Begin typing your search above and press return to search.

టీడీపీ టార్గెట్ సీఎస్...మరో బ్రేకింగ్ న్యూస్ ?

ఇక మరో కీలకమైన పోస్ట్ మీద ఇపుడు టీడీపీ టార్గెట్ చేసింది. ఆయనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి.

By:  Tupaki Desk   |   7 May 2024 5:38 PM GMT
టీడీపీ టార్గెట్ సీఎస్...మరో బ్రేకింగ్ న్యూస్ ?
X

ఏపీ డీజీపీని మార్చాలని డిమాండ్ చేసిన టీడీపీ ఆ విషయంలో సక్సెస్ అయింది. అయితే తాము అనుకున్న వారు కొత్త డీజీపీ అవుతారు అని ఆశించినా అది నెరవేరలేదు. అయినా రాజేంద్రనాధ్ రెడ్డిని డీజీపీ సీటు లో నుంచి దించేయడం పట్ల మాత్రం టీడీపీ పూర్తి సంతృప్తిగా ఉంది. ఈ విషయంలో సక్సెస్ అయ్యామని భావిస్తోంది.

కొత్త డీజీపీ పద్ధతి ప్రకారం వ్యవహరిస్తారు కాబట్టి ఎలక్షనీరింగ్ లో వైసీపీ ఏమీ చేయకుండా నిరోధించవచ్చు అన్న నిబ్బరాన్ని కూడా టీడీపీ కనబరుస్తోంది. ఇక మరో కీలకమైన పోస్ట్ మీద ఇపుడు టీడీపీ టార్గెట్ చేసింది. ఆయనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి.

ఆయనను ఆ సీటు నుంచి కదపాలని టీడీపీ చూస్తోంది. సీఎస్ ని తప్పించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈసీకి ఈ విషయంలో విన్నపాలు చేస్తున్నారు. ఎన్నికల వేళకు ఆయన ఉండరాదని వారు కోరుకుంటున్నారు. దీనికి కారణం ఉంది అంటున్నారు. ప్రభుత్వం అంటే ఇపుడు సీఎస్ గానే ఉంది. ఆయన ఆదేశాలతోనే ఇతర వ్యవస్థలు ముందుకు సాగుతాయి. కాబట్టి అత్యంత కీలకమైన స్థానంలో ఉన్న జవహర్ రెడ్డిని కదపాల్సిందే అన్నది టీడీపీ మాటగా ఉంది.

మూడు రోజుల క్రితం ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను బాబు కలసి ఏకాంత మంతనాలు జరిపారని అంటున్నారు. ఆ తరువాతనే అనేక కీలక పరిణామాలు జరిగాయి. ఇక ఇపుడు సీఎస్ విషయంలో కూడా టీడీపీ పట్టుదలగా ఉంది. పోలింగ్ కి గట్టిగ అయిదు రోజులు కూడా లేవు.

దాంతో బ్రేకింగ్ న్యూస్ వినే అవకాశం ఉందని టీడీపీ వైపు నుంచి ఆశాభావం అయితే ఉంది. ఇప్పటిదాకా చూస్తే ఏపీలో అనేక కీలక జిల్లాలలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగిపోయాయి. దాని మీద వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

నిబద్ధతతో వ్యవహరించే అధికారులను మార్చడం ఏమిటి అని ఆయన ఫైర్ అయ్యారు. అధికారులను ఇష్టారాజ్యంగా బదిలీలు చేస్తున్నారు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా మచిలీపట్నం సభలో విమర్శించారు. అయితే ఈసీకే సర్వాధికారాలు కాబట్టి పోలింగ్ సాఫీగా సాగడానికి అవసరం అయిన అన్ని చర్యలను ఎప్పటికపుడు తీసుకుంటుందని అధికారులు అంటున్నారు.

మరి సీఎస్ బదిలీ అవుతుందా పోలింగ్ కి దగ్గర పడుతున్న వేళ అనూహ్య పరిణామాలు ఏపీలో చోటు చేసుకుంటాయా అంటే టీడీపీ మాత్రం తమ డిమాండ్లు అవేనని అంటోంది. మరి ఏపీలో ఏ క్షణమైనా మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చే చాన్స్ ఉందా అంటే వెయిట్ అండ్ సీ.