Begin typing your search above and press return to search.

రప్పా రప్పా కాదు.. చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి!"

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో "రప్పా.. రప్పా.." డైలాగ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   12 July 2025 12:15 PM IST
రప్పా రప్పా కాదు.. చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో "రప్పా.. రప్పా.." డైలాగ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుష్ప సినిమా నుండి వచ్చిన ఈ డైలాగ్‌కు రాజకీయ రంగు పూయగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు దీనిని తమ ప్రసంగాల్లో వాడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాయి.

కృష్ణా జిల్లాలో "బాబు ష్యూరిటీ మోసం" కార్యక్రమాల్లో పాల్గొన్న పేర్ని నాని, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. "లోకేష్‌ రెడ్ బుక్ అంటున్నాడు.. మీరు కూడా రప్పా.. రప్పా అంటున్నారు.. చెడిపోయారా?" అంటూ ప్రశ్నించారు.

పేర్ని నాని తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ, "ఏదైనా పని చేయాలంటే రప్పా రప్పా అనడం కాదు.. చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి!" అని పేర్కొన్నారు. పని చేయాలంటే అనవసరమైన మాటలు, అల్లరి కాదని, నిర్వాకం కన్నా పనిచేయడమే ముఖ్యమని ఆయన అన్నారు. ప్రజల మనసుల్లో మన్ననలు పొందాలంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.

"రప్పా రప్పా అనేది మెయిన్ కాదు.. అది చీకట్లో జరిగిపోవాలి" అని వ్యాఖ్యానించిన పేర్ని నాని, "ముల్లును ముళ్ళుతోనే తీయాలి.. కానీ పదే పదే వేలంవెర్రిగా మాట్లాడకూడదు" అంటూ వైసీపీ కార్యకర్తలకు సూచనలు చేశారు. ప్రజలు తమను మనసులో మన్నించాలంటే మాటలకంటే పనికి ప్రాధాన్యం ఇవ్వాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన వారి విషయంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. "రప్పా రప్పా అంటూ ప్రతీ సభలో మాటల యుద్ధం అవసరం లేదు. ప్రజలు అలాంటివి తేలిగ్గా గుర్తుపెట్టుకుంటారు" అని ఆయన అన్నారు.

చివరగా, లోకేష్ "రెడ్ బుక్" గురించి స్పందిస్తూ, "ఈ రెడ్ బుక్‌ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి చివరికి ఉరి తాడు అవుతుందనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు.

పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. 'రప్పా.. రప్పా..' అనే నినాదానికి ఆయన 'చీకటి స్ట్రాటజీ'గా సమాధానం ఇచ్చిన తీరును రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.