ఆ బాధ్యతలు అన్నీ లోకేశ్ కే.. చంద్రబాబు డిసైడ్ అయ్యారా?
ముఖ్యమంత్రి చంద్రబాబు తన బాధ్యతలను కుమారుడు లోకేశ్ కు బదిలీ చేస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 1 March 2026 1:00 AM ISTముఖ్యమంత్రి చంద్రబాబు తన బాధ్యతలను కుమారుడు లోకేశ్ కు బదిలీ చేస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే డిఫాక్టో సీఎంగా లోకేశ్ వ్యవహరిస్తున్నారని విపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. పేరుకే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని, కానీ ప్రభుత్వ పాలన అంతా లోకేశ్ కనుసన్నల్లోనే జరుగుతోందని విపక్షం విమర్శలు గుప్పిస్తోంది. అయితే వైసీపీ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, ఇటీవల పరిణామాలు గమనిస్తే ప్రభుత్వంలో లోకేశ్ ప్రాధాన్యం బాగా పెరిగిందన్న అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోందని అంటున్నారు.
ప్రధానంగా శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో లోకేశ్ పనితీరుపై విస్తృత చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 11న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 14న రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అసెంబ్లీ, కౌన్సిల్ లో ప్రతిరోజూ బడ్జెట్ పై అంశాల వారీగా చర్చిస్తున్నారు. అయితే ఉభయ సభల్లో చర్చల్లో పాల్గొనాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం అసెంబ్లీకే పరిమితమవుతున్నారు. ఈ దఫా సమావేశాల్లో ఒక్క రోజు కూడా ఆయన శాసనమండలిలో కనిపించలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం మండలి సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్య నేతలు ఇద్దరూ అసెంబ్లీ నుంచి వెనుదిరిగిపోతుండగా, లోకేశ్ మాత్రం ఇటు అసెంబ్లీ, అటు మండలి సమావేశాలకు హాజరవుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
ఇక మండలిలో సభా నాయకుడు, సీఎం చంద్రబాబు గైర్హాజరుతో ఆ స్థానంలో లోకేశ్ అన్నీతానై చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభమైన నుంచి లోకేశ్ ఎక్కువగా శాసనమండలి చర్చల్లోనే పాల్గొంటున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా మండలిలో లోకేశ్ మాటల దాడికి విపక్షం సైతం సైలెంటు అయిపోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా కొన్ని అంశాలపై సీనియర్ నేత బొత్సతో ఢీ అంటే ఢీ అనేస్థాయిలో లోకేశ్ డైలాగ్ వార్ కి సిద్ధమవడం చర్చకు దారితీస్తోంది. మాజీ మంత్రి అంబటి అరెస్టును మండలిలో లోకేశ్ సమర్థించుకున్న తీరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో విపక్షానికి మండలిలో మాత్రమే బలం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మొత్తం మండలి సభ్యుల్లో మూడొంతుల మంది వైసీసీ వారే. టీడీపీ కూటమికి కేవలం పది మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరితోపాటు మరో పది మంది మంత్రుల సాయంతో లోకేశ్ ప్రభుత్వం తరఫున సమర్థవంతమైన వాదనలు వినిపిస్తున్నారని చెబుతున్నారు. సభా నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్షం ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సివుంటుందని, కానీ లోకేశ్ చొరవతో వాగ్దాటితో విపక్షాన్ని కంట్రోల్ లో పెడుతున్నారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంశం ఏదైనా సరే సమగ్ర వివరాలతో లోకేశ్ చర్చించడం ఆకట్టుకుంటోందని అంటున్నారు. అనర్గళంగా ఎటువంటి తడబాటు లేకుండా లోకేశ్ మాట్లాడుతుండటం చూస్తూ విపక్షం సైతం ఆశ్చర్యపోతోందని వ్యాఖ్యానిస్తున్నారు.
