Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ.. టీడీపీ మహానాడు పైనే అందరి దృష్టి!

By:  Tupaki Desk   |   26 May 2023 12:52 PM GMT
ఎన్నికల వేళ.. టీడీపీ మహానాడు పైనే అందరి దృష్టి!
X
ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు విజయం సాధించడమే లక్ష్యంగా తమ అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి.

ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి అధికారంలోకి రావడం చావోరేవో లాంటిదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని చెబుతున్నారు. వైఎస్‌ జగన్‌ లాంటి బలమైన నేతను ఎదుర్కొని పార్టీని లాగించడం కష్టమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో నిర్వహించనున్న మహానాడుపై టీడీపీ గట్టి దృష్టి పెట్టింది. ఈ రెండు రోజులపాటు నిర్వహించనున్న మహానాడుకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 15 లక్షల మంది ప్రజలు వచ్చేలా టీడీపీ నేతలు శ్రమిస్తున్నారు.

అందులోనూ టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శత జయంతి సంవత్సరం కూడా కావడంతో టీడీపీ ఈ రెండు రోజుల మహానాడు వేడుకలను భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాజమండ్రి నగరం పసుపుమయంగా మారిపోయింది. ఎటు చూసినా హోర్డింగులు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజులపాటు రాజమండ్రిలోనే మకాం వేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆయన కుమారుడు నారా లోకేష్‌ సైతం తన పాదయాత్రకు నాలుగు రోజులు విరామం ప్రకటించారు. మహానాడులో పాల్గొనడానికి ఆయన కూడా వస్తున్నారు.

ఈ రెండు రోజుల మహానాడు వేదిక నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరిస్తారని చెబుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోతో పాటు జనసేన పార్టీ, కమ్యూనిస్టులు, బీజేపీలతో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో కూడా చెబుతారని తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యంగా అమలు చేయబోయే హామీలను కూడా ముందుగానే ప్రకటిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అదేవిధంగా ఈ రెండు రోజుల మహానాడులో భాగంగా టీడీపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చర్చ జరుగుతోంది. వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.

ఏపీలో టీడీపీ అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలే కీలకం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 19 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంటు సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో మరే జిల్లాలోనూ ఇన్ని స్థానాలు లేవు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహానాడుకు వేదికగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిని ఎంపిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇందులో భాగంగా మే 27న పార్టీ ప్రతినిధుల సభ.. 28న మహానాడు బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తారు. ఎన్నికల ముందు బలం చాటుకొనేలా 15 లక్షల మందితో నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశారు.చంద్రబాబు తన ప్రసంగంలో ప్రధానంగా రానున్న ఎన్నికల మేనిఫెస్టో పైన స్పష్టమైన హామీలు ఇస్తారని చెబుతున్నారు. సంక్షేమ పథకాలపైన చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేస్తారని పేర్కొంటున్నారు.