ఎల్బీనగర్‌ ప్రేమోన్మాది దాడికి అసలు కారణమిదే!

ఎల్బీనగర్‌ లో కలకలం రేపిన ప్రేమోన్మాది దాడి కేసులో నిందితుడు విచారణలో రకరకాల ఫెర్మార్మెన్స్ లు చూపించాడట

Update: 2023-09-05 18:45 GMT

రోజు రోజుకీ పెరిగిపోతున్న ప్రేమోన్మాదుల దాడుల్లో తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి గల కారణాలు తెలుసుకునే విషయంలో పోలీసులను నిందితుడు ముప్పు తిప్పలు పెట్టారని తెలుస్తుంది! ఆఖరికి తమదైన శైలిలో విచారించినపోలీసులు అందుకు గల అసలు కారణాన్ని వెల్లడించారు.

అవును... ఎల్బీనగర్‌ లో కలకలం రేపిన ప్రేమోన్మాది దాడి కేసులో నిందితుడు విచారణలో రకరకాల ఫెర్మార్మెన్స్ లు చూపించాడట. ఈ సమయంలో వాస్తవాలు వెలికితీసేందుకు సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయించారు పోలీసులు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌ కు తరలించారు.

సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ లో నిందితుడు శివకుమార్‌ వెల్లడించిన విషయాలు.. వాంగూల్మంలో పొందుపరిచిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో సంఘవి తన సోదరులు పృథ్వీ, రోహిత్‌ లతోపాటు శ్రీనివాస్‌ అనే మరో బంధువుతో కలిసి ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది.

ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం సంఘవి చదివిన పాఠశాల పదో తరగతి పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. అప్పుడే సంఘవిని, నిందితుడు శివకుమార్‌ మళ్లీ కలిశాడు. పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడటం మొదలుపెట్టాడు. అనంతరం ఆమె రామంతాపూర్‌ లో చదువుతోందనే విషయం తెలుసుకుని సిటీకి మకాం మార్చాడు!

Read more!

ఈ సమయంలో ఆమెను పెళ్లికి ఒప్పించే ప్రయత్నాలకు పూనుకున్నాడు. ఇందులో భాగంగా తాజాగా సంఘవి సోదరుడు రోహిత్‌, శ్రీనివాస్‌ లు బంధువుల వివాహానికి వెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న శివకుమార్... తన సోదరిని తీసుకుని సంఘవి ఇంటికి వెళ్లాడు. ఆమె సోదరితో మాట్లాడించే ప్రయత్నం చేశాడు.

అయినప్పటికీ సంఘవి.. శివకుమార్ తో ప్రేమ, పెళ్లికి అంగీకరించలేదు. దీంతో సోదరిని తీసుకుని ఇంటివద్ద దింపేసిన శివకుమార్... అనంతరం ఒక కత్తి తీసుకుని తిరిగి సంఘవి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సంఘవితో వాగ్వాదానికి దిగాడు. దీంతో సడన్ గా సంఘవి సోదరుడు పృథ్వీ వచ్చాడు.

వెంటనే సోదరిపై దాడిచేయబోయిన శివకుమార్ ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో శివకుమార్‌ కత్తితో దాడి చేయడంతో పృథ్వీ మరణించాడు. దీంతో పృథ్వీ మృతదేహానికి సోమవారం ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం మృతదేహానికి సొంతూరు కొందుర్గులో అంత్యక్రియలు జరిగాయి.

మరోపక్క తీవ్రంగా గాయపడిన సంఘవిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. నిందితుడు శివకుమార్‌ ను కఠినంగా శిక్షించాలని నిరసన తెలిపారు.

Tags:    

Similar News