Begin typing your search above and press return to search.

వ‌య‌సులో చిన్న‌వాడిని.. ఒక్క విష‌యం అడుగుతా చెప్పండి: సీఎం జ‌గ‌న్

''నా కంటే ముందు చాలా మంది సీఎంలుగా చేశారు. నాకన్నా వయసు, అనుభవం ఎక్కువ ఉన్న వారు పని చేశారు

By:  Tupaki Desk   |   28 March 2024 9:53 AM GMT
వ‌య‌సులో చిన్న‌వాడిని.. ఒక్క విష‌యం అడుగుతా చెప్పండి:  సీఎం జ‌గ‌న్
X

ఏపీ సీఎం జ‌గ‌న్ ఎన్నికల ప్ర‌చారంలో తొలి సారి ''వ‌య‌సులో చిన్న‌వాడిని.. అనుభ‌వంలోనూ చిన్న‌వాడిని.. మిమ్మ‌ల్ని ఒక‌టి అడుగుతా చెప్పండి'' అంటూ ప్ర‌జ‌ల‌కు విన్న‌వించారు. తాను చేస్తున్న సంక్షేమం.. తాను చేస్తున్న అభివృద్ధి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో అనుభ‌వం ఉంద‌ని చెప్పుకొంటున్న చంద్ర‌బాబు చేశారా? అని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు. దీనికి స‌హ‌జంగానే ప్ర‌జ‌ల నుంచి లేదు-లేదు అనే స‌మాధాన‌మే వ‌చ్చింది.

ప్ర‌స్తుతం ''మేమంతా సిద్ధం' పేరుతో జ‌గ‌న్‌.. ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే ఈ క్ర‌మం లో ఆయ‌న నంద్యాల జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. స్థానిక ఎర్ర‌గుంట్ల గ్రామ ప్ర‌జ‌ల‌తో జ‌గ‌న్ మ‌మేక‌మ‌య్యా రు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. ''ఏ పార్టీ అని చూడకుండా, ఎలాంటి వివక్ష లేకుండా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నా. లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నా'' అని తెలిపారు.

అంతేకాదు.. రాష్ట్రంలోని అర్హులైన అక్కాచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం నింపేందుకు, పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాను బటన్లు నొక్కుతూ నేరుగా అకౌంట్లలో నగదు జమ చేస్తున్నానని జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఒక్క ఎర్రగుంట్లలోనే 93 శాతం మంది లబ్ధి పొందారని చెప్పారు. ప్రజలకు వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని గణాంకాలతో స‌హా పేరు పేరునా వివ‌రించారు. అయితే.. ఈ క్ర‌మంలో ఆయ‌న బేల మాటలు మాట్లాడారు.

''నా కంటే ముందు చాలా మంది సీఎంలుగా చేశారు. నాకన్నా వయసు, అనుభవం ఎక్కువ ఉన్న వారు పని చేశారు. వయసులో నేను చిన్నవాడిని. ఒక చిన్నవాడిగా అడుగుతున్నా.. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి అనుభవం మీ జీవితాలను మార్చిందా?. ఆయ‌న ఇన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఎందుకు అమ‌లు చేయ‌లేదు'' అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఎంత ఉందో అందరూ ఆలోచన చేయాలని సీఎం జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలు బాగుపడ్డాయని జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. ''మీ బిడ్డ పాలనలో ఏ స్థాయిలో మార్పు జరిగిందో ఆలోచించాలి. ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చే ఎన్నికలు. మన భవిష్యత్తు కోసం మంచిని చూసి ఓటు వేయాలి'' అని సీఎం జ‌గ‌న్ పిలుపునిచ్చారు.