“ఇదేమైనా ఐపీఎల్ అనుకున్నావా?” లంక ఆటగాళ్ల వ్యాఖ్యలతో రగిలిపోయిన వైభవ్

ఇప్పుడు మాత్రం అతడి ‘యాంగర్ మేనేజ్‌మెంట్’పై డిస్కషన్లు పెడుతోంది. భారత్ ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మనోడు లంక ఆటగాళ్లతో పెట్టుకున్న ‘సందడి’ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్.

Update: 2026-06-16 05:04 GMT

భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది... అదే వైభవ్ సూర్యవంశీ.. నిన్నమొన్నటివరకు ఈ కుర్రాడి వయసు ఎంత? ఇతగాడు కొట్టే సిక్సర్ల వేగం ఎంత? అంటూ లెక్కలు వేసుకున్న ప్రపంచ క్రికెట్.. ఇప్పుడు మాత్రం అతడి ‘యాంగర్ మేనేజ్‌మెంట్’పై డిస్కషన్లు పెడుతోంది. భారత్ ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మనోడు లంక ఆటగాళ్లతో పెట్టుకున్న ‘సందడి’ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్.

అసలు గ్రౌండ్‌లో ఏం జరిగిందయ్యా అంటే...

మ్యాచ్ అంటే గెలవాలి, లేదంటే ఓడాలి. కానీ శ్రీలంక ఆటగాళ్లకు మాత్రం మ్యాచ్ గెలవడం కంటే, వైభవ్‌ను గెలకడమే ముఖ్యమైన టాస్క్‌లా అనిపించినట్టుంది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు మన కుర్రాడిని టార్గెట్ చేస్తూ నోటికి పని చెప్పారు.

“ఇదేమైనా ఐపీఎల్ అనుకున్నావా తమ్ముడూ?”

పాపం.. లంక ప్లేయర్లకు ఐపీఎల్ వేలంలో మనోడికి వచ్చిన రేటు చూసి ఎక్కడో కాలినట్టుంది. అందుకే పదే పదే వైభవ్ దగ్గరకు వచ్చి, “ఇదేమైనా ఐపీఎల్ అనుకున్నావా? ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే వేరే లెవెల్‌లో ఉంటుంది” అంటూ తెగ క్లాసులు పీకేశారట. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటంలో తామేదో పీహెచ్‌డీలు చేసినట్టు లంక ఆటగాళ్లు బిల్డప్ ఇవ్వడం చూస్తే.. పాపం ‘ఆ గ్రేట్ కింగ్ కోహ్లీనే మేం వదల్లేదు, నువ్వెంత తమ్ముడూ’ అన్నట్టుంది వారి వ్యవహారం.

ట్విస్ట్ ఏంటంటే మ్యాచ్ మామూలుగా ముగిసిపోతే గొడవ ఉండేది కాదు.. కానీ సినిమా క్లైమాక్స్ లాగా మ్యాచ్ కాస్తా సూపర్ ఓవర్ కు వెళ్లింది. దాంతో లంక ప్లేయర్లలో బీపీ, షుగర్లు ఒకేసారి పెరిగిపోయాయి. సూపర్ ఓవర్ ముగిసిన తర్వాత కూడా ‘సహజసిద్ధమైన’ అలవాటు ప్రకారం వైభవ్‌ను మళ్లీ కవ్వించారు.

సహనం కోల్పోయిన సూర్యవంశీ.. ఊరుకుంటాడా మరి..

ఎంత చిన్న పిల్లోడైతే మాత్రం.. పదే పదే గెలికితే చూస్తూ ఊరుకుంటాడా? లంక ప్లేయర్స్ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక మన వైభవ్ సూర్యవంశీకి ఒక్కసారిగా పూనకం వచ్చేసింది. ‘ఆపండ్రా మీ సోది’ అన్న రేంజ్‌లో వారిపైకి దూసుకెళ్లాడు. లంక టీమ్ ఊహించని ఈ కౌంటర్ అటాక్‌తో గ్రౌండ్‌లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. చివరకు మన టీమ్ స్టాఫ్.. తోటి ప్లేయర్స్ పరుగెత్తుకుంటూ వచ్చి.. వైభవ్‌ను పట్టుకుని వెనక్కి లాగడంతో గొడవ పెద్దది కాకుండా ఆగింది. లేదంటే లంక ప్లేయర్లకు మైదానంలోనే ‘సూర్యవంశీ’ సినిమా చూపించేవాడేమో!

నెటిజన్ల పంచాయితీ.. తప్పు ఎవరిది?

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఆలస్యం.. మన నెటిజన్లు అప్పుడే కోర్టులు పెట్టేసి తీర్పులు ఇచ్చేస్తున్నారు. “ఇంకా పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండలేదు.. అప్పుడే ఇంత ఆవేశం పనికిరాదు తమ్ముడూ.. ఆటపై దృష్టి పెట్టాలి” అంటూ నీతులు చెబుతున్నారు. “ఐపీఎల్ కాంట్రాక్ట్ లేని లంక ప్లేయర్స్ కుళ్ళుతో అలానే వాగుతారు.. మనోడు ఇచ్చింది కరెక్ట్ రిటార్ట్. తగ్గేదే లే!” అంటూ వైభవ్‌కు మరికొంతమంది ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.

ఏది ఏమైనా వైభవ్ సూర్యవంశీ కేవలం బ్యాటింగ్‌తోనే కాదు.. అవసరమైతే గ్రౌండ్‌లో ‘యాక్షన్’ సీన్లు చేయడంలో కూడా తగ్గేదేలే అని నిరూపించాడు. మరి ఈ రచ్చపై ఇరు జట్ల యాజమాన్యాలు ఎలాంటి ఫైన్లు వేస్తాయో.. బోర్డులు ఎలా స్పందిస్తాయో చూడాలి.



Tags:    

Similar News