Begin typing your search above and press return to search.

రెట్టింపు సంక్షేమం...ఊరిస్తున్న టీడీపీ

By:  Tupaki Desk   |   29 March 2023 9:29 AM GMT
రెట్టింపు సంక్షేమం...ఊరిస్తున్న టీడీపీ
X
ఉమ్మడి ఏపీలో అభివృద్ధికి కేరాఫ్ చంద్రబాబు. ఆయనకు 2014లో అందువల్లనే నమ్మి ఓటేసి గెలిపించారు జనాలు. అయితే విభజన సమస్యల వల్ల ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో ఏపీలో చంద్రబాబు అయిదేళ్ల కాలంలో అభివృద్ధిని చేయాలనుకున్నా పెద్దగా సాధ్యపడలేదు. దాంతో ఆయన ఓడిపోయారు. ఆయన ప్లేస్ లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన జగన్ సంక్షేమాన్ని నమ్ముకున్నారు.

తాను ఎన్నికల మ్యానిఫేస్టొలో పేర్కొన్న మేరకు హామీలను నెరవేరుస్తున్నారు. అందుకోసం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. ఏపీ దివాళా తీసినా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న పట్టుదలతో జగన్ ముందుకు సాగుతున్నారు. అభివృద్ధి విషయంలో బాబు టైం లో కొంత ప్రయత్నం అయినా జరిగింది కానీ జగన్ మాత్రం పెద్దగా ఆ వైపే చూడలేదు.

ఇపుడు జగన్ పూర్తిగా సంక్షేమం మీదనే ఎన్నికలకు వెళ్ళాలని చూస్తున్నారు. ప్రతీ ఇంటికీ తాను చేసిన సంక్షేమ కార్యక్రమం ఓట్లు కురిపిస్తుంది అని ఆయన భావిస్తున్నారు. అదే టైం లో ఏపీలో 87 శాతం ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నరని వైసీపీ లెక్క వేసుకుంటోంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో సంక్షేమానికి ఓట్లు పెద్దగా పడలేదనే రుజువు అయింది.

అయితే ఆ ఓట్లు తమవి కావని వైసీపీ వాదిస్తోంది. తాము చేసిన సంక్షేమం ఎక్కువగా రూరల్ సెక్టార్ లో కనిపిస్తుందని, అందువల్ల కచ్చితంగా తమ సంక్షేమానికి ఫలితం దక్కుతుందని చెబుతోంది. కానీ ఏపీలో జనాలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అని ఒక వైపు రుజువు అవుతోంది. ఏపీ అప్పుల పాలు కావడానికి పంచుడు కార్యక్రమాలే కారణం అని కూడా జనాల భావనగా ఉంది.

అయితే విపక్షాలు సైతం సంక్షేమం విషయంలో తమ అజెండాను మార్చుకోవడంలేదు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో సంక్షేమానికి పెద్ద పీట వేయాలని టీడీపీ నిర్ణయించింది. రెట్టింపు సంక్షేమం తో ఎన్నికల ప్రణాళిక ఉంటుందని సంకేతలు ఇచ్చింది. ఆ దిశగా ఎన్నికల ప్రణాళికను తయారు చేయాలని అధినాయకత్వం ఆదేశించింది.

దాంతో ఇపుడు ప్రజలకు అందుతున్న సంక్షేమ పధకాలను ఇంకా ఎక్కువగా ఇస్తామని తెలుగుదేశం చెప్పబోతోంది. దానితో పాటు అభివృద్ధి కూడా చేస్తామని హామీ ఇస్తోంది. సంపదను సృష్టించడం ఎలాగో తనకు తెలుసు అని చంద్రబాబు అంటున్నారు. కచ్చితంగా ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెబుతూనే సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్థామని అంటోంది.

సంక్షేమానికి అసలైన చిరునామా తెలుగుదేశమని, ఎన్టీయార్ హయాం నుంచే సంక్షేమ పధకాలను ఏపీలో అమలు చేస్తున్నామని, దాని మీద పేటెంట్ రైట్స్ తమకే ఉన్నాయని వాదిస్తోంది. ఒక విధంగా టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అని అంటున్నారు. అభివృద్ధిని విడవకుండా సంక్షేమం కూడా చేస్తామని చెబుతోంది.

అంటే టీడీపీ చేతిలో రెండు అస్త్రాలు ఉన్నాయి. అదే వైసీపీ సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరిని ఆదరిస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో సంక్షేమం పెద్ద పీట పోషించనుంది అని అర్ధం అవుతోంది మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.