OTT లు ఇబ్బంది పెడుతున్నాయా? నష్టం తప్పదా?

తెలుగు రాష్ట్రాల్లో అయితే సినిమా ఓటీటీలోకి వచ్చిన క్షణాల్లోనే చాలా మంది చూసేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు అయినా, చిన్న సినిమాలు అయినా.. ఓటీటీ రిలీజ్‌ కు మంచి స్పందనే కనిపిస్తోంది.

Update: 2026-05-22 14:30 GMT

కొవిడ్ తర్వాత ఎంటర్టైన్మెంట్ సెక్టార్ లో పెద్ద మార్పు తీసుకొచ్చిన ప్లాట్‌ ఫామ్స్ ఓటీటీలు. థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు చూడటానికి ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో ఓటీటీ వినియోగం గత కొన్నేళ్లలో బాగా పెరిగింది. ఒకప్పుడు సినిమా టీవీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే పరిస్థితి ఉండగా.. ఇప్పుడు థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అయితే సినిమా ఓటీటీలోకి వచ్చిన క్షణాల్లోనే చాలా మంది చూసేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు అయినా, చిన్న సినిమాలు అయినా.. ఓటీటీ రిలీజ్‌ కు మంచి స్పందనే కనిపిస్తోంది. అయితే అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రేక్షకుల పరిస్థితి మాత్రం భిన్నంగా మారుతోందన్న చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇండియాలో అందుబాటులోకి వచ్చిన కొన్ని తెలుగు సినిమాలు అమెరికా ఓటీటీ యూజర్లకు వెంటనే అందుబాటులో లేకపోవడం వారిని అసంతృప్తికి గురి చేస్తోంది.

ఇప్పటికే పలుమార్లు ఇదే పరిస్థితి ఎదురవుతోందని అక్కడి తెలుగు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియాలో సినిమా స్ట్రీమింగ్ మొదలైనప్పటికీ.. అమెరికా ప్రాంతంలో మాత్రం కొన్ని గంటలు, కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ అవుతున్నట్లు చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సబ్‌ స్క్రిప్షన్ తీసుకుని కూడా సమయానికి సినిమా చూడలేకపోతే ప్రయోజనం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇక మరికొందరు ఓటీటీ సంస్థల విధానాలపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. ప్రాంతాల వారీగా కంటెంట్ విడుదలలో తేడాలు పెట్టడం వల్లే యూజర్లలో అసంతృప్తి పెరుగుతోందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో భారీ సంఖ్యలో తెలుగు ప్రేక్షకులు ఉండటంతో.. అక్కడి మార్కెట్‌ ను ఓటీటీ సంస్థలు మరింత జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉందని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.

అమెరికాలో ఆలస్యంగా రిలీజ్ కావడానికి పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రాంతీయ డిజిటల్ హక్కులు, టైమ్ జోన్ సమస్యలు, సర్వర్ అప్డేట్లు, లోకల్ అగ్రిమెంట్స్ వంటి అంశాలు దీనికి కారణమయ్యే అవకాశం ఉందని మూవీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే సాధారణ ప్రేక్షకులకు ఇవి అంతగా అర్థం కావని.. వారికి కావాల్సింది సమయానికి కంటెంట్ మాత్రమేనని చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లకే నష్టం కలిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొందరు యూజర్లు సబ్‌ స్క్రిప్షన్ రెన్యువల్ చేయకుండా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరికొందరు పైరసీ వెబ్‌ సైట్ల వైపు మొగ్గు చూపుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఇది కేవలం ఓటీటీలకే కాదు సినిమా పరిశ్రమకు కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని టాక్ వినిపిస్తోంది.

అందుకే ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి కంటెంట్ అందుబాటులోకి తీసుకురావడం ఇప్పుడు ఓటీటీ సంస్థలకు కీలకంగా మారింది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న ఇండియన్స్ ఆడియన్స్ టేస్ట్, అంచనాలను దృష్టిలో పెట్టుకుని సరైన ప్లాన్ అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. లేదంటే పెరుగుతున్న పోటీ మధ్య ఓటీటీలకు ప్రేక్షకులను నిలబెట్టుకోవడం కష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News