Begin typing your search above and press return to search.

టెక్సాస్‌లో 33 కోట్లు మోసం: భారతీయ భార్యాభర్తలు అరెస్ట్‌

అమెరికాలోని టెక్సాస్‌లో ఒకప్పుడు ప్రముఖంగా వెలుగొందిన భారతీయ దంపతులు సిద్ధార్థ ముకర్జీ (సామీ ముకర్జీ) , సునీత ముకర్జీ ఇప్పుడు భారీ మోసాల కేసులో అరెస్టయ్యారు.

By:  Tupaki Desk   |   22 July 2025 3:00 AM IST
టెక్సాస్‌లో 33 కోట్లు మోసం: భారతీయ భార్యాభర్తలు అరెస్ట్‌
X

అమెరికాలోని టెక్సాస్‌లో ఒకప్పుడు ప్రముఖంగా వెలుగొందిన భారతీయ దంపతులు సిద్ధార్థ ముకర్జీ (సామీ ముకర్జీ) , సునీత ముకర్జీ ఇప్పుడు భారీ మోసాల కేసులో అరెస్టయ్యారు. బాలీవుడ్ శైలిలో పబ్లిక్ ఫంక్షన్లలో కనిపించి ప్రసిద్ధి చెందిన ఈ జంట, ప్రస్తుతం అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) డిటెన్షన్ సెంటర్‌లో కస్టడీలో ఉన్నారు.

-వంద మంది బాధితులు.. రూ. 33 కోట్ల మోసం

అధికారుల నివేదికల ప్రకారం.. ముకర్జీ దంపతులు నకిలీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పేరుతో 100 మందికి పైగా బాధితుల నుండి సుమారు రూ. 33 కోట్లు ($4 మిలియన్లు) మోసగించారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి, నకిలీ పత్రాలు, ఫేక్ కాంట్రాక్టులు, డల్లాస్ హౌసింగ్ అథారిటీ పేరుతో జారీ చేసిన నకిలీ ఇన్‌వాయిస్‌లు చూపించి పెట్టుబడులు రాబట్టారు. ఈ భారీ కుంభకోణం 2024లో వెలుగులోకి వచ్చింది. ఒక దంపతులు తమ రూ. 2.7 కోట్లు ($325,000) పోయాయని ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు ఎఫ్.బీఐ వరకు విస్తరించి, మోసం మొత్తం బహిర్గతమైంది.

-బౌన్సయిన చెక్కులు, కల్పిత ప్రాజెక్టులు

బాధితులకు చెల్లించాల్సిన డివిడెండ్ చెక్కులు బౌన్స్ అవ్వడంతో ఈ మోసం బయటపడింది. డల్లాస్ హౌసింగ్ అథారిటీని సంప్రదించగా వారు ఈ ప్రాజెక్టులకు తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆ ప్రాజెక్టులన్నీ పూర్తిగా కల్పితమని తేలింది.

-వృద్ధులను బెదిరింపులు, పీపీపీ లోన్ మోసం

రియల్ ఎస్టేట్ మోసం కంటే షాకింగ్ విషయం ఏమిటంటే.. ముకర్జీలు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, అరెస్టు అవుతారని బెదిరిస్తూ తప్పుడు ఇమెయిళ్లు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కోవిడ్ సమయంలో అమెరికా ప్రభుత్వం అందించిన పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (PPP) లోన్‌లను పొందడానికి నకిలీ ఉద్యోగులు.. జీతాల రికార్డులను చూపించి నిధులు పొందినట్లు విచారణలో వెల్లడైంది.

-దివాలా ప్రకటన తర్వాత అరెస్ట్

అధికారుల నిఘాలో ఉన్నప్పటికీ ముకర్జీలు 2024 వరకు తమ సామాజిక జీవితాన్ని కొనసాగించారు. చివరికి దివాలా పిటిషన్ దాఖలు చేసిన తర్వాతనే వీరి అరెస్ట్ జరిగింది. మోసంతో వచ్చిన డబ్బు కొంత విదేశీ ఖాతాలకు లేదా క్రిప్టో కరెన్సీకి తరలించి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

-భారత్‌లోనూ మోసాల కేసు

సిద్ధార్థ ముకర్జీపై ముంబైలోనూ ఫ్రాడ్ వారెంట్లు ఉన్నట్లు అరెస్ట్ అఫిడవిట్‌లో వెల్లడైంది. వీరిద్దరూ భారతదేశం నుండి అమెరికా వచ్చి ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం వారి ఇమ్మిగ్రేషన్ స్థితి స్పష్టంగా లేదని పేర్కొన్నారు.

-భారీ శిక్ష పడే అవకాశం

ఈ కేసులో దోషులుగా తేలితే, ముకర్జీలకు కనీసం ఐదేళ్ల నుండి గరిష్టంగా 99 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కేసు లోతుగా విచారణ జరుగుతుండగా ఇంకా అనేక మంది బాధితులు ముందుకు రావచ్చని భావిస్తున్నారు.

ఈ సంఘటన భారతీయ సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. ప్రతిష్టను కవర్‌గా ఉపయోగించి ఎంతటి మోసాలు చేయగలరో ఈ కేసు స్పష్టంగా చూపిస్తోంది.