Begin typing your search above and press return to search.

గోదావరి గట్టున బాబు అండ్ జగన్ !

గోదావరి జిల్లాలు రాజకీయానికి గుండె కాయలు. ఇక్కడ మార్పు మొదలైతే అది రాష్ట్రమంతటా వ్యాపిస్తుంది. ఇక్కడ రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. సెంటిమెంట్లు కూడా ఎక్కువ.

By:  Satya P   |   14 July 2026 1:00 AM IST
గోదావరి గట్టున బాబు అండ్ జగన్ !
X

గోదావరి జిల్లాలు రాజకీయానికి గుండె కాయలు. ఇక్కడ మార్పు మొదలైతే అది రాష్ట్రమంతటా వ్యాపిస్తుంది. ఇక్కడ రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. సెంటిమెంట్లు కూడా ఎక్కువ. బలమైన సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న ప్రాంతం ఇది. అందుకే రాజకీయ పార్టీలు గోదావరి రీజియన్ కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు తన పొలిటికల్ రూట్ మార్చారు, స్పీడ్ పెంచారు. ఇదే నెలలో ఆయన రాయలసీమలో మూడు జిల్లాలలో సుడి గాలి పర్యటనలు జరిపారు. అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఏకంగా అయిదు రోజుల పాటు బాబు టూర్ తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య వంటి జిల్లాలలో సాగింది. కట్ చేస్తే ఇపుడు గోదావరి జిల్లాలలో బాబు పర్యటన పెట్టుకున్నారు.

అభివృద్ధి కార్యక్రమాలతో :

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పు గోదావరి, బిఆర్. అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల పర్యటనలు చేపట్టారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన బాబు పోలవరం పనులను కూడా సమీక్షించారు. అదే విధంగా ఆయన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. గోదావరి జిల్లాలలో చంద్రబాబు పర్యటన అయితే ప్రాధాన్యత సంతరించుకునేలా సాగుతోంది.

జగన్ సైతం అక్కడికి :

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్ సైతం గోదావరి జిల్లాల మీదనే ఫోకస్ పెట్టారు ఆయన రెండేళ్ళ క్రితం భారీ ఓటమి తరువాత గోదావరి జిల్లాలకు వచ్చింది లేదు, అయితే తొలిసారిగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వస్తున్నారు. ఆయన ఈ నెల 15న భీమవరం చేరుకుని ఆక్వా రైతులతో ముచ్చటిస్తారు అని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆక్వా రైతులకు న్యాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేయనున్నారు అని అంటున్నారు. వారు అన్ని విధాలుగా నష్టపోతున్నారని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని జగన్ చెప్పదలచుకున్నారు దాంతో జగన్ పర్యటన మీద ఆసక్తి అయితే నెలకొంది.

స్థానిక ఎన్నికల నేపథ్యం :

ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికలకు అయితే మూడేళ్ళ పైగా సమయం ఉంది. కానీ స్థానిక ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. దాంతో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం కూడా గేర్ మారుస్తున్నాయని అంటున్నారు. ఇంతదాకా విపక్షం పెద్దగా యాక్టివ్ గా లేదు. కానీ రెండేళ్ళు గడచిన తరువాత ఇపుడిపుడే జోరు పెంచుతోంది. జగన్ కూడా జనంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా ఆయన గోదావరి జిల్లాల నుంచే తన రాజకీయ పర్యటనలు మొదలెట్టాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మొత్తం మీద చూస్తే అటు చంద్రబాబు జగన్ ఒకే సమయంలో గోదావరి గట్టున పొలిటికల్ సౌండ్ చేయడం మాత్రం ఇటీవల కాలంలో ఒక కీలకమైన సందర్భంగానే చూడాలని అంటున్నారు.