ప్రియుడు రీఛార్జ్ చేయించలేదని సూసైడ్.. దేవుడా!
చిన్న కారణాలకే విలువైన ప్రాణాలు తీసుకుంటున్న ఉదంతాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి.;
చిన్న కారణాలకే విలువైన ప్రాణాలు తీసుకుంటున్న ఉదంతాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. ఒక జీవితం విలువ కేవలం రీఛార్జ్ మాత్రమేనా? తాను మనసారా ప్రేమించి.. కలిసి ఉంటున్న వ్యక్తి రీఛార్జ్ చేయని వైనానికి తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్న షాకింగ్ ఉదంతం హైదరాబాద్ మహానగరంలోని జీడిమెట్లలో చోటు చేసుకుంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..
జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుత్భుల్లాపూర్ కు చెందిన కిరణ్మయి 2015లో ప్రేమ వివాహం చేసుకుంది. భార్యాభర్తల మధ్య విభేదాలతో వారు విడిపోయారు. వారికి ఒక కొడుకు. అతను కిరణ్మయి తల్లి వద్ద ఉంటున్నాడు. నాలుగేళ్ల క్రితం కుకట్ పల్లిలో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకున్న కిరణ్మయి ఒక ప్రైవేటు సంస్థలో జాబ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ప్రైవేట్ జాబ్ చేసే చందు అలియాస్ వెంకటేశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో వారిద్దరూ ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆమె ఫోన్ రీఛార్జ్ అయిపోయింది. తనకు జీతం ఇంకా రాని వేళలో.. తన ఫోన్ కు రీఛార్జ్ చేయించాలని చందును అడిగింది. అతను కూడా రీఛార్జ్ చేయించలేదు. ఈ క్రమంలో శుక్రవారం ఇరువురి మధ్య గొడవైంది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వెంకటేశ్ మీద అనుమానంతో కిరణ్మయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.