బాబు ప్రభుత్వం మూడేళ్ళే... వడ్డీతో సహా బాకీలు చెల్లిస్తా!
అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం బాబు ప్రభుత్వం ఉండేది మూడేళ్ళు మాత్రమే అని జోస్యం చెబుతున్నారు. అంతే కాదు కచ్చితంగా వచ్చేది తమ ప్రభుత్వమే అని కూడా చెబుతున్నారు.
By: Tupaki Desk | 16 July 2025 4:32 PM ISTఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పదమూడు నెలలు మాత్రమే అయింది. ఇంకా చేతిలో నాలుగేళ్ళ దాకా అధికారం ఉంది. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం బాబు ప్రభుత్వం ఉండేది మూడేళ్ళు మాత్రమే అని జోస్యం చెబుతున్నారు. అంతే కాదు కచ్చితంగా వచ్చేది తమ ప్రభుత్వమే అని కూడా చెబుతున్నారు.
చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన జగన్ చంద్రబాబు మీద కూటమి సర్కార్ మీద నిప్పులే చెరిగారు. ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని అన్నారు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా తప్పు తెలుసుకోవాలని ఆయన కోరారు. ఆయన ప్రభుత్వం ఆలోచనా విధానం మార్చుకోవాలని కూడా జగన్ హెచ్చరించారు.
లేకపోతే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను చెప్పినా ఎవరూ వినేది ఉండదని ఆయన అనడం విశేషం. అంతే ఇంతకు ఇంత తమ వారు తప్పకుండా వడ్డీతో సహా బాకీలు చెల్లిస్తారని బాబు స్పష్టంగా చెప్పేశారు. తాము ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని జగన్ చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తమకు లేదా అని ఆయన నిలదీశారు.
రాజకీయ పార్టీలకు ఉన్న హక్కులు బాబుకు తెలియవా అంటూ ఆయన ఇన్నాళ్ళూ రాజకీయం ఏ విధంగా చేశారని సెటైర్లు వేసారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని జగన్ అంటూ దానికి గుడివాడ సంఘటన అద్దం పడుతోందని అన్నారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ మీద టీడీపీ సైకోలు కర్రల్తో దాడి చేశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి అని జగన్ ప్రశ్నించారు. ఆమె మీద ఎందుకు దాడి చేశారో కూటమి నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సాయంత్రం అయుదు గంటలకు ఆమె కారు దగ్గర దాడి మొదలెట్టి ఆరున్నర గంటల వరకూ అదే పనిగా చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు అని జగన్ మండిపడ్డారు.
ఇవన్నీ యధేచ్చగా చేస్తున్నారు అంటే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఉందనే కదా. రేపటి రోజున వైసీపీ ప్రభుత్వం వస్తే అపుడు చంద్రబాబు పరిస్థితి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. తమ మీద ఎన్ని తప్పులు కేసులు పెట్టినా పోరాటం చేసి తీరుతామని జగన్ స్పష్టం చేశారు. ప్రజల తరఫున పోరాటం ఆపేది లేదని ఆయన అన్నారు. తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో వేస్తున్న వారి విషయంలో తాము కూడా అన్నీ చూస్తున్నామని జగన్ అన్నారు. రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయని ప్రజలకు భారాలు వేస్తున్నారని జగన్ అన్నారు.
ఆంధ్రాలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. అయినా సరే ఎవరూ ప్రశ్నించకూడదన్న తీరులో బాబు పాలన చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్షమని అది వైసీపీ అని జగన్ అన్నారు. తన నోళ్ళు మూసేసి గొంతులు నొక్కేసి ఏమి చేద్దామని అనుకుంటున్నారని ఆయన నిలదీశారు.
ప్రజాస్వామ్యంలో దుష్ట సంప్రదాయనికి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారని రాజకీయ పార్టీనై కార్యకర్తలను నాయకులను నియంత్రించాలని చూస్తున్నారని తమ తప్పులు ఎవరికీ తెలియకూడదనే ఈ ప్రయత్నం అన్నారు. ఈ రోజున ప్రజలు తమ సమస్యలు వైసీపీకి చెప్పుకోవడానికి వస్తున్నారని వాటి మీద తాము తప్పకుండా పోరాటం చేసి తీరుతామని జగన్ చెప్పారు. ఈ సందర్భంగా జగన్ వచ్చేది తమ ప్రభుత్వం అంటూ గట్టిగా చెప్పడం విశేషం.
