సీఎం చంద్రబాబు వ్యూహం... పెద్దిరెడ్డికి తీరని అవమానం..?
ఇక ప్రతికార రాజకీయాలకు చోటు లేదని చెబుతూనే పెద్దిరెడ్డికి పాఠం చెప్పేలా ప్రభుత్వం నడుచుకుంటోందని అనుమానిస్తున్నారు.
By: Tupaki Desk | 26 July 2025 10:00 PM ISTఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయం నిత్యం వాడివేడిగా కనిపిస్తోంది. ప్రధానంగా వైసీపీ నేతల అరెస్టుల పర్వంతో అధికార పక్షం పైచేయి సాధించినట్లు కనిపిస్తోందని అంటున్నారు. అయితే వైసీపీ కీలక నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత అధికార, ప్రతిపక్ష రాజకీయాలపై మరింత చర్చ జరుగుతోంది. మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గానే ఈ అరెస్టు జరిగిందని, ఆ కుటుంబంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ద్వేషం కారణంగానే కేసులతో వేధిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శలు చేస్తోంది. అయితే లిక్కర్ స్కాంలో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అయితే ముఖ్యమంత్రి కక్ష సాధించడం ఏంటి? అన్న ప్రశ్న లేవనెత్తుతోంది టీడీపీ.. దీంతో ఈ రెండు వాదనల చుట్టూనే మొత్తం రాజకీయం పరిభ్రమిస్తోందని అంటున్నారు.
కాలేజీ డేస్ నుంచే ఆధిపత్య పోరు
సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అవమానించేలా ప్రభుత్వం వ్యవహారిస్తోందన్న వైసీపీ విమర్శలు అగ్గి రాజేస్తున్నాయి. తమ వాదనకు బలం చేకూర్చేలా ఆ పార్టీ కొన్ని ఉదాహరణలు, ఉదంతాలు ప్రస్తావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వారి మధ్య దశాబ్దాలుగా ఆధిపత్య పోరు నడుస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇద్దరు వయసు, అనుభవం దృష్ట్యా సమకాలీకులు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకున్న రోజుల నుంచి ఇద్దరి మధ్య రాజకీయ ఆధిపత్యం కొనసాగిందని గుర్తుచేస్తున్నారు. విద్యార్థి రాజకీయాల నుంచి ఇద్దరు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. అప్పట్లోనే ఒకరితో ఒకరు విభేదించారని, అప్పట్లో చంద్రబాబుపై పెద్దరెడ్డి ఆధిపత్యం చెలాయించడంతో ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు ప్రతీకారం తీర్చుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
గతం గుర్తు చేస్తున్న టీడీపీ..
వైసీపీ విమర్శలను తిప్పికొడుతున్న టీడీపీ.. గత ప్రభుత్వ పాలనలో వైసీపీ వ్యవహరించిన తీరును గుర్తు చేస్తోంది. పెద్దిరెడ్డి కుటుంబంపై తాము కక్ష సాధించుకోవడం లేదని చెబుతూనే గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి వైఖరిని తెరపైకి తెస్తోంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వంలో నెంబర్ టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించేవారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. దీంతో వైసీపీలో పెద్దిరెడ్డి మాటకు తిరుగు ఉండేది కాదు. నాటి ప్రభుత్వంలో నెంబరు టుగా వ్యవహరించిన పెద్దిరెడ్డి అప్పటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఇబ్బంది పెట్టారని టీడీపీ ప్రతి విమర్శలు చేస్తోంది. పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో చంద్రబాబు పర్యటిస్తే అంగళ్లు కూడలిలో ఆయన కాన్వాయ్ పై రాళ్లు వేయించడం, పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లిలోనూ చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారని టీడీపీ గుర్తు చేస్తోంది. అదేసమయంలో తప్పుడు కేసులో చంద్రబాబును అరెస్టు చేసి వేధించారని, కుప్పంలో చంద్రబాబును ఓడించాలని అనేక ప్రయత్నాలు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో గతంలో పెద్దిరెడ్డి వ్యవహరించిన తీరును గుర్తించుకునే ప్రస్తుతం ప్రతీకారం తీర్చుకుంటున్నారా? అనే చర్చ జరుగుతోంది.
అంతా రూల్స్ ప్రకారమే..
ఇక ప్రతికార రాజకీయాలకు చోటు లేదని చెబుతూనే పెద్దిరెడ్డికి పాఠం చెప్పేలా ప్రభుత్వం నడుచుకుంటోందని అనుమానిస్తున్నారు. మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన ఎంపీ మిథున్ రెడ్డి కోర్టు ద్వారా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు, వెసులుబాట్లు పొందారు. అయితే కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. మిథున్ రెడ్డికి కోర్టు కల్పించిన సౌకర్యాలు అందకుండా చూస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో ఇలాంటి సౌకర్యాలు ఏవీ ఇవ్వలేదని, ఇప్పుడు ఎవరికీ అలాంటి సౌకర్యాలు కల్పించేది లేదనే సంకేతాలను ప్రభుత్వం పంపుతోందని అంటున్నారు. అదేసమయంలో పెద్దారెడ్డిగా ప్రతాపం చూపిన పెద్దిరెడ్డికి తమ పవర్ ఏంటో చూపాలన్న ఉద్దేశంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు ఆయన చుట్టూ చక్రబంధం బిగిస్తున్నారని అంటున్నారు.
పవర్ ఫుల్ లీడరుగా చెలామణి అయిన పెద్దిరెడ్డి ఇప్పుడు చేతిలో కేరియర్ పట్టుకుని జైలుకు వెళుతున్న దృశ్యాలను టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రిలోనే ఉండిపోయి భోజనం అందజేసేవారు. ఇప్పుడు పెద్దిరెడ్డి కూడా అదే చేస్తున్నారు. కోర్టు తీర్పుతో ఇంటి భోజనం అందజేసేందుకు రాజమండ్రిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, రోజూ జైలుకు వెళ్లి వస్తున్నారు. సీఎం తర్వాత తానే పవర్ సెంటర్ అన్నట్లు రాజకీయం నడిపిన పెద్దిరెడ్డికి ఇది తీరని అవమానమేనంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి సహాయంగా క్యారియర్ పట్టుకున్న గన్ మ్యాన్ ప్రభుత్వం సస్పెండ్ చేయడం ద్వారా తన వైఖరి స్పష్టం చేసిందని అంటున్నారు. తన వల్ల గన్ మ్యాన్ ఇబ్బంది పడుతుండటంతో ప్రస్తుతం పెద్దిరెడ్డి క్యారియర్ పట్టుకుని వెళ్లడం చర్చకు దారితీస్తోంది. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. అయితే తమకు టైం వస్తుందని, అప్పుడు తామేంటో చూపుతామని వైసీపీ ప్రకటిస్తోంది. కానీ ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత దయనీయ పరిస్థితుల్లో తన కుమారుడి కోసం జైలు చుట్టూ తిరగడమే ప్రధాన చర్చనీయాంశం అవుతోందని అంటున్నారు.
