ఏపీ రాజ్యసభ: 3+1 కాదా? మొత్తం ‘4’ టీడీపీకేనా?
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగమనేనికి.. జనసేన కోటాలో రాజ్యసభను ఎలా కేటాయిస్తారు? అన్నది ఇప్పుడు కొందరి ప్రశ్నగా మారింది.
By: Garuda Media | 6 Jun 2026 2:00 PM ISTరాజ్యసభ స్థానాల రచ్చ ఇప్పుడు ఏపీలో కొత్త రాజకీయ చర్చకు తెర తీసింది. మొత్తం నాలుగు ఖాళీ స్థానాలకు కూటమి ధర్మంలో భాగంగా టీడీపీకి రెండు.. జనసేన.. బీజేపీకి చెరొకటన్న చర్చ జోరుగా జరిగినా.. చివరకు టీడీపీ 3 స్థానాలు.. జనసేన ఒక్క సీటును తీసుకునేందుకు వీలుగా మాటలు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు కొత్త రచ్చ ఏంటంటే.. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన లింగమనేని రమేశ్ అభ్యర్థిత్వం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగమనేనికి.. జనసేన కోటాలో రాజ్యసభను ఎలా కేటాయిస్తారు? అన్నది ఇప్పుడు కొందరి ప్రశ్నగా మారింది.
నిజంగానే ఈ ప్రశ్నలో నిజమెంత? లింగమనేని ఎంపిక విషయంలో పవన్ కల్యాణ్ స్వేచ్చగా నిర్ణయం తీసుకున్నారా? చంద్రబాబు ఒత్తిడి మేరకు తగ్గారా? ఆయన కోరుకున్న వ్యక్తికి రాజ్యసభ స్థానాన్ని పవన్ ఇచ్చేశారా? లేదంటే.. చంద్రబాబు సిఫార్సుతో జనసేన తన రాజ్యసభ అభ్యర్థిని డిసైడ్ చేసిందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఏపీలోని పలువురి నోట వినిపిస్తున్నాయి. పైకి 3+1 ఫార్ములా చెబుతున్నా.. చివరకు నాలుగు రాజ్యసభ స్థానాల్ని తెలుగుదేశం సొంతం చేసుకొని.. తన వాళ్లనే ఎంపిక చేసుకున్న ప్రచారం జోరుగా సాగుతోంది.
నిజానికి ఈ వాదనలో నిజం ఉందా? అంటే.. లేదనే చెప్పాలి. ఎందుకంటే.. లింగమనేని రమేశ్ చంద్రబాబుకు సన్నిహితుడు కాదని చెప్పటం లేదు. అంతకు మించి జనసేనాని పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడు మాత్రమే కాదు.. పార్టీకి ఆయన బలమైన దన్నుగా నిలిచారన్న విషయాన్ని మర్చిపోకూడదు. అదే సమయంలో.. లింగమనేనిని జనసేన తమ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేస్తుందని.. అధికారిక ప్రకటన వెలువడుతుందన్న అంచనాలు బలంగానే ఉన్నాయి. అందుకు తగ్గట్లే అధికారిక ప్రకటన వెలువడటంలో ఎలాంటి విస్మయం లేదు.
కాకుంటే.. లింగమనేని పేరుతో పవన్ కల్యాణ్ ప్రత్యర్థులు ఆయనపై కొత్త ప్రచారానికి తెర తీశారని చెప్పాలి. లింగమనేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో.. కులం కార్డును బయటకు తీయటం ద్వారా.. పవన్ - లింగమనేని మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల్నివదిలేసి.. ఆయన్ను చంద్రబాబు బినామీగా.. చంద్రబాబు ఒత్తిడితో పవన్ కల్యాణ్ ఓకే అన్నట్లుగా కలర్ ఇచ్చి.. దానికి కొంత మసాలా యాడ్ చేయటం ద్వారా.. కూటమి ఇమేజ్ ను దెబ్బ తీయాలన్నది ఆలోచనగా చెబుతున్నారు.
ఒకవేళ ఇప్పుడు వినిపిస్తున్న వాదనకు తగ్గట్లే.. లింగమనేనికి కాకుండా కాపుసామాజిక వర్గానికి చెందిన నేతకు పవన్ కల్యాణ్ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించి ఉంటే.. రచ్చ మామూలుగా ఉండేదా? జనసేనను రాజకీయ పార్టీ కంటే కుల పార్టీగా ముద్ర వేయాలన్న తలంపు ఆయన ప్రత్యర్థుల్లో బలంగా ఉంది. అలాంటి వేళలో.. వారి అంచనాలకు భిన్నంగా.. తన సన్నిహిత మిత్రుడు..చాలా సందర్భాల్లో పార్టీకి దన్నుగా నిలిచిన లింగమనేనికి రాజ్యసభ సీటును కేటాయించటం ద్వారా పవన్ కల్యాణ్ తనదైన కమిట్ మెంట్ ను పూర్తి చేశారని చెప్పాలి. తన కోసం.. పార్టీ కోసం అండగా నిలిచిన వారి విషయంలో తాను ఎలాంటి తప్పు చేయనన్న విషయాన్ని లింగమనేని అభ్యర్థిత్వం ద్వారా పవన్ కల్యాణ్ మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పక తప్పదు.
