Begin typing your search above and press return to search.

అన్న క్యాంటిన్ లో భోజనం చేసిన ఎన్నారై... కామెంట్స్ ఇవే!

అవును... పేదల ఆకలి తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అన్న క్యాంటిన్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   7 Nov 2025 10:39 AM IST
అన్న క్యాంటిన్ లో భోజనం చేసిన ఎన్నారై... కామెంట్స్ ఇవే!
X

రోడ్డు పక్క బండి వద్ద టీ తాగాలన్నా రూ.10కి తక్కువ తీసుకోని ఈ రోజుల్లో.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయినా.. మధ్యాహ్నం, రాత్రికి భోజనమైనా రూ.5కే అన్న క్యాంటీన్లలో ఇస్తున్న సంగతి తెలిసిందే. నాణ్యమైన ఆహారం ఇంత తక్కువకు మరెక్కడా దొరకదు అనే స్థాయిలో అన్నా క్యాంటిన్లు ఏపీలో పేరు, పేద ప్రజల అభిమానం సంపాదించుకున్నాయి.

వీటి వల్ల రోజువారీ కూలీలే కాదు.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకొనే విద్యార్థులకు కూడా రూ.15కే మూడు పూటలా కడుపు నిండుతోంది. అయితే ఈ అన్న క్యాంటిన్లు పేదల మన్ననలు పొందడమే కాదు.. ఇప్పుడు తాజాగా ఓ ఎన్నారై మనసు గెలుచుకుంది. తాజాగా అన్న క్యాంటిన్ లో భోజనం చేసి ఆహారం రుచి చూసిన ఓ ఎన్నారై అద్భుతమంటూ కితాబిచ్చారు.

అవును... పేదల ఆకలి తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అన్న క్యాంటిన్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీటి ప్రత్యేకత, పేదలకు ఇది అందించే ఆహారం ఎన్నో ప్రశంసలు పొందుతోంది. ఈ క్రమంలో.. ఈ అన్న క్యాంటీన్‌ వ్యవస్థ దిగ్విజయంగా నడుస్తోందని, ఇంతమంచి కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించే దిశగా ఆలోచిస్తున్నామని ఎన్నారై వెంకట్‌ చెప్పారు.

వివరాళ్లోకి వెళ్తే... గుంటూరు అమరావతి రోడ్డులోని అన్న క్యాంటీన్‌ ను గురువారం ఎన్నారై వెంకట్ ఇక్కుర్తి సందర్శించారు. ఈ సందర్భంగా ఆ క్యాంటిన్ల నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. ఈ క్రమంలోనే భోజనం చేసి ఆహారం రుచి చూసిన ఆయన.. రుచితో పాటు నాణ్యత బాగున్నాయని కితాబు ఇచ్చారు. ఇదే క్రమంలో అక్కడ తింటున్నవారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ఎన్నారై వెంకట్ ఇక్కుర్తి.. తమది గుంటూరులోని బ్రాడీపేట అని.. తాను 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నామని.. తనకు అక్కడి పౌరసత్వం వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల గురించి అమెరికాలో తమ స్నేహితుల మధ్య చర్చ జరిగినట్లు వెల్లడించారు. తాజాగా ఇండియాకు వచ్చినందున క్యాంటీన్‌ ను పరిశీలించినట్లు పేర్కొన్నారు.

కాగా... అన్న క్యాంటీన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 11, 2018న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభించిన సబ్సిడీ ఆహార కార్యక్రమం అనే సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేవలం 5 రూపాయల నామమాత్రపు ధరకే అల్పాహారం, భోజనం అందిస్తుంది.