Begin typing your search above and press return to search.

గోదావరి జిల్లాలు : వైసీపీ వర్సెస్... జనసేన ప్లస్ టీడీపీ... ?

ఏపీలో కానీ ఉమ్మడి ఏపీలో కానీ గోదావరి జిల్లాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ జనం నాడిని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇట్టే చెప్పేయవచ్చు.

By:  Tupaki Desk   |   11 Aug 2023 3:00 AM GMT
గోదావరి జిల్లాలు :  వైసీపీ వర్సెస్... జనసేన ప్లస్ టీడీపీ... ?
X

ఏపీలో కానీ ఉమ్మడి ఏపీలో కానీ గోదావరి జిల్లాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ జనం నాడిని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇట్టే చెప్పేయవచ్చు. అది ఎన్నో సార్లు రుజువు అయింది. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలుగా వీటికి పేరు. ఇక ఉమ్మడి గోదావరి జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ అయిదు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. విభజన తరువాత 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే ఈ జిల్లాలలో మెజారిటీ సీట్లు ఆ పార్టీ గెలుచుకోవడమే కారణం.

అదే విధంగా 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి కూడా ఈ జిల్లాలలో మెజారిటీ సీట్లు వైసీపీ పరం అవడమే ముఖ్య కారణం. 2019 లో అయితే వైసీపీ ఏకంగా మొత్తం 34 సీట్లకు 27 సీట్లను గెలుచుకుంది. టీడీపీ ఆరు సీట్లు, జనసేన ఒక్క సీటుని గెలుచుకున్నాయి.

ఇక 2024 నాటికి ఉమ్మడి గోదావరి జిల్లాలలో రాజకీయం ఎలా ఉంటుంది అన్న చర్చ అయితే మొదలైంది. ఇదిలా ఉంటే ఈసారి జనసేన వైపు మొగ్గు ఎక్కువగా ఉండవచ్చు అని ప్రచారం సాగుతున్నా టీడీపీతో పొత్తు ఉంటే కధ ఒకలా లేక జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మరోలా సీన్ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ రోజుకీ ఉమ్మడి గోదావరి జిల్లాల మీద పూర్తి నమ్మకంతో అధికార వైసీపీ ఉంది. జనసేన టీడీపీల మధ్య పొత్తు కుదిరినా ఓట్ల బదిలీ కరెక్ట్ గా సాగదని అని ఆ పార్టీ భావిస్తోంది. ఒక వేళ పొత్తు కనుక కుదరకపొతే గతంలో మాదిరిగా మెజారిటీ సీట్లు దక్కుతాయన అంచనా కడుతోంది. ఇక 2019 లో ఓట్ల వివరాలను ఒకసారి తీసుకుంటే కనుక జనసేనకు వచ్చిన ఓట్ల కంటే కూడా దాదాపు డజన్ కి పైగా నియోజకవర్గాలలో వైసీపీకి మెజారిటీ చాలా తక్కువగా వచ్చింది.

అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు రాజకీయంగా మారాయి. అదే టైంలో జనసేన గ్రాఫ్ పెరిగింది అని అంటున్నారు. పొత్తులు కనుక కుదిరితే మాత్రం కచ్చితంగా వైసీపీకి దెబ్బ పడుతుంది అని అంటున్నారు. అది కేవలం పన్నెండు సీట్లకే పరిమితం అవుతుందా లేక మొత్తం 34 సీట్లలోనా అన్నది చూడాలని అంటున్నారు. అయితే బీసీ ఓట్లను వైసీపీ నమ్ముకుంది. ఈ జిల్లాలలో సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని కాపులకు పోటీగా బీసీలను అభ్యర్ధులుగా బరిలోకి దించితే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది.

బీసీల ఓటు బ్యాంక్ కూడా టీడీపీకి 2014లో తోడు కావడంతో మంచి విజయం ఉమ్మడి గోదావరి జిల్లాలలో దక్కింది. 2019 తరువాత మొత్తం సన్నివేశం మారింది. బీసీల ఓట్లను సగానికి పైగా వైసీపీ చీల్చింది. ఇపుడు వారి మద్దతుని అలా నిలబెట్టుకున్నామని ఆ పార్టీ అనుకుంటోంది. అందువల్ల కాపుల ఓట్లు తగ్గిన చోట బీసీలు తమకు అండగా ఉంటారని లెక్కలేస్తోంది. ఎటూ మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు తమ వైపే కాబట్టి గతం కంటే కొన్ని సీట్లు దక్కినా మెజారిటీకి ఢోకా ఉండదని ధీమాగా ఉందిట.

ఇక వైసీపీ అధినాయకత్వం కూడా గోదావారి జిల్లాలలోని రాజకీయాన్ని తేలికగా తీసుకోవడంలేదు అని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెజారిటీ సీట్లు గెలిస్తేనే మళ్లీ అధికారంలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చూస్తోంది. దానికి తగిన విధంగా సోషల్ ఇంజనీరింగ్ చేసేందుకు సైతం సిద్ధపడుతోంది. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్న చోట్ల కొత్త ముఖాలను బరిలోకి దించడం ద్వారా గోదావరి జిల్లాల రాజకీయాన్ని ఒడిసి పట్టాలని చూస్తోంది. మొత్తం మీద చూస్తే గోదావరి జిల్లాలలో జనసేన ఫీవర్ అయితే గట్టిగానే ఉంది.

అదే టైం లో వైసీపీ తమ ఓటు బ్యాంక్ కి లోటు లేదు అంటోంది. జనసేన ఎంత ఎక్కువగా ఓట్లు తెచ్చుకుంటే ఆ ఓట్లు అన్నీ టీడీపీ నుంచే అని చెబుతోంది. ఏది ఏమైనా ఈసారి గోదావరి జిల్లాల రాజకీయం అనూహ్యంగా ఉండబోతోంది. నాడి దొరకడం లేదు. అయితే 2024 ఎన్నికల్లో ఏపీలో గెలిచే పార్టీ ఏంటో తీర్పు ఇవ్వబోయేది మాత్రం గోదావరి జిల్లాలే అని అంటున్నారు.