టీడీపీకి కొత్త ఆశాకిరణం.. చాలా ప్రశ్నలకు ఒకటే సమాధానం నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీలో నాయకత్వ బదిలీ ప్రక్రియ మొదలైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యువనేత లోకేశ్ ను నియమించిన అధినేత చంద్రబాబు పార్టీ బాధ్యతల భారాన్ని తగ్గించుకున్నారు.
By: Tupaki Desk | 15 April 2026 8:04 PM ISTతెలుగుదేశం పార్టీలో నాయకత్వ బదిలీ ప్రక్రియ మొదలైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యువనేత లోకేశ్ ను నియమించిన అధినేత చంద్రబాబు పార్టీ బాధ్యతల భారాన్ని తగ్గించుకున్నారు. 2029 ఎన్నికలను లోకేశ్ నాయకత్వంలోనే ఎదుర్కోవాలని భావిస్తున్న టీడీపీ మూడేళ్ల ముందు నుంచి అందుకు తగ్గ పూర్వరంగాన్ని సిద్ధం చేస్తోందని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీలో లోకేశ్ నిర్ణయాలకు ఎదురే లేదు. కానీ, ఇప్పటివరకు అవన్నీ అనధికారికం. లోకేశ్ తీసుకునే సాహసోపేత నిర్ణయాలు అన్నీ అధినేత చంద్రబాబు ఖాతాకు జమ అయ్యేవి. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేశ్ నియామకం తర్వాత ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందని చెబుతున్నారు.
45 ఏళ్ల టీడీపీ చరిత్రలో లోకేశ్ క్రియాశీల బాధ్యతలు చేపట్టిన తర్వాత గణనీయమైన మార్పులు తీసుకువచ్చారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో మరింత స్పష్టమైన మార్పు తీసుకువస్తారని కార్యకర్తలు ఆశిస్తున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు టీడీపీకి కార్యకర్తలే బలం. పెద్ద బలగం. అయితే ఈ ఇద్దరి నేతల నేతృత్వంలో టీడీపీ సంప్రదాయ రాజకీయాలకు మాత్రమే పరిమితమైంది. కానీ లోకేశ్ రంగంలోకి దిగిన తర్వాత కార్యకర్తలను తెగించి పోరాడేలా ప్రేరణ తీసుకువచ్చారు. అదే 2024 ఎన్నికల్లో టీడీపీకి తిరుగులేని విజయాన్ని తీసుకువచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇందుకు ప్రధానంగా ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ పెద్ద ఉదాహరణ.
2024 ఎన్నికలకు ఏడాది ముందు 2023 జనవరిలో కుప్పం నియోజకవర్గం నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టారు. టీడీపీ చరిత్రలో అతి భారీ కార్యక్రమంగా ఈ పాదయాత్ర సాగింది. ఆరంభంలో ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన పాదయాత్ర చివరి దశకు చేరుకునే సమయానికి కార్యకర్తల నీరాజనాలను అందుకుంది. ప్రధానంగా ప్రసంగాలతో కార్యకర్తల్లో నూతన ఉత్తేజం తీసుకువచ్చిన లోకేశ్ పార్టీ కేడర్ నమ్మకాన్ని చూరగొన్నారు. ‘రెడ్ బుక్’ పేరిట కార్యకర్తల్లో ధైర్యం నూరుపోసిన లోకేశ్ టీడీపీకి ఆశాస్వప్నంగా మారారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్లు సైతం లోకేశ్ నాయకత్వం పట్ల సానుకూలత పెంచుకున్నారు.
మొదట్లో లోకేశ్ సామర్థ్యంపై చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉండేవి. కానీ, పార్టీలో లోకేశ్ వేసిన ప్రతి అడుగులోనూ వారి సందేహాలు నివృత్తి చేసేలా ప్రయాణం సాగింది. ఈ నేపథ్యంలో పార్టీలో అన్నివర్గాల మద్దతు కూడగట్టుకున్న లోకేశ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. గత ఏడాది మహానాడులో టీడీపీలో అన్ని కేడర్ల నాయకత్వం లోకేశ్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని నినదించింది. మహానాడు ముగిసిన రెండు, మూడు రోజులకే ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమిస్తారని వార్తలు ప్రసారమయ్యాయి. కానీ, అనుకోని జాప్యంతో ఏడాది కాలం ముగిసింది. అయినా ఎట్టకేలకు లోకేశ్ కు పార్టీ పగ్గాలు అప్పగించడంపై పార్టీలో ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని అంటున్నారు. ఎప్పటి నుంచో లోకేశ్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు అధినేత చంద్రబాబు ప్రకటన తర్వాత సంబరాలు చేసుకున్నారు.
