Begin typing your search above and press return to search.

ఏపీ అప్పులకు జగన్ అడ్డుపుల్లలు.. చంద్రబాబు సర్కారుకు చుక్కలు

ఏపీలో అధికార, ప్రతిపక్షాల యుద్ధం తారాస్థాయిలో కొనసాగుతోంది. రాజకీయంగా పైచేయి సాధించేందుకు రెండు పక్షాలు దీటుగా పావులు కదుపుతున్నాయి.

By:  Tupaki Desk   |   9 July 2025 11:51 AM IST
ఏపీ అప్పులకు జగన్ అడ్డుపుల్లలు.. చంద్రబాబు సర్కారుకు చుక్కలు
X

ఏపీలో అధికార, ప్రతిపక్షాల యుద్ధం తారాస్థాయిలో కొనసాగుతోంది. రాజకీయంగా పైచేయి సాధించేందుకు రెండు పక్షాలు దీటుగా పావులు కదుపుతున్నాయి. వైసీపీ నేతల అరెస్టులతో ప్రభుత్వం దాడి చేస్తుండగా, సర్కారు నిధుల సేకరణకు వైసీపీ అడ్డుగా నిలుస్తోందని విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోందని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తీసుకోవాలని భావించిన రూ.7 వేల కోట్లకు అదనంగా మరో రెండు వేల కోట్లు అప్పు తేడానికి చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తే, నిబంధనల పేరిట వైసీపీ ఫిర్యాదు చేయడంతో రుణ ప్రయత్నాలు ఆలసమయ్యాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తాజా పోరు బయటకు వచ్చింది.

రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) బాండ్ల జారీ ద్వారా రూ.9 వేల కోట్లు రుణం సమీకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే, పెట్టుబడిదారులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు పంపి ప్రభుత్వ రుణ ప్రయత్నాలను వైసీపీ అడ్డుకోవాలని చూసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన కేశవ్ పలు అంశాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అందకుండా అభివృద్ధిని అడ్డుకోవాలని మాజీ సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని కేశవ్ ఆరోపించారు. జగన్ కు తోడుగా మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గంటల తరబడి ప్రెస్మీట్లు పెట్టి రాష్ట్రాభివృద్ధిపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు బ్రాండ్ ఏపీని ప్రత్యక్షంగా నాశనం చేశారని, ఇప్పుడు తప్పుడు ట్వీట్లు, విష ప్రచారాలతో పరోక్షంగా దెబ్బతీయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

ఏపీఎండీసీ బాండ్లను కొనుగోలు చేయకుండా జగన్ తోపాటు వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆర్థిక మంత్రి కేశవ్ ఆరోపించారు. వీరికి జర్మనీలో ఉంటున్న ఉదయ భాస్కర్ అనే వ్యక్తి అన్ని విధాలా సహకరించాడని చెప్పారు. ఏపీఎండీసీ బాండ్లు కొనొద్దంటూ ఉదయ భాస్కర్ 200 మంది ఇన్వెస్టర్లకు ఈ-మెయిల్ పంపినట్లు కేశవ్ తెలిపారు. అయితే ఆ ఈ-మెయిల్స్ ను ఇన్వెస్టర్లు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో వైసీపీ ఎమ్మెల్సీ హైకోర్టులో పిల్ వేసి అడ్డుకోవాలని చూశారన్నారు. విషయం కోర్టులో ఉందని పెట్టుబడులు పెట్టొద్దని ఇన్వెస్టర్లకు మరో మారు లేఖలు పంపారని తెలిపారు. దీనిపై జగన్ పత్రిక సాక్షిలో తప్పుడు రాతలు రాశారని ధ్వజమెత్తారు. వీటిపై జగన్మోహనరెడ్డి ట్వీట్లు చేయడం, ఆ రాతలు, ట్వీట్లు పట్టుకుని బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టినట్లు కేశవ్ వివరించారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో ప్రధాని, కేంద్ర ఆర్థిక, ఆర్బీఐ, సెబీ, ఇతర ఎక్సేంజ్ లకు ఫిర్యాదులు చేయించారని కేశవ్ ఆరోపించారు.

వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై ఇన్వెస్టర్లు విశ్వాసం కోల్పోలేదని, ఏపీఎండీసీ ఇష్యూ చేసిన బాండ్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యాయని కేశవ్ వెల్లడించారు. వైసీపీ వల్ల నాలుగు గంటల్లో రావాల్సిన అనుమతులకు 15 రోజుల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని నిబంధనలను అనుసరించే రూ.9000 కోట్లకు అనుమతిచ్చిందని మంత్రి తెలిపారు. వాస్తవానికి గత ఏడాది మార్చి 15న జీవో 35 ద్వారా వైసీపీ ప్రభుత్వమే రూ.7 వేలు కోట్లు సమీకరించాలని చూసిందని, తాము అదనంగా రూ.2 వేలు కోట్లు సేకరించేందుకు మరో జీవో జారీ చేశామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలను తాము కొనసాగిస్తే తమపై బురద జల్లుతున్నారని విమర్శలు గుప్పించారు.