నువ్వా-నేనా.. మంత్రులకే లోకల్ పరీక్ష .. !
స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతను సీఎం చంద్రబాబు నేరుగా మంత్రుల చేతుల్లో పెట్టారు. వారికే బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా తేల్చేశారు.
By: Garuda Media | 16 March 2026 4:00 AM ISTస్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతను సీఎం చంద్రబాబు నేరుగా మంత్రుల చేతుల్లో పెట్టారు. వారికే బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా తేల్చేశారు. ఏప్రిల్ రెండో తేదీ నాటికి పంచాయతీలకు గడువు ముగుస్తుంది. దీంతో వాటికి ఎన్నికల నిర్వహించాలి. అయితే ప్రస్తుతం ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్టు ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి అయ్యేందుకు మరో రెండు మూడు మాసాల గడువు ఉన్న నేపథ్యంలో అప్పటివరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించి.. అభివృద్ధికి అడ్డు లేకుండా కార్యక్రమాలు పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆలోచనగా ఉంది.
సెప్టెంబర్ నాటికి మున్సిపల్ ఎన్నికలు కూడా వచ్చేందుకు అవకాశం ఏర్పడింది. సెప్టెంబర్ నుంచి మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగేందుకు అవకాశం ఉంది. దీంతో మున్సిపాలిటీల్లో కూడా కూటమి పార్టీలు గెలుపు గుర్రం ఎక్కాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. అంతేకాదు వీటిని ప్రతిష్టాత్మకంగా కూడా ఆయన తీసుకుంటున్నారు. బలమైన కూటమి పార్టీలకు ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవని కూడా ఆయన భావిస్తున్నారు. ఎన్నికలు సహా విజయం దక్కించుకునే బాధ్యతలను ఆయన మంత్రులకే అప్పగించారు. కానీ వాస్తవ పరిస్థితిని గమనిస్తే జిల్లా స్థాయిలో మంత్రుల పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది.
ఇన్చార్జి మంత్రులుగా ఉన్నటువంటి వారికి స్థానికంగా నాయకులతో కలివిడి లేకపోవడం, మంత్రులు చెప్పిన మాటలను వినిపించుకోకపోవడం వంటివి తరచుగా వివాదానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య కూడా గ్యాప్ నడుస్తుంది. కర్నూలు, అనంతపురం, విజయనగరం, విశాఖపట్నం అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాల్లోనూ ఇన్చార్జి మంత్రులకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ వివాదాలను పరిష్కరించేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ ఆ కమిటీ కూడా ఎక్కడా పని చేస్తున్నట్టుగా కనిపించడం లేదు.
సో ఈ వివాదాలను ఇలా పెట్టుకుని స్థానిక సంస్థల్లో మళ్ళీ మంత్రులకు బాధ్యతలు అప్పగించడం ద్వారా ఏ మేరకు వారు పుంజుకుంటారు.. ఏ మేరకు పార్టీని ముందుకు తీసుకువెళ్తారు.. కూటమి పార్టీలను ఏ విధంగా విజయం దక్కించుకునేలా చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రులకు బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేయడంతో పాటు నాయకులను ముందుకు నడిపించడం వంటి కీలక బాధ్యతలను కూడా వారికి అప్పగించారు. దీంతో ఏ మేరకు వారు సక్సెస్ చేస్తారు అనేది చూడాలి.
మరోవైపు వైసీపీ కూడా వ్యూహాత్మకంగానే అడుగులు వేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో చర్చకు పెట్టేలాగా క్షేత్రస్థాయిలో కమిటీలను నియమించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే జగన్ నిర్ణయం తీసుకుంటారని కూడా అంటున్నాయి. ఈ క్రమంలో ఇటు మంత్రులు అటు వైసిపి నాయకులు ఏ విధంగా పరస్పరం రాజకీయాలని ఎదుర్కొంటారు. ప్రజల్లో ఏవిధంగా సానుభూతిని సొంతం చేసుకుంటారు అనేది చూడాలి.
