Begin typing your search above and press return to search.

నేనే నంబర్ వన్ ఆంధ్రా స్టూడెంట్...!

ఏపీలో ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. పంచ్ డైలాగులను అన్ని పార్టీల అధినేతలు వాడుతున్నారు

By:  Tupaki Desk   |   2 April 2024 4:13 PM GMT
నేనే నంబర్ వన్ ఆంధ్రా స్టూడెంట్...!
X

ఏపీలో ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. పంచ్ డైలాగులను అన్ని పార్టీల అధినేతలు వాడుతున్నారు. ఏపీ సీఎం జగన్ సైతం కొత్త స్టైల్లో స్పీచ్ ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు జనాలను అట్రాక్ట్ చేసేందుకు తనదైన

ఎత్తుగడలను వాడుతున్నారు.

తాజాగా మదనపల్లిలో జరిగిన మేమంతా సిద్ధం సభలో జగన్ మాట్లాడుతూ నేనే నంబర్ వన్ ఆంధ్రా స్టూడెంట్ అన్నారు. నూటికి తొంబై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న ఫస్ట్ ర్యాంకర్ ని అని చెప్పారు. నేను ఎన్నికలు అనే పరీక్షలకి భయపడతానా అంటూ ప్రశ్నించారు. గత సారి ఎన్నికల్లో పది మార్కులు కూడా పట్టుమని రాలేని వారు అవతల కూటమి కట్టారు అని జగన్ సెటైర్లు వేశారు.

పది శాతం మార్కుల విద్యార్ధికి ఫస్ట్ ర్యాంకర్ ఎక్కడైనా భయపడతారా అని జగన్ అంటున్నారు. నేను 99 శాతం హామీలు నెరవేర్చాను కనుకనే మరోసారి ఓటు వేయమని మీ ముందుకు వస్తున్నాను అని జగన్ అన్నారు. నాకు ప్రతీ ఇంటికీ వెళ్లి ఓటు అడిగే అర్హత ఉందని ఆయన అన్నారు.

పాటీలు రాజకీయాలు చూడకుండా అందరికీ పధకాలు అందించాను అని ఆయన చెప్పారు. నేను ఏ హామీలు అయితే ఇచ్చానో అవే చేసి చూపించాను అని జగన్ అన్నారు. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు తాను ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఇపుడు సరికొత్త హామీలతో ముందుకు వస్తున్నారు అని జగన్ విమర్శించారు.

మూడు కాదు ముప్పయి పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా ఎవరు భయపడతారు అని ఆయన అంటున్నారు. విశ్వసనీయత లేని కూటమి అవతల వైపు ఉందని ఆయన ఫైర్ అయ్యారు. అవ్వా తాతలకు నేరుగా ఇంటికే రావాల్సిన పెన్షన్ రాకుండా చంద్రబాబు చేశారు అని ఆయన విమర్శించారు. ఇలాంటి కూటమికి ఓటు వేస్తే పధకాలు ఉండవు, వాలంటీర్ల వ్యవస్థ ఉండదు అభివృద్ధి అంతకంటే ఉండదని ఆయన హెచ్చరించారు.

తమకు పెన్షన్లు వద్దు ఏ పధకాలు వద్దు అన్న వారే బాబుకు ఓటేస్తారు అని ఆయన ఎద్దేవా చేశారు. తాను ప్రజలను నమ్ముకున్నాను అని వారి మేలు చూసానని ఆయన చెప్పారు. అందుకే తనను ఓడించడం కోసం పది మంది కలసి వస్తున్నారు అని ఆయన అంటున్నారు. నన్ను ఒంటరిగా ఓడించడం వల్ల కాదని చంద్రబాబు కూటములు కట్టారని విమర్శించారు.

ఇదే చంద్రబాబు ఆయన మిత్రులు కట్టిన కూటమి 2014లో అధికారంలోకి వచ్చి ఏమి ఒరగబెట్టిందని జగన్ ప్రశ్నించారు. జగన్ ఒక్కడే అనుకుని ఎంతో మంది జెండాలు జత కట్టి వస్తున్నారని, కానీ ఒంటరి కారని, ఆయనకు జనం బలం ఉందని జగన్ అంటున్నారు.

తనది పేదల సమూహమని కూటమి కట్టిన వారిది పెత్తందారుల సమూహమని జగన్ విడమరచి చెప్పారు. ఒక్క జగన్ ని ఓడిస్తే పేదలను పక్కన పెట్టవచ్చు అన్నది వారి అజెండా కానీ పెత్తందారులకు తగిన గుణపాఠం మరో ఆరు వారాలలో ప్రజలు చెప్పబోతున్నారు అని ఆయన జోస్యం చెప్పారు.

ఏపీలో మరోసారి వైసీపీ జెండా ఎగరడమే కాదు, 175 అసెంబ్లీ పాతిక ఎంపీ సీట్లతో కలుపుకుని డబుల్ సెంచరీని సాధిస్తామని ఆయన అన్నారు. ఏ ఒక్క సీటూ వైసీపీ కోల్పోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి నేనే నంబర్ వన్ స్టూడెంట్ అవతల పక్షం అంతా ఫెయిల్యూర్ బ్యాక్ బెంచ్ అని జగన్ సరికొత్త సెటైర్లతో జనం ముందుకు వస్తున్నారు. మరి జగన్ దృష్టిలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇస్తున్నారో చూడాల్సి ఉంది.