Begin typing your search above and press return to search.

సంక్షేమంలో బాబుకు ప్ర‌జ‌లిచ్చిన మార్కులివే ..!

ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే విషయంలో గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంది.

By:  Tupaki Desk   |   22 Jun 2025 6:00 AM IST
సంక్షేమంలో బాబుకు ప్ర‌జ‌లిచ్చిన మార్కులివే ..!
X

ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే విషయంలో గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారిన పలు పథకాలు అమలు చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఆయన ముద్ర ఎప్పటికీ స్పష్టంగా అలాగే ఉండిపోయాయి. దీనికి కారణం కొన్ని కీలక పథకాలను కొత్తగా ప్రవేశపెట్టి అమలు చేయటం. ప్రతి ఒక్కరికి అందేలాగా లబ్ధిదారులను ఎంపిక చేసే విధానాన్ని పాటించటం వంటివి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి పేరు తెచ్చిపెట్టాయి.

ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. ఇక 2014- 19 మధ్య చంద్రబాబు నాయుడు హయంలో పథకాలు ప్రవేశపెట్టిన ఒక అన్న క్యాంటీన్ తప్ప మిగిలిన వాటికి పెద్ద పేరు అయితే రాలేదనేది ప్రజలు చెబుతున్న మాట. అన్న క్యాంటీన్ విషయంలో మాత్రం ప్రజలకు స్పష్టత ఉంది. పేదల ఆకలి తీర్చారని ఒక సింపతి అయితే టిడిపి విషయంలో ఉంది. కానీ ఇతర పథకాలను తీసుకుంటే మాత్రం చంద్రబాబు పేరు టిడిపి పేరు తక్కువగానే వినిపిస్తోంది.

ముఖ్యంగా గ్రామీణ పట్టణాల స్థాయిలో టిడిపికి ఆశించినంత సంక్షేమ పథకాలపై పేరైతే లేదని చెప్పాలి. 2019 -24 మధ్య బాధ్యతలు చేపట్టిన జగన్ అమలు చేసిన అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటివి వైసిపి ప్రభుత్వానికి పేరు తెచ్చిపెట్టాయి. ఇవే కాదు ప్రతి మండలంలోనూ సెంటు చొప్పున గ్రామాల్లో అయితే సెంటర్ నర చొప్పున ఇంటి స్థలాలను కూడా ఇచ్చారు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మిగిలిన సంక్షేమ పథకాల విషయంలోనూ క్రమం తప్పకుండా అమలు చేయడంతో పాటు ఒకవేళ ఎవరైనా లబ్ధి పొందకపోతే వారందరినీ మళ్ళీ ఏడాది చివరిలో గుర్తించి నిధులు ఇవ్వడం విషయంలోనూ జగన్ శ్రద్ధ తీసుకున్నారు.

దీంతో సంక్షేమ పథకాల ప్రభుత్వం అనే మాట చర్చకు వస్తే అది జగన్కే ఎక్కువ మొగ్గు చూపుతోంది. తాజాగా నిర్వహించిన సర్వేలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్నిస్తే 58 శాతం మంది ప్రజలు జగన్ పేరే చెప్పడం విశేషం. ఇక తాజాగా రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏడాదిపాలన పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో సంక్షేమ పథకాలను గమనిస్తే గత ఏడాది అక్టోబర్ నుంచి అమలు చేస్తున్న మూడు సిలిండర్లు, ఇటీవల అమలు చేసిన తల్లికి వందనం వంటివి చర్చనీయాంశమే.

అయినా ప్రజల్లో అంత జోరుగా అయితే క‌నిపించ‌డం లేదు. లబ్ధి పొందిన వారి కంటే పొందిన వారి వాదనే ఎక్కువ వినిపిస్తోంది. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో సంక్షేమ పథకాల్లో ఏ సీఎం బెస్ట్ అని ప్రశ్నిస్తే జగన్ వైపే 58 శాతం మంది ప్రజలు మొగ్గు చూపారు. మిగిలిన 42 శాతం మంది మాత్రమే చంద్రబాబు పర్వాలేదు ఇంకా సమయం ఉంది కాబట్టి చేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి సంక్షేమంలో జగనే ఇప్పటివరకు ఫస్ట్ అని చెప్పాలి. మరి ఇకనుంచి చంద్రబాబు ఆదిశగా అడుగులు వేస్తారా లేదా అనేది వేచి చూడాలి.