే ప్లాన్డ్ గా, కొంత ఫార్మాలిటీతో కొనసాగుతాయి. కానీ ఆమిర్ మాత్రం ఈ సాంప్రదాయాన్ని బద్దలు కొడుతూ, తనదైన స్టైల్‌లో సరదా మూమెంట్‌ను సృష్టించారు. త‌న కొడుకు జునైద్ న‌టించిన ఏక్ దిన్ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఉన్న ఆయన, ఒక్కసారిగా రెండు నిమిషాలు ప‌ర్మిష‌న్ ఇస్తారా అంటూ నిర్వాహకులను అడిగి, పాస్ వస్తోంది అని సంకేతం ఇచ్చి వేదిక దిగిపోవడం అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచెత్తింది. స్టార్ అయినా కూడా ఎంత నేచురల్‌గా, నిజాయితీగా ఉంటారో ఈ ఘటన మళ్లీ రుజువు చేసింది. ఈ ఫన్నీ మూమెంట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయి, నెటిజన్ల నుంచి భారీ స్పందనను అందుకుంది.

అయితే ఈ సరదా ఘటనకు ముందు వేదికపై పూర్తిగా విరుద్ధమైన ఎమోష‌న‌ల్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. తన కొడుకు జునైద్ నటించిన సీన్స్ ను స్క్రీన్‌పై చూస్తూ ఆమిర్ భావోద్వేగానికి లోనయ్యారు. కొడుకు యాక్టింగ్ చూసి కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, పక్కనే ఉన్న సాయి ప‌ల్ల‌వి ఆయనను ఓదార్చిన దృశ్యం ఈ ఈవెంట్‌కు స్పెష‌ల్ హైలైట్‌గా నిలిచింది. ఒక తండ్రిగా గర్వం, ఆనందం, ఎమోష‌న్.. అన్నీ కనిపించిన ఈ క్షణం అక్కడున్న వారిని కూడా కదిలించింది. అదే సమయంలో జునైద్‌పై ఉన్న అంచనాలు, స్టార్ కిడ్‌గా ఎదుర్కొంటున్న ఒత్తిడి కూడా ఈ సంఘటన ద్వారా పరోక్షంగా వెలుగులోకి వచ్చింది.

ఇక స్టేజ్ ఎక్కిన త‌ర్వాత ఆమిర్, సాయి పల్లవిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం మన దేశంలోనే బెస్ట్ నటి సాయి పల్లవి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఆమె నటనలోని నిజాయితీ, ఎమోషనల్ డెప్త్, స్క్రీన్ ప్రెజెన్స్.. ఆమెను ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లాయని ఆమిర్ పేర్కొన్నారు. సాధారణంగా ప్రశంసల్లో చాలా సెలెక్టివ్‌గా ఉండే ఆమిర్ నుంచి వచ్చిన ఈ కాంప్లిమెంట్స్, సాయి పల్లవి ప్రతిభకు మరో పెద్ద గుర్తింపుగా మారాయి. ఇప్పటికే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు, ఈ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి.

మొత్తానికి ఈ ఈవెంట్ నవ్వులు, కన్నీళ్లు, ప్రశంసలు.. ఈ మూడింటి కలయికగా నిలిచింది. ఒకవైపు ఆమిర్ ఖాన్ సరదా మూమెంట్ వైరల్ అవుతుండగా, మరోవైపు ఆయన తండ్రిగా చూపిన ఎమోష‌న్ ప్రేక్షకులందరినీ కదిలించింది. అదే సమయంలో సాయి పల్లవి టాలెంట్ పై వచ్చిన ప్రశంసలు ఈ ఈవెంట్‌ను మరింత స్పెష‌ల్ గా మార్చాయి. ఈ మొత్తం బజ్ మధ్య ఏక్ దిన్ సినిమాపై ఆసక్తి కూడా గణనీయంగా పెరిగింది. గతంలో ఎదురైన నిరాశల తర్వాత జునైద్ ఖాన్‌కు ఈ సినిమా కీలకంగా మారగా, ఈ ఈవెంట్ అతనికి పాజిటివ్ మొమెంటమ్ తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News