పుట్టా రాజీనామా...వైసీపీ బిగిస్తోంది
టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ విషయం వైసీపీకి రాజకీయంగా ఆయుధంగా మారింది. సరైన సమయంలో ఒక అవకాశంగా అంది పుచ్చుకుంటోంది.
By: Tupaki Desk | 17 March 2026 12:04 AM ISTటీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ విషయం వైసీపీకి రాజకీయంగా ఆయుధంగా మారింది. సరైన సమయంలో ఒక అవకాశంగా అంది పుచ్చుకుంటోంది. దాంతో ఇదే చాన్స్ అన్నట్లుగా కూటమిని గట్టిగా బిగిస్తోంది. గత రెండు రోజులుగా ఇదే విషయం మీద వైసీపీ కీలక నేతలు అంతా వరసబెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మీడియా డిబేట్లు పెడుతున్నారు. డిమాండ్ల మీద డిమాండ్లు చేస్తున్నారు. ఏదో విధంగా ఈ ఇష్యూని లైం లైట్ లో ఉంచాలని వైసీపీ చూస్తోంది. ఎంపీని ముందు పెట్టి టీడీపీని కార్నర్ చేయాలని భారీ స్కెచ్ గీస్తోంది.
నోటీసుల డ్రామా వద్దు :
ఏపీలో ఒక ఎంపీ బాధ్యత గలిగిన నేత అయి ఉండి డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాక టీడీపీ ఇంకా ఉపేక్షించడమేంటి అని వైసీపీ రెట్టిస్తోంది. ఎంత సేపు షోకాజ్ నోటీసుల పేరుతో సాగదీస్తారు అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ నోటీసుల డ్రామాలు అయితే వద్దే వద్దు అని స్పష్టం చేస్తోంది. టీడీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం సదరు ఎంపీ చేత రాజీనామా చేయించండి అంటూ గట్టిగా కోరుతోంది.
బెయిల్ ఇప్పించడమేంటి :
డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన తరువాత ఎంపీకి బెయిల్ ఇప్పిస్తారా అని వైసీపీ మండిపడుతోంది. ఇక షోకాజ్ నోటీసులు అని మీనమేషాలు లెక్కినడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీడీపీ అధినేతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇంత సీరియస్ విషయంలో సరిగ్గా స్పందించాలని డిమాండ్ చేస్తోంది. కేవలం ఈ డ్రగ్స్ ఇష్యూ మాత్రమే కాదు ఆడవారి మీద వేధింపులకు పాల్పడిన కూటమి ఎమ్మెల్యేల మీద ఏ విధమైన చర్యలు తెసుకున్నారని వైసీపీ నిలదీస్తోంది. అరవ శ్రీధర్, ఆదిమూలం, రవికుమార్, అహ్మద్, మంత్రి సంధ్యారాణి పీఏల మీద అసలు చర్యలు లేనే లేవని వైసీపీ ఫైర్ అవుతోంది.
కూటమిని క్షమించరని :
వీటికి మించి ఫొటోలతో సహా అడ్డంగా దొరికిన టీటీడీ ఛైర్మన్ పైన కూడా ఇప్పటిదాకా నో యాక్షన్ అన్న తీరుగానే కూటమి వ్యవహారం ఉందని వైసీపీ తప్పుపడుతోంది. అందువల్ల ముందు ఏలూరు ఎంపీతో రాజీనామా చేయించాలని, అలాగే ఆరోపణలు వచ్చిన కూటమి నేతలు ప్రజా ప్రతినిధులు అందరిపైనా చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. అలా కనుక కూటమి పెద్దలు చేయకుంటే ప్రజలు ఏ విధంగానూ కూటమిని క్షమించరని స్పష్టం చేయడం విశేషం.
