Bigg Boss Telugu 10: కెప్టెన్ అమన్ & ముఖేష్‌లకు గట్టి వార్నింగ్!
| బిగ్‌బాస్ తెలుగు 10 వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున కంటెస్టెంట్లకు క్లాస్ తీసుకున్నారు. వర్షిణిని బాధించిన వ్యాఖ్యలపై త్రిగుణ్‌ను ప్రశ్నించి, ఆమెకు సారీ చెప్పాలని సూచించారు. కెప్టెన్సీ పేరుతో అధికార ధోరణి ప్రదర్శించవద్దని అమన్‌ను హెచ్చరించారు. ముఖేష్ తన ప్రవర్తనతో అభిమానులను దూరం చేసుకునే ప్రమాదం ఉందని, నటనతో పాటు వ్యక్తిత్వం కూడా ముఖ్యమని స్పష్టం చేశారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఫినాలే దశకు చేరుకుంటున్న వేళ హౌస్‌లో పోటీతో పాటు గొడవలు, మాటల తూటాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున రంగంలోకి దిగి కంటెస్టెంట్ల ఆటతీరును కడిగిపారేశారు. ముఖ్యంగా వర్షిణి - త్రిగుణ్ వివాదం, కెప్టెన్ అమన్ ప్రవర్తన, ముఖేష్ తీరుపై వీడియో క్లిప్స్ చూపిస్తూ నాగార్జున క్లారిటీ ఇచ్చారు.
హౌస్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి నాగార్జున అడగగానే వర్షిణి తీవ్ర భావోద్వేగానికి గురైంది. హౌస్‌లో తొమ్మిది మంది ఒకవైపు, తామిద్దరం ఒకవైపు ఉన్నట్లు అనిపిస్తోందని, ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా తన క్యారెక్టర్ గురించి త్రిగుణ్ చేసిన 'చీప్ క్యారెక్టర్' అనే వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని వర్షిణి కన్నీరుమున్నీరైంది.
అయితే ఆ మాటను త్రిగుణ్ కేవలం స్నేహం గురించే అన్నానని తర్వాత వివరణ ఇచ్చాడు కదా అని నాగార్జున గుర్తుచేస్తూ, అందుకు సంబంధించిన వీడియోను ప్లే చేసి చూపించారు. అనంతరం త్రిగుణ్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన నాగార్జున.. వర్షిణి మనసు నొచ్చుకునేలా మాట్లాడిన తీరుపై ప్రశ్నించారు. స్నేహానికి విలువ ఇవ్వని వ్యక్తిగా వర్షిణి నిన్ను ఎలా భావించిందో, నీకు కూడా ఆమెపై అదే అభిప్రాయం ఉందని నాగార్జున అన్నారు.
ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకోవాలని సూచిస్తూ, వర్షిణికి మనస్ఫూర్తిగా సారీ చెప్పాలని త్రిగుణ్‌కు నాగార్జున హితవు పలికారు.
కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమన్ ప్రవర్తన మారిందా? అని నాగార్జున ప్రశ్నించగా, తాను అలా ఏమీ చేయలేదని అమన్ బదులిచ్చాడు. అయితే ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో, ఒత్తిడిలో ఉన్నప్పుడే అసలు స్వభావం బయటపడుతుందని నాగార్జున చురకలంటించారు. పాలు వేడి చేసే విషయంలో అమన్, ముఖేష్ మధ్య జరిగిన గొడవ వీడియోను నాగార్జున ప్లే చేశారు. ముఖేష్‌ను పట్టుకుని అమన్ నిలదీసిన తీరుపై ప్రశ్నించారు. కెప్టెన్సీ అంటే అధికారం కాదు, బాధ్యత అని, ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని గట్టిగా హెచ్చరించారు.
ముఖేష్ బట్టలను స్విమ్మింగ్ పూల్‌లో వేసిన ఘటనపై వర్షిణిని ప్రశ్నించగా.. అక్కడ తన బట్టలు కూడా ఉన్నాయని, 24 గంటలు గడవకముందే వాటిని పడేశారని వర్షిణి వివరించింది. ఈ విషయంలో ఎవరిది తప్పో చర్చించిన నాగార్జున.. ముఖేష్ తన ప్రవర్తన వల్ల అభిమానులను దూరం చేసుకునే ప్రమాదం ఉందని, స్టార్డమ్ నిలబెట్టుకోవాలంటే నటనతో పాటు ప్రవర్తన కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు.