2025 రివ్యూ : అవతార్‌ని వెనక్కి నెట్టిన బుడతలు

ఈ ఏడాది బాక్సాఫీస్‌ ను షేక్ చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఒక యానిమేటెడ్ మూవీ నిలవడం విశేషం.;

Update: 2025-12-30 07:31 GMT

మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరం పూర్తి కాబోతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది వందల కొద్ది సినిమాలు వచ్చాయి. ఎప్పటిలాగే కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ ఏడాది బాక్సాఫీస్‌ ను షేక్ చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఒక యానిమేటెడ్ మూవీ నిలవడం విశేషం. అది కూడా ఒక చిన్న సినిమాగా విడుదల అయ్యి, బిగ్గెస్ట్‌ భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ యానిమేషన్ మూవీ మరేదో కాదు.. నే ఝా 2. ఈ చైనీస్‌ యానిమేటెడ్‌ ఫాంటసీ చిత్రం 2019లో వచ్చిన నే ఝా కి సీక్వెల్‌గా రూపొందింది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వంద కాదు వేలు కాదు ఏకంగా రూ.19 వేల కోట్ల రూపాయలను రాబట్టింది. 2.2 బిలియన్‌ డాలర్లను రాబట్టి ప్రపంచంలోనే నెం.1 సినిమాగా నిలిచి అందరినీ సర్‌ప్రైజ్ చేసి, ఇంకా థియేట్రికల్‌ రన్‌ కొనసాగుతూనే ఉందంటే ఏ స్థాయి విజయాన్ని ఈ సినిమా సొంతం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు.

చైనీస్ యానిమేటెడ్ మూవీ...

జియావోజీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను 2025 జనవరి 29న మొదట చైనా భాషలో విడుదల చేయడం జరిగింది. అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇతర విదేశీ భాషల్లో అనువదించడం మొదలు పెట్టారు. ఏప్రిల్‌ నెలలో జపాన్‌, ఇండియాలో విడుదల చేయడం జరిగింది. ఆగస్టులో ఇంగ్లీష్ భాషలో డబ్‌ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ డబ్బింగ్‌ వర్షన్‌తో నే ఝా 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. వేల కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టడం ద్వారా నెం.1 సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు ఏ యానిమేటెడ్‌ మూవీ సాధించని వసూళ్లు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి మరింతగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో నే ఝా 2 సినిమా యొక్క బాక్సాఫీస్ జర్నీ ప్రారంభం అయింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉండటం ను బట్టి ఈ సినిమా ముందు ముందు ఎలాంటి నెంబర్స్ నమోదు చేయబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

నే ఝా 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద...

ఈ సినిమాను నిర్మించేందుకు గాను దాదాపుగా 85 మిలియన్‌ డాలర్లను నిర్మాణ సంస్థ ఖర్చు చేసింది. ఖర్చు చేసిన మొత్తానికి పదుల రెట్లు ఈ సినిమా వసూళ్ల రూపంలో నిర్మాతలకు తీసుకు వచ్చింది. గడచిన దశాబ్ద కాలంలో ఈ స్థాయి విజయం నమోదు కాలేదు అంటూ వరల్డ్‌ బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాకు సంబంధించిన పాత్రల గురించి చర్చించుకుంటూ జనాలు కనిపిస్తున్నారు. నే ఝూ 2 పాత్రల ఫోటోలు, వీడియోలు ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఒక యానిమేటెడ్‌ మూవీ ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోగలదు అనే నమ్మకంను ఈ సినిమా కలిగించడంతో భవిష్యత్తులో మరిన్ని యానిమేటెడ్‌ మూవీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చైనా నుంచి వచ్చిన సినిమాల్లో వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ ను నమోదు చేసింది.

అవతార్ సినిమాను మించి వసూళ్లు..

నే ఝా 2 సినిమా తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా జూటోపియా 2 నిలిచింది. ఇది కూడా యానిమేషన్‌ మూవీ కావడం విశేషం. 1.42 బిలియన్‌ డాలర్లను ఈ సినిమా రాబట్టడం ద్వారా నెం.2 స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో లిలో అండ్‌ స్టిచ్‌ మూవీ నిలిచింది. ఈ సినిమా 1.03 బిలియన్‌ డాలర్లు వసూళ్లు చేయడం ద్వారా నెం.3 స్థానంలో నిలిచింది. అవతార్‌తో పాటు ఇంకా ఎన్నో హాలీవుడ్‌ సినిమాలను ఈసారి యానిమేటెడ్‌ మూవీస్ వెనక్కి నెట్టి మరీ భారీ వసూళ్లు రాబట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన అవతార్ సైతం ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇంకా అవతార్‌ రన్ కొనసాగుతోంది. వచ్చే ఏడాదికి అవతార్ ఫుల్‌ రన్‌ లెక్కలు వచ్చే అవకాశం ఉంది. అయినా కూడా నే ఝా 2 ను దాటే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది యానిమేటెడ్‌ మూవీస్ చేసిన సందడితో రాబోయే రోజుల్లో మరిన్ని యానిమేటెడ్ మూవీస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News