Begin typing your search above and press return to search.

జగన్ చాలా డేంజర్.. సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

By:  Tupaki Political Desk   |   11 July 2026 3:33 PM IST
జగన్ చాలా డేంజర్.. సీఎం సంచలన వ్యాఖ్యలు
X

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో మీడియాతో జరిగిన చిట్‌చాట్ సందర్భంగా, రాష్ట్రంలో సోషల్ మీడియా దుర్వినియోగం, రాజకీయ ఉద్రిక్తతలపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్‌మోహన్ రెడ్డి శైలిని తప్పుబడుతూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. "జగన్‌ది 'హిట్ అండ్ రన్' మనస్తత్వం. రాష్ట్రంలో గొడవలు జరగడానికి కావాల్సిన పరిస్థితులను సృష్టించి, ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లి దాక్కుంటారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలను రెచ్చగొట్టి, రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, జగన్ రెడ్డి ట్రాప్ లో పడకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆగ్రహం

సోషల్ మీడియాను కొందరు నేర మనస్తత్వం కలిగిన వ్యక్తులు ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై బురద జల్లేందుకు దుర్వినియోగం చేస్తున్నారని సీఎం ఆరోపించారు. జగన్ రాజకీయాల్లో కేవలం రెండు అంశాలనే నమ్ముకున్నారని, ఒకటి 'గొడ్డలి', రెండోది 'సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రోలింగ్' అని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఈ తరహా విషప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతోందని చెప్పారు. ప్రజలు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విచక్షణ కూడా కలిగి ఉండాలని, అప్పుడే నిజానిజాలను గుర్తించగలరని ఆయన సూచించారు.

నేర మనస్తత్వానికి జగన్ ఒక ఉదాహరణ

తెలంగాణలో జరిగిన ఒక ఘటనను ప్రస్తావిస్తూ, నేర మనస్తత్వం ఎంత ప్రమాదకరమో సీఎం వివరించారు. జగన్ కూడా అదే తరహాలో తనకు సహకరించని వారిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్ అధికారులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేశారు. 'మావిగన్' వంటి వ్యవహారాల ద్వారా రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని, అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చంద్రబాబు దుయ్యబట్టారు.

అభివృద్ధిపై స్పష్టత

రాజకీయ కక్షల కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని, అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. గతంలో బ్రాహ్మణి స్టీల్స్, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ పేరుతో జరిగిన అక్రమాలపై కూడా పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను బయటకు తీస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.