బాబుకు తోడుగా బాలయ్య...అమరావతిపై కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడుతున్నారు.
By: Satya P | 1 May 2026 11:38 PM ISTఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడుతున్నారు. ప్రభుత్వం పరంగా చేయాల్సినవి చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలను సకాలంలో పూర్తి చేయడానికి అవసరం అయిన నిధులను సమకూరుస్తున్నారు. దాంతో రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ హైకోర్టు, మంత్రుల నివాస భవనాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నివాస భవనాలు న్యాయమూర్తుల నివాస భవనాలు వంటివి ప్రభుత్వం పట్టుదలగా నిర్మాణం పూర్తి చేసే పనిలో ఉంది. దాంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులను కేంద్ర ప్రాజెక్టులను కూడా అమరావతికి తీసుకుని వస్తోంది. ఇంకో వైపు ప్రతిష్టాత్మకమైన సంస్థలకు భూములు ఇస్తోంది. వాటిని వినియోగించి వారు పెద్ద ఎత్తున ప్రాజెక్టులను నిర్మిస్తే వాటి వల్ల అమరావతి రాజధానికి ఒక రూపు షేపూ వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.
బాలయ్య సైతం :
ఇదిలా ఉంటే చంద్రబాబు అమరావతి రాజధాని లక్ష్యానికి తాను సైతం అని నందమూరి బాలకృష్ణ ముందుకు వస్తున్నారు. ఆయన తాను చైర్మన్ గా ఉన్న బసవతారకం ఆసుపత్రిని ఏపీకి విస్తరిస్తున్నారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని నిర్మాణం గురించి బాలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్మాణం అనేది హడావుడిగా చేసేది కాదని అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రణాళికాబద్ధంగా చేస్తున్నామని బాలయ్య స్పష్టం చేయడం విశేషం.
హంగులతో బసవతారకం ఆసుపత్రి :
ఈ నేపధ్యంలో తుళ్ళూరు వద్ద బసవ తారకం ఆసుపత్రికి చైర్మన్ హోదాలో నందమూరి బాలకృష్ణ నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. స్వయంగా బాలయ్య నేలను గునపం పట్టుకుని తవ్వుతూ ఆసుపత్రికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బాలయ్య ముందుగా వారికి పాదాభివందనం అంటూ అమరావతి రైతులకు మహిళలకు ధన్యవాదాలు చెప్పడం విశేషం. తాము ఆసుపత్రిని రెండు దశలుగా నిర్మిస్తున్నామని అది కూడా
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామన్న బాలక్రిష్ణ చెప్పడం విశేషం.
మరింతగా సేవలు విస్తరణ :
బసవతారకం ఆసుపత్రి ఇప్పటిదాకా తెలంగాణాలోని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. దానిని ఏపీకి విస్తరించాలన్న ఉద్దేశ్యంతో బాలయ్య అమరావతిలో నిర్మాణం పనులకు ప్రారంభించారు. హైదరాబాద్ లో బసవ తారకం ఆసుపత్రికి సరిగ్గా పాతికేళ్ళు పూర్తి అయ్యాయి. ఇపుడు ఏపీలో ఆసుపత్రి విస్తరణ జరగడం మంచి పరిణామం అని బాలయ్య చెప్పారు. ఈ పాతికేళ్ళ పండుగకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తామని బాలయ్య చెప్పారు
2028 నాటికి తొలిదశ :
బసవతారకం ఆసుపత్రిని రెండు దశలుగా మొత్తం నిర్మిస్తున్నారు. తొలి దశలో ఏడు అంతస్తులతో అయిదు వందల పడకల సామర్థ్యం తో నిర్మిస్తున్నారు. దీనికి గానూ 650 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అంచనా వేస్తున్నారు. 2028 నాటికి తొలిదశ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని బాలయ్య చెప్పారు. ఆ తరువాత రెండవ దశ పనులు మొదలవుతాయి అని అంటున్నారు.
