చంద్రబాబుపై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు.. టీడీపీలో కనిపించని స్పందన!
76 ఏళ్ల వయసులో రాజకీయంగా ఎంతో చురుగ్గా ఉన్న ముఖ్యమంత్రిపై ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే టీడీపీ నుంచి విజయసాయిపై ఎలాంటి కౌంటర్ రాకపోవడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
By: Tupaki Political Desk | 25 April 2026 7:50 PM ISTటీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాలతో నెలకు రూ.5 వేల కోట్లు సంపాదిస్తున్నారని, 80 ఏళ్ల వయసులో ఈ అక్రమార్జనతో ఆయన ఏం చేసుకుంటారని వ్యాఖ్యానించిన విజయసాయిరెడ్డి.. అంతకంటే తీవ్రమైన విమర్శలతో అందరినీ షాక్ కు గురిచేశారు. చనిపోయే ముందు కాస్త మంచి పనులు చేయమంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. 76 ఏళ్ల వయసులో రాజకీయంగా ఎంతో చురుగ్గా ఉన్న ముఖ్యమంత్రిపై ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే టీడీపీ నుంచి విజయసాయిపై ఎలాంటి కౌంటర్ రాకపోవడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సహజంగా రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు సాధారణంగానే పరిశీలించవచ్చునని అంటున్నారు. కానీ, చంద్రబాబు స్థాయి నేతను పట్టుకుని విజయసాయిరెడ్డి చేసిన దారుణ వ్యాఖ్యలే కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘చంద్రబాబుకు 80 ఏళ్లు వస్తున్నాయి. ఒక్కగానొక్క కొడుకు. ఏం చేస్తాడు. ఈ డబ్బు అంతా ఎత్తుకుపోతాడా. 40-45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కొన్ని లక్షల కోట్లు ఆర్జించాడు. ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా? ఈ భూమిపై చంద్రబాబు శాశ్వతమా? అందుకే నేను ఒకటే చెబుతున్నా, ఎట్ లీస్ట్ చనిపోయేటప్పుడు అయినా మంచి పని చేసి చచ్చిపో చంద్రబాబు.’’ అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రముఖ నాయకుల్లో ఒకరైన చంద్రబాబుపై రాజకీయ విమర్శలకు బదులుగా విజయసాయిరెడ్డి శాపాలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో విజయసాయిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు సైతం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసేవారని అంతా గుర్తు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి లాంటి వారివల్ల వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకున్నా, ఆయన తీరు ఇప్పటికీ మారలేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక తన ఇంట్లో ఈడీ దాడులను తట్టుకోలేక విజయసాయి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఈ దారుణ విమర్శలకు దిగారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే చంద్రబాబుపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ స్థాయిలో విరుచుకుపడినా, టీడీపీ నుంచి ఏ ఒక్క నేత కౌంటర్ ఇవ్వకపోవడమే రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. విజయసాయిరెడ్డి శోకాలను టీడీపీ పెద్దగా పట్టించుకోలేదా? లేక సమయం కోసం ఎదురుచూస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. ఏదిఏమైనప్పటికీ ఒక మనిషి చావు కోసం బహిరంగంగా మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అంటున్నారు.
