ఫ్రీబీస్ ఎఫెక్ట్: ఎవరొచ్చినా.. జనాలకు పండగే.. !
ఫ్రీబీస్.. ఎన్నికల సమయంంలో ప్రజలను మచ్చిక చేసుకునేందుకు.. వారి ఓట్లను దూసుకునేందుకు రాజకీయ పార్టీలు ఇచ్చేహామీలు.
By: Tupaki Desk | 22 July 2025 7:00 PM ISTఫ్రీబీస్.. ఎన్నికల సమయంంలో ప్రజలను మచ్చిక చేసుకునేందుకు.. వారి ఓట్లను దూసుకునేందుకు రాజకీయ పార్టీలు ఇచ్చేహామీలు. ఇవి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రత్యేకం. ఆయా రాష్ట్రాల ప్రజల అవసరాలు, వారి అభిరుచులు, ప్రత్యర్థుల రాజకీయ స్థాయిలు.. ఇలా అనేక విషయాలు ప్రభావితం చేస్తాయి. వీటిని తట్టుకుని.. ప్రజలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలోనే పార్టీలు.. ఉచితాలకు ప్రాధాన్యం ఇస్తా యి. ఉత్తరాది రాష్ట్రాల కంటే కూడా..దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఫ్రీబీస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
దీంతో ఎన్నికల వేళ ప్రజలు కూడా తమకు ఏ పార్టీ ఏమిస్తుంది? ఏయే పథకాలను ప్రకటిస్తుంది? అనే విషయాలపై ఆసక్తి చూపుతారు. అంతేకాదు.. ప్రజల మైండ్ సెట్ కూడా ఇప్పుడు ఉచితాలపైనే ఉంది. దీంతో పార్టీలు ఏమాత్రం సంకోచించకుండా పథకాల ప్రకటనకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. చిత్రం ఏంటంటే.. ఒక ప్రభుత్వం ప్రారంభించిన లేదా అమలు చేసిన పథకాన్ని తదుపరి వచ్చే ప్రభుత్వం కూడా కొన సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. లేకపోతే.. ఇబ్బందులు తప్పడం లేదు.
ఉదాహరణకు వైసీపీ సర్కారు.. గతంలో టీడీపీ అమలు చేసిన అన్న క్యాంటీన్లను రద్దు చేసింది. ఇది సామాన్యులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఎన్నికలకు ముందు.. ఇది పెద్ద నినాదంగా కూడా మారిం ది. ఇక, 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. దీనికి ముందు వైసీపీ అమలు చేసిన పథకాలను అమలు చేయాల్సి వస్తోంది. గతంలో అమ్మ ఒడికి ఇప్పుడు పేరు మార్చి తల్లికి వందనం పేరుతో అమలు చేస్తున్నారు. అలానే.. కొత్త పథకాలకు కూడా శ్రీకారం చుట్టారు.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకం.. వంటివి గత ఏడాది టీడీపీ ప్రకటించిన హామీలు. వీటిలో గ్యాస్ ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం అమలవుతోంది. ఉచిత బస్సు పథకం.. వచ్చే నెలలో ప్రారంభం అవుతుంది. అయితే.. చిత్రం ఏంటంటే.. వచ్చే ఎన్నికల నాటికి కూడా ఈ పథకాలు కొనసాగుతాయి. అంతేకాదు.. ఏ ప్రభుత్వం వచ్చినా. వీటిని అమలు చేయకతప్పదు. ఎన్నికల్లో హామీలు కూడా ఇవే ఉంటాయి.
గతంలో అమ్మ ఒడిని ప్రకటించిన వైసీపీని డామినేట్ చేస్తూ.. చంద్రబాబు అదే పథకాన్ని ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తామన్నారు. అలానే.. వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఉచిత పథకాలు మరింత పెరుగుతాయే తప్ప.. తగ్గే పరిస్థితి అయితే కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. సామాజిక పింఛన్లు పెరుగుతాయి. ఉచిత గ్యాస్ డెలివరీ కొనసాగుతుంది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతులకు ఆర్థిక భరోసా వంటివి కూడా కొనసాగడం ఖాయం. ఇక, వీటికి మించి ఇంకా ఏమైనా కూడా అమలు చేయొచ్చు.
