ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది పుచ్చకాయ కాదా?

ముంబయి కుటుంబ మరణం, పుచ్చకాయ కారణం కాదు, ఫుడ్ పాయిజనింగ్ అనుమానం, విష ప్రయోగం అనుమానం, బిర్యానీ తర్వాత మరణాలు, ఎఫ్‌డిఏ పరీక్షలు, పోస్ట్‌మార్టం రిపోర్ట్, మార్ఫిన్ గుర్తింపు, సంచలన వార్త;

Update: 2026-05-02 05:27 GMT

ముంబయికి చెందిన ఒక కుటుంబం బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినటం.. దీంతో ఆ కుటుంబానికి చెందిన వారంతా గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయిన వైనం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. పుచ్చకాయ ప్రాణాలు తీసేంత విషాహారమా? అన్న సందేహానికి గురయ్యేలా చేసింది. పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. దీంతో.. వాట్సాప్ యూనివర్సిటీలో భారీ ఎత్తున పోస్టులు.. సోషల్ మీడియాలో సలహాలు.. సూచనలతో హోరెత్తిపోయిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా వెలుగు చూసిన వివరాలు మరింత షాక్ కు గురయ్యేలా చేయటమే కాదు.. కుటుంబ మరణం వెనుక మిస్టరీ ఏదో ఉందన్న సందేహాలు ఇప్పుడు తెర మీదకు వచ్చిన పరిస్థితి.

ముంబయికి చెందిన అబ్దుల్లా డోకాడియా.. ఆయన భార్య నస్రీన్.. ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయిన వైనం తెలిసిందే. వీరు బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్నారని.. ఆ తర్వాతి నుంచి వాంతులు.. విరేచనాలతో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయిన వైనం తెలిసిందే. గంటల వ్యవధిలో బిర్యానీ.. పుచ్చకాయ తినటంతో ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి భిన్నంగా పుచ్చకాయ కారణంగా వారి ప్రాణాలు పోలేదన్న విషయాన్ని నిపుణులు తేల్చారు. వారు తిన్న పుచ్చకాయలో ఎలాంటి కల్తీ జరగలేదన్న విషయం పరీక్షల్లో తేలింది. దీంతో.. ఆ కుటుంబ మరణాల వెనుక పుచ్చకాయ లేదని తేలింది. అయితే.. మరణించిన వారిలోని కొందరి శరీరాల్లోని భాగాలు ఆకుపచ్చ రంగులోకి మారటం కొత్త అనుమానాలకు కారణంగా మారింది. ఈ కుటుంబం తిన్న పుచ్చకాయ.. ఇతర ఆహార పదార్థాల శాంపిళ్లను ఫుడ్ అండ్ డ్రగ్ ఆడ్మినిస్ట్రేషన్ అధికారులు పరీక్షలు జరిపారు.

వీరి మరణానికి ముందు వారు తిన్న ఆహారంలో ఎలాంటి కల్తీ జరగలేదన్న విషయం వెలుగు చూసింది. పుచ్చకాయలోనూ ఎలాంటి సింథటిక్ రంగులు కానీ.. తియ్యదనం కోసం ఉపయోగించి ఎలాంటి రసాయనాలు వాడలేదన్న విషయాన్ని గుర్తించారు. అయితే.. బ్యాక్టీరియా టెస్టు మాత్రం చేయలేదని తెలిపారు. అదే సమయంలో వీరు విష పదార్థాలు తిని ఉంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. పోస్టుమార్టం రిపోర్టులో కొన్ని కొత్త అంశాలు వెలుగు చూశాయి. మ్రతుల్లోని కొందరి అవయువాలు రంగు మారిన విషయాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. మెదడు.. గుండె.. జీర్ణాశయంలో కొంతభాగం ఆకుపచ్చగా మారినట్లుగా సమాచారం. సాధారణ పుడ్ పాయిజినింగ్ లో ఇలా జరగదని.. ఏదైనా విష ప్రయోగం జరిగి ఉంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అంతేకాదు.. కుటుంబ యజమాని అబ్దుల్లా డోకాడియా శరీరంలో మార్ఫిన్ అనే శక్తివంతమైన ఓపియాడ్ ను గుర్తించారు. చికిత్సలో భాగంగా ఈ పెయిన్ కిల్లర్ ను వాడారా? ఇంకేమైనా జరిగిందా? అన్నది తేలాల్సి ఉంది. మొత్తంగా చూస్తే.. ముంబయి కుటుంబం మరణానికి పుచ్చకాయ మాత్రం కారణం కాదన్న విషయాన్ని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అసలు మిస్టరీ వెలుగు చూడాల్సి ఉంది.

Tags:    

Similar News