చాట్ జీపీటీ రోజూ తాగేస్తున్న నీరెంతో తెలుసా? ఏఐతో ముంచుకొస్తున్న జలగండం
సాంకేతికత పెంచుతున్న ఈ పర్యావరణ దాహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
By: Tupaki Desk | 9 Jun 2026 1:42 PM ISTప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభంజనం సృష్టిస్తోంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న అవసరానికి చాట్ జీపీటీ, గూగుల్ జెమిని, డీప్‌సీక్ వంటి టూల్స్‌ను వాడటం ఒక అలవాటుగా మారిపోతోంది. మానవ శ్రమను తగ్గిస్తూ అద్భుతాలు చేస్తున్న ఈ డిజిటల్ మేధస్సుతో చాలా పెద్ద ప్రమాదమే ఉందని నిపుణుల హెచ్చరికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మనం స్క్రీన్‌పై చూసే ప్రతి సమాధానం వెనుక, ఏఐ ప్రాసెసింగ్ చేసే ప్రతి కోడింగ్ వెనుక లీటర్ల కొద్దీ స్వచ్ఛమైన తాగునీరు ఆవిరైపోతోందని అంటున్నారు. సాంకేతికత పెంచుతున్న ఈ పర్యావరణ దాహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
చాట్ జీపీటీ : రోజుకు 14.8 కోట్ల లీటర్లు!
ఇటీవల వెలువడిన తాజా నివేదికల ప్రకారం కేవలం ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన 'చాట్ జీపీటీ' ఒక్కటే తన రోజువారీ కార్యకలాపాల కోసం ఏకంగా 148 మిలియన్ లీటర్లు అంటే 14.8 కోట్ల లీటర్ల స్వచ్ఛమైన మంచినీటిని వినియోగిస్తోంది. ఇక చాట్ జీపీటీతో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, డీప్‌సీక్ వంటి ప్రపంచవ్యాప్త ఏఐ ప్లాట్‌ఫారమ్‌లన్నింటినీ కలిపి లెక్కిస్తే, ఇవి ప్రతిరోజూ దాదాపు 200 కోట్ల లీటర్ల స్వచ్ఛమైన మంచినీటిని తాగేస్తున్నాయి. ఒకవైపు ప్రపంచ దేశాలు భవిష్యత్తులో తాగునీటి సంక్షోభం రాబోతోందని భయపడుతుంటే, మరోవైపు ఏఐ టూల్స్ ఈ స్థాయిలో నీటిని హరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏఐ డేటా సెంటర్లకు నీరు ఎందుకు?
మనం క్లౌడ్‌లో వాడే కృత్రిమ మేధస్సు సజావుగా పనిచేయాలంటే తెరవెనుక వేల సంఖ్యలో అత్యంత శక్తివంతమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు రాత్రింబవళ్లు రన్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఈ భారీ సర్వర్లు నిరంతరం రన్ కావడం వల్ల ఊహించని స్థాయిలో వేడి పుడుతుందట. ఈ సర్వర్లు వేడెక్కి కాలిపోకుండా ఉండాలంటే 'వాటర్ కూలింగ్ సిస్టమ్స్' తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సివుంటుంది. ఈ కూలింగ్ ప్రక్రియ కోసం స్వచ్ఛమైన మంచినీరు అవసరం అవుతుందని చెబుతున్నారు. దీనికోసం రీసైకిల్ చేసిన నీరు లేదా ఉప్పునీటిని వాడటానికి కూడా అవకాశం లేదని అంటున్నారు. ఉప్పునీటి వల్ల పైపుల్లో తుప్పు పట్టడం, ఖనిజాలు పేరుకుపోయి అత్యంత ఖరీదైన సర్వర్లు పాడవుతాయని కేవలం మంచినీటినే వాడుతున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగా ఒక సెకనుకు లక్షల లీటర్ల స్వచ్ఛమైన మంచినీటిని డేటా సెంటర్ల గుండా పంపిస్తూ సర్వర్లను కూల్ చేస్తున్నారని అంటున్నారు. ఆ ప్రక్రియలో ఈ నీరంతా ఆవిరిగా మారి గాల్లో కలిసిపోతుందని వివరిస్తున్నారు.
అమెరికాలో ప్రజా ఉద్యమాలు
ఈ టెక్నాలజీ భారంతో అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయానికి నీరు సరఫరా తగ్గించేశారని చెబుతున్నారు. ఏఐ డేటా సెంటర్లకు నీటి సరఫరాను నిరంతరాయంగా కొనసాగించడం కోసం అక్కడి స్థానిక ప్రభుత్వాలు ఇలాంటి చర్య తీసుకోవడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. వ్యవసాయం కంటే ఏఐ టూల్స్ నిర్వహణే ముఖ్యం అన్నట్లుగా ప్రాధాన్యతలు మారిపోవడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలు దేశాల్లో పౌరులు ఈ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బహిరంగ ప్రచారాలు, ఉద్యమాలు చేస్తున్నారు.
ఏపీ అలర్ట్ అవ్వాలా?
ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధస్సు (ఏఐ) హబ్‌గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా వైజాగ్ తోపాటు పరిసర ప్రాంతాలలో మెగా డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు, పెట్టుబడుల ఒప్పందాలు జరుగుతున్నాయి. అయితే గ్లోబల్ ట్రెండ్స్ గమనిస్తే, వైజాగ్ విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించాల్సి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నం నగరం ఇప్పటికే వేసవి వస్తే తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉంటుందని, పరిశ్రమలకు, ప్రజలకు నీటిని సర్దడం మున్సిపల్ కార్పొరేషన్‌కు పెద్ద సవాల్ గా మారిందని గుర్తు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో భారీ ఏఐ డేటా సెంటర్లు ఇక్కడ ఏర్పాటైతే, వాటి కూలింగ్ కోసం రోజుకు కోట్లాది లీటర్ల మంచినీటిని కేటాయించాల్సి వస్తుంది. ఇది స్థానిక ప్రజల తాగునీటి హక్కుపై ప్రభావం చూపవచ్చు అంటున్నారు.
దీంతో డేటా సెంటర్లకు నీటి సరఫరాపై ప్రభుత్వం ఇప్పటి నుంచే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించే విషయంపై కాకుండా, ప్రత్యామ్నాయంగా సముద్రపు నీటిని శుద్ధి చేసి వాడే సాంకేతికతను ఐటీ కంపెనీలు ఉపయోగించేలా ప్రభుత్వం ముందు జాగ్రత్తులు తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. అదేవిధంగా నీటిని ఆవిరి చేయకుండా క్లోజ్డ్- లూప్ లిక్విడ్ కూలింగ్ లేదా ఎయిర్ కూలింగ్ వైపు కంపెనీలను ప్రోత్సహిస్తే నీటి వినియోగంపై ఒత్తిడిని తగ్గించవచ్చని సూచిస్తున్నారు.
