Begin typing your search above and press return to search.

ఉండవల్లిలో కార్చిచ్చు కుట్ర..? అమరావతిలో మరో రచ్చ!

రాజధాని అమరావతి పరిధిలోని ఉండవిల్లి కొండపై ఆదివారం సాయంత్రం చెలరేగిన మంటలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   25 May 2026 4:19 PM IST
ఉండవల్లిలో కార్చిచ్చు కుట్ర..? అమరావతిలో మరో రచ్చ!
X

రాజధాని అమరావతి పరిధిలోని ఉండవిల్లి కొండపై ఆదివారం సాయంత్రం చెలరేగిన మంటలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలో ఆకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం అనూహ్యంగా కొండపై మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ చోటుచేసుకుందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మంటలు అంటించారా? అన్న కోణంలో ప్రభుత్వం విచారణ చేయిస్తోంది.

రాజధాని పరిధిలో తరచూ ఇలాంటి అనూహ్య ఘటనలు జరుగుతుండటం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోందని అంటున్నారు. ఉండవిల్లి కొండపై గతంలోనూ మంటలు వ్యాపించిన ఘటనలు ఉన్నాయి. దీంతో ఆదివారం సాయంత్రం కూడా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయనే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో రాజధానిలో పైపులు తగలబడిపోవడం, అరటి తోటలకు నిప్పు పెట్టడం వంటి ఘటనల నేపథ్యంలో ఉండవిల్లి కొండపైనా అటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడ్డారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానంగా రాజధాని పనులు జరుగుతున్న వేళ ఇలాంటి ప్రమాదం జరగడంపై అధికార పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోందని అంటున్నారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు వ్యాపించి కొండంతా నిప్పులు ఎగజిమ్మడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా మంటలు భారీగా విస్తరించడంపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే కొండపై ఆకులు, చెట్లు ఎండిపోవడంతో మంటలు త్వరగా విస్తరించాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎవరైనా పొరపాటున సిగరెట్, బీడీ వంటివి కాల్చే విసిరేయడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదం జరిగి ఉండొచ్చునని అంటున్నారు.

ఇదే సమయంలో గంజాయి బ్యాచ్ ఆగడాలపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఒకేసారి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటం తీవ్ర సంచలనంగా మారింది. రాజధాని పరిణామాల నేపథ్యంలో ఈ ప్రమాదంపై ప్రభుత్వం ఆఘమేఘాలపై స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెంటనే రంగంలోకి దిగి అగ్నిమాపక అధికారులను ఉరుకులు పరుగులు తీయించారు. అదే సమయంలో కాస్త వర్షం పడటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఏదిఏమైనా రాజధానిలో చెలరేగిన మంటలు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి.