Begin typing your search above and press return to search.

భారీ షాక్ : యనమల తమ్ముడు వైసీపీలోకి...!?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గం గా ఉన్న తునిలో ప్రముఖ రాజకీయ కుటుంబం యనమల ఫ్యామిలీ ఇపుడు రెండుగా చీలిపోతోంది

By:  Tupaki Desk   |   13 March 2024 6:19 PM GMT
భారీ షాక్ : యనమల తమ్ముడు వైసీపీలోకి...!?
X

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గం గా ఉన్న తునిలో ప్రముఖ రాజకీయ కుటుంబం యనమల ఫ్యామిలీ ఇపుడు రెండుగా చీలిపోతోంది. రాజకీయాలే ఆ కుటుంబాన్ని ఇలా విభజిస్తున్నాయని అంటున్నారు. తునిలో మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నేత అయిన యనమల రామక్రిష్ణుడు తమ్ముడు క్రిష్ణుడు టీడీపీని వీడిపోతున్నారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

క్రిష్ణుడు టీడీపీ నుంచి మూడు పర్యాయాలు పోటీ చేసినా ఎమ్మెల్యే కాలేకపోయారు. ఆయన 2009 నుంచి అలుపెరగని విక్రమార్కుడిగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యే అన్న పదవి ఆయనను వరించలేదు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో టీడీపీ ఆయనను పక్కన పెట్టి యనమల రామక్రిష్ణుడు కుమార్తె దివ్యను టికెట్ ఇచ్చింది.

దీంతో మనస్తాపానికి గురి అయిన క్రిష్ణుడు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనను అన్న రామక్రిష్ణుడు, దివ్య కూడా పార్టీ వ్యవహారాలలోకి రానీయడం లేదని క్రిష్ణుడు వర్గం మధనపడుతోంది. దాంతో క్రిష్ణుడు తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.

ఆయన ఈ నెల 15 లేదా 17 తేదీలలో ఏదో ఒక రోజున టీడీపీని వీడి వైసీపీలో చేరుతారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే గతంలోనే క్రిష్ణుడు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే హడావుడిగా టీడీపీ పెద్దలు ఆయనను పిలిచి బుజ్జగించారు అని ప్రచారం జరిగింది. మొత్తానికి అపుడు మెత్తబడిన క్రిష్ణుడు ఈసారి మాత్రం తగ్గరని అంటున్నారు.

ఆయనకు టీడీపీలో ప్లేస్ లేదని తేలిపోయింది అని అంటున్నారు. రామక్రిష్ణుడు వారసురాలిగా దివ్య ఓడినా గెలిచినా ఉంటారు. దాంతో క్రిష్ణుడు తన రాజకీయ భవిష్యత్తుని చూసుకోవాలని చూస్తున్నారు అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో బుధవారం తుని అసెంబ్లీ మీద సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చకు వచ్చాయని అంటున్నారు. దాంతో ఈ విషయం మీద వైసీపీ ఫోకస్ పెట్టింది అని అంటున్నారు.

తూర్పు గోదావరిలో వైసీపీకి రాజకీయంగా విజయం ముఖ్యం. సామాజిక సమీకరణలను సరిచూసుకుంటోంది. బీసీలను దగ్గరకు తీస్తోంది. ఈ నేపధ్యంలో ఒక కీలక భరోసా క్రిష్ణుడికి ఇస్తారు అని అంటున్నారు. మొత్తానికి అన్నీ కుదిరితే కృష్ణుడు టీడీపీని వీడి వైసీపీలో చేరుతారు అని అంటున్నారు.