Begin typing your search above and press return to search.

రాజధాని అన్న పదం రాజ్యాంగంలో లేదు.. మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

తమ పార్టీ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని చెబుతూనే, రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుపై జగన్ పలు వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Political Desk   |   1 April 2026 1:57 PM IST
రాజధాని అన్న పదం రాజ్యాంగంలో లేదు.. మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
X

రాజధాని అమరావతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని చెబుతూనే, రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుపై జగన్ పలు వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై అసెంబ్లీలో చేసిన తీర్మానం ఒక డ్రామాగా జగన్ అభివర్ణించారు. ఒకవైపు రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలనే అంశంపై జగన్ తొలిసారిగా మాట్లాడారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యంగా మారాయని అంటున్నారు.

అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఉందా? అంటూ జగన్ ప్రశ్నించారు. ఏడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అమరావతిలో చేసింది? ఏంటి, భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా? అంటూ జగన్ నిలదీశారు. ‘శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామాగా కొట్టిపడేశారు. రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని మంత్రి పార్థసారధి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతి అంటూ విమర్శలు గుప్పించారు.

ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టంగా జగన్ వ్యాఖ్యానించారు. చత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో రాజధానులను కేంద్రం నిర్ణయించలేదన్నారు. ఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయని అన్నారు. ఈ సమయంలో రాజధానిపై జగన్ ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ఉన్న ప్రాంతాన్ని కలిపి రాజధానిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతానికి అమరావతి అని కాకుండా మావిగు అనే పేరు పెట్టాలని సూచించారు జగన్. మావిగు అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని అర్థమని జగన్ వెల్లడించారు.

రాజధానిగా అమరావతిని ప్రకటించిన చంద్రబాబు ఒకప్పుడు వరల్డ్ క్లాస్ సిటీగా చెప్పారని, ఇప్పుడు మున్సిపాలిటీ అంటున్నారని జగన్ ఆక్షేపించారు. అమరావతి నిర్మాణ వ్యయాన్ని ఎందుకు పెంచుకుంటూ పోతున్నారని జగన్ నిలదీశారు. రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు లెక్కలే చెబుతున్నాయని, ఆ లెక్కన లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కావాలని జగన్ అన్నారు. రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 2019కు ముందు ఉన్న మాస్టర్ ప్లాన్ మళ్లీ ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు.

చదరపు అడుగుకు 11 వేల నుంచి 14 వేలు ఖర్చు అవుతుందని చెబుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదున్నర గంటల చర్చలో అమరావతిపై ఏం చెప్పారు? రాజధాని పేరుతో పట్టపగలే దోపిడీ చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. దోపిడీని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని జగన్ స్పష్టం చేశారు. చట్టసభల్లో భాగమైన కౌన్సిల్ లో ఎందుకు చర్చ పెట్టలేదని ప్రశ్నించారు. కౌన్సిల్ సభ్యులు ప్రభుత్వ అవినీతిని భయటపెడతారని సీఎం చంద్రబాబు భయపడ్డారని అన్నారు. సభలు చట్టాలు చేస్తాయి. సవరణలూ చేయగలుగుతాయని జగన్ వ్యాఖ్యానించారు.