Begin typing your search above and press return to search.

జెన్ జీ, జెన్ ఆల్ఫా.. తొలిసారి జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి తొలిసారిగా జెన్ జీ కోసం మాట్లాడారు.

By:  Tupaki Political Desk   |   11 Jun 2026 3:31 PM IST
జెన్ జీ, జెన్ ఆల్ఫా.. తొలిసారి జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
X

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి తొలిసారిగా జెన్ జీ కోసం మాట్లాడారు. ప్రస్తుతం ఇంటర్ నెట్ సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీతోపాటు భావితరంగా చెబుతున్న జెన్ ఆల్ఫాపైనా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కాలంగా రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న జెన్ జీపై జగన్ తొలిసారిగా స్పందించడంపై విస్తృత చర్చ జరుగుతోంది. మెగా డీఎస్సీలో పొరపాట్లను సరిదిద్దాలని ప్రభుత్వానికి సూచన చేసిన జగన్.. ప్రభుత్వం చేసిన తప్పులను సమర్థించుకోవాలని చూస్తే జెన్ జీ ఒప్పుకోదని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అంతా లీకుల మయమేనని వైసీపీ అధినేత జగన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీలో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియపై ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు హయాంలో జరిగిన పేపర్ లీకేజీల చిట్టాను జగన్ చదివి వినిపించారు. చంద్రబాబు పాలనలో లీకేజీలకు ఒక పెద్ద రికార్డే ఉందని జగన్ ఎద్దేవా చేశారు. 1995లో టెన్త్ క్లాస్ పేపర్ల లీక్ తో మొదలు 1996లో ఎమ్‌సెట్ ఇంజినీరింగ్, 1997లో ఇంటర్మీడియట్, 2017లో టెన్త్ సైన్స్, 2019లో టెన్త్, 2025లో బీఈడీ, టెన్త్ మ్యాథ్స్ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకైన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు తాజాగా డీఎస్సీ టీచర్ల రిక్రూట్‌మెంట్ పేపర్ కూడా లీక్ అయిందని ఆరోపించారు. ‘‘లీకుల్లో చంద్రబాబు రికార్డు ఇదీ" అంటూ జగన్ ఘాటుగా విమర్శించారు.

జెన్-జీ కాలం బాబూ.. ఆపలేరు

ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైనా కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. ఇది జెన్-జీ (Gen-Z) కాలం.. ఇప్పుడు జెన్ ఆల్ఫా (Gen Alpha) కూడా నడుస్తోంది. దేన్నీ మీరు ఆపలేరు. మీరు ఆపేకొద్దీ ఇది ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరుగుతుంది. దగాపడ్డ యువత మిమ్మల్ని విడిచిపెట్టదు.. తగిన గుణపాఠం చెప్తుంది. ఏపీలో కూడా త్వరలోనే 'కాక్రోచ్‌లు' బయటకు వస్తాయి.. జాగ్రత్త!" అంటూ జగన్ హెచ్చరించారు.

సీబీఐ దర్యాప్తునకు డిమాండ్

డీఎస్సీ లీకేజీ వ్యవహారంలో ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే తాము సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ స్కామ్‌పై లోతుగా విచారణ జరిపితే మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయన్నారు. విద్యాశాఖ మంత్రిగా సాక్షాత్తూ చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఉన్నాడు కాబట్టే, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రావడం లేదని, పైగా ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

నిరుద్యోగులకు వైఎస్ జగన్ భరోసా

"వారం రోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నా వద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను. వారి తరఫున న్యాయపోరాటం చేస్తాం. ఒకవేళ ఇప్పటి ప్రభుత్వం న్యాయం చేయకపోతే.. రేపు మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ-వెరిఫై చేసి, అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం" అని వైఎస్ జగన్ నిరుద్యోగ యువతకు గట్టి హామీ ఇచ్చారు.