బాప్ రే ఏం జరుగుతోంది? 30 వేల కోట్ల ఆస్తి ఫైట్‌లోకి సడెన్‌గా టాప్ హీరోయిన్ ఎంట్రీ!
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. సంజయ్ కపూర్ దశాబ్ధాల పాటు వేల కోట్ల ఆస్తులను సంపాదించగా ఇప్పుడు వారసత్వ పోరు అంతకంతకు వేడెక్కిస్తోంది.;
ప్రముఖ వ్యాపారవేత్త, దివంగత సంజయ్ కపూర్ ఆస్తి వివాదం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సుమారు 30 వేల కోట్ల రూపాయల విలువైన ఈ వారసత్వ సంపదపై సంజయ్ రెండో భార్య కరిష్మా కపూర్ పిల్లలకు, ఆయన మూడవ భార్య ప్రియా కపూర్‌కు మధ్య న్యాయపోరాటం తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కరిష్మా పిల్లలైన సమైరా, కియాన్‌లకు అనుకూలంగా కీలక ఆదేశాలు జారీ చేయడంతో కరిష్మా సోదరి, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ సోషల్ మీడియాలో చేసిన ఒక ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కరీనా కపూర్ తన ఇన్‌స్టాలో స్పందిస్తూ.. ``న్యాయం, నిజం ఎప్పుడూ గెలుస్తాయి.. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటం ముఖ్యం!`` అంటూ ఒక నిగూఢమైన (క్రిప్టిక్) సందేశాన్ని షేర్ చేసారు. కరీనా నేరుగా ఎవరి పేరును ప్రస్తావించకపోయినా తన సోదరి పిల్లలకు కోర్టులో ఊరట లభించిన వెంటనే ఈ పోస్ట్ చేయడంతో.. ఇది కచ్చితంగా వారి సవతి తల్లి ప్రియా కపూర్‌ను ఉద్దేశించి చేసినదేనని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. న్యాయం తమ వైపే ఉందని కరీనా ఈ పోస్ట్ ద్వారా పరోక్షంగా స్పష్టం చేశారు. అయితే ఉన్నట్టుండి ఈ వివాదంలోకి కరీనా సడెన్ ఎంట్రీ ఇవ్వడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. సంజయ్ కపూర్ దశాబ్ధాల పాటు వేల కోట్ల ఆస్తులను సంపాదించగా ఇప్పుడు వారసత్వ పోరు అంతకంతకు వేడెక్కిస్తోంది. అయితే కోర్టు జోక్యంతో సమన్యాయం జరగనుందని అర్థమవుతోంది. కపూర్ సంస్థాన ఆస్తులను విక్రయించకుండా లేదా ఇతరులకు బదిలీ చేయకుండా ఢిల్లీ హైకోర్టు ప్రియా కపూర్‌పై మధ్యంతర స్టే విధించింది. 30 వేల కోట్ల ఆస్తిని కాపాడాల్సిన అవసరం ఉందని..అది వృధా కాకూడదని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా... సంజయ్ కపూర్ బ్యాంక్ ఖాతాల లావాదేవీలను కూడా నిలిపివేయాలని ఆదేశించింది. సంజయ్ కపూర్ రాసినట్లుగా చెబుతున్న వీలునామా అసలైనదేనని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రియా కపూర్‌పైనే ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కరిష్మా పిల్లలు సమైరా, కియాన్ తమ తండ్రి వీలునామాను ప్రియా కపూర్ ఫోర్జరీ చేశారని.. ఆస్తుల జాబితాను కూడా అసంపూర్తిగా సమర్పించారని కోర్టులో ఆరోపించారు. అనేక విలువైన ఆస్తులను ప్రియా కపూర్ దాచిపెట్టారని వారు వాదించారు. గత ఏడాది జూన్‌లో లండన్‌లో పోలో ఆడుతూ సంజయ్ కపూర్ హఠాన్మరణం చెందారు. ఆయన మరణంపై అప్పట్లో అనేక అనుమానాలు వ్యక్తమైనా.. బ్రిటిష్ వైద్య అధికారులు అది సహజ మరణమేనని ధృవీకరించారు. అయితే ఆయన మరణం తర్వాత మొదలైన ఈ ఆస్తి యుద్ధం మాత్రం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
ప్రస్తుతానికి కోర్టు ఉత్తర్వులతో కరిష్మా కపూర్ పిల్లలకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఒకవేళ వీలునామా ఫోర్జరీ అని తేలితే ఆ 30 వేల కోట్ల ఆస్తిలో సమైరా, కియాన్‌లకు దక్కాల్సిన వాటాపై స్పష్టత వస్తుంది. అప్పటి వరకు ఆస్తులను ఎవరూ తాకకుండా కోర్టు తీసుకున్న నిర్ణయం న్యాయబద్ధంగా ఉందని కపూర్ కుటుంబం భావిస్తోంది. ఈ క్రమంలో కరీనా కపూర్ చేసిన `న్యాయం గెలుస్తుంది` అనే వ్యాఖ్యలు ఈ వివాదంలో మరింత వేడిని పెంచాయి.