Begin typing your search above and press return to search.

17 కేటగిరీలు.. 243 మందికి పదవులు.. టీడీపీ జంబో లిస్టు

టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పదవుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తి చేసింది.

By:  Tupaki Political Desk   |   15 April 2026 2:02 PM IST
17 కేటగిరీలు.. 243 మందికి పదవులు.. టీడీపీ జంబో లిస్టు
X

టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పదవుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తి చేసింది. పార్టీలో వివిధ కేటగిరిలకు చెందిన పదవులకు మొత్తం 243 మందిని ఎంపిక చేసింది. గతానికి భిన్నంగా ఈ సారి కొత్తవారికి అవకాశం ఇవ్వడంతోపాటు అందరినీ సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో చాలా మందికి పార్టీ పదవులను కట్టబెట్టినట్లు కనిపిస్తోందని అంటున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతోపాటు మొత్తం 17 కేటగిరిలతో కూడిన జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

మొత్తం 62 జాతీయ స్థాయి పదవులు, 77 రాష్ట్రస్థాయి పదవులకు 243 మందిని ఎంపిక చేశారు అధినేత చంద్రబాబు. ఈ జాబితాలో ఎవరూ ఊహించని పేర్లను చేర్చి ఆశ్చర్యానికి గురిచేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ సూచనలతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పించారు. మొత్తం 26 మందిని పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించగా, పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మంత్రి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయులు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా పొలిట్ బ్యూరోకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

టీడీపీలో అత్యున్నత కార్యవర్గంగా అధ్యక్షుడి నిర్ణయాలను సైతం సమీక్షించేలా పొలిట్ బ్యూరో పనిచేస్తుంది. దీంతో పొలిట్ బ్యూరో మెంబర్ పదవికి పార్టీలో విశిష్ట స్థానం ఉంటుందని చెబుతున్నారు. ఇక సీనియర్లు తమ పదవుల నుంచి తప్పుకుని కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిందిగా గత కొంతకాలంగా మంత్రి నారా లోకేశ్ కోరుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ సారి పొలిట్ బ్యూరోలో కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్లకు అవకాశం కల్పించారు. ఈ విషయంలో అధినేత చంద్రబాబు కీలక నిర్ణయమే తీసుకున్నారని అంటున్నారు.

మరోవైపు పొలిట్ బ్యూరోలో ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 29 మందికి అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జాతీయ కార్యవర్గంలో 18 మందిని ఉపాధ్యక్షులుగా నియమించారు. పది మందికి జాతీయ అధికార పదవులు కట్టబెట్టారు. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గంలో 16 మంది ఉపాధ్యక్షులు, ఏడుగురు ప్రధాన కార్యదర్శులు, 14 మంది అధికార ప్రతినిధులను నియమించారు. ఇక పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేలా జోనల్ ఇంచార్జిల వ్యవస్థను ఏర్పాటు చేసిన పార్టీ అధినేత మొత్తం 10 మందిని జోనల్ కో-ఆర్డినేటర్లుగా నియమించారు.

ఇక అత్యధికంగా 77 మంది నేతలకు రాష్ట్ర కార్యదర్శుల పదవులను కట్టబెట్టారు. తెలంగాణకు చెందిన అరవింద్ కుమార్ గౌడ్, బక్కిన నర్సింహులు, నన్నూరి నర్సిరెడ్డి వంటి వారికి జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించారు. మరోవైపు అండమాన్ నికోబార్ దీవుల్లో టీడీపీ తరఫున పనిచేస్తున్న మాధవనాయుడును జాతీయ ఉపాధ్యక్ష పదవిలో నియమించారు. ఇలా నూతన కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా నేతలతోపాటు ప్రాంతాల వారీగా సమ ప్రాధాన్యం కల్పించారు. పార్టీలో అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. పాత-కొత్త నేతల కలయికతో చేసిన ఈ నియామకాలతో పార్టీలో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని ప్రయత్నించినట్లు చెబుతున్నారు.