ఐపీఎల్ లో 'స్కిల్'కు చోటు లేదా? లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు..
అయితే ఈ టోర్నీ ప్రస్తుత స్వరూపంపై తాజాగా ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు లియామ్ లివింగ్ స్టన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన, అత్యంత ధనిక టీ20 లీగ్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లు ఈ వేదికపై తమ ప్రతిభను నిరూపించుకునేందుకు పోటీపడుతుంటారు. అయితే ఈ టోర్నీ ప్రస్తుత స్వరూపంపై తాజాగా ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు లియామ్ లివింగ్ స్టన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఐపీఎల్ లో ప్రస్తుతం ఆటగాళ్ల అసలైన నైపుణ్యం కంటే, బ్యాటర్లకు విపరీతంగా అనుకూలించే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
భారీ స్కోర్లు.. తగ్గుతున్న ఉత్కంఠ!
ఒక అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన లివింగ్‌స్టోన్, ఐపీఎల్ లో భారీ స్కోర్లు నమోదు కావడం ఇప్పుడు చాలా సాధారణమైన విషయంగా మారిపోయిందని.. దీనివల్ల మ్యాచ్‌లలో ఉండాల్సిన అసలైన ఉత్కంఠ క్రమంగా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తాము ముంబై ఇండియన్స్‌తో ఆడిన ఒక మ్యాచ్‌ను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. ఆ మ్యాచ్‌లో 230 పరుగులకు పైగా భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు కేవలం 18 ఓవర్లలోనే ఛేదించిందని గుర్తు చేశారు. "ఒక్కో బంతికి సిక్సర్లు, ఫోర్లు పడుతుంటే అభిమానులకు మొదట్లో చాలా ఉత్సాహంగా, వినోదాత్మకంగా అనిపించవచ్చు. కానీ ప్రతి మ్యాచ్‌లోనే అదే పరిస్థితి కనిపిస్తే ఆటలోని అసలు నైపుణ్యం కనిపించకుండా పోతుంది. అది క్రికెట్ సమతుల్యతను దెబ్బతీస్తుంది" అని లివింగ్‌స్టోన్ పేర్కొన్నారు.
బౌలర్ల పరిస్థితి ఘోరం.. కారణాలు ఇవేనా?
ఐపీఎల్ లో గత కొన్ని సీజన్లుగా బ్యాటర్లకు పూర్తిగా అనుకూలమైన ఫ్లాట్ పిచ్‌లు, చిన్న బౌండరీలు ఉండటం వల్ల బౌలర్ల పరిస్థితి దారుణంగా తయారైందని లివింగ్‌స్టోన్ అభిప్రాయపడ్డారు. దీనికి తోడు 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన కూడా తోడవడంతో బ్యాటింగ్ జట్ల స్కోర్లు విపరీతంగా పెరిగాయని విశ్లేషించారు. బౌలర్ల ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బౌలర్‌గా మీరు ఎంత సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేసినా, చిన్నపాటి తప్పిదం జరిగినా అది నేరుగా సిక్సర్‌గా మారిపోతోంది. ఇలాంటి పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై బౌలర్ల అసలైన నైపుణ్యాన్ని, ప్రతిభను అంచనా వేయడం చాలా కష్టమైన విషయమని ఆయన అన్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ప్రత్యేక వ్యాఖ్యలు
ఈ చర్చలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి లివింగ్‌స్టోన్ ప్రత్యేకంగా మాట్లాడారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఒకే పిచ్‌పై సన్‌రైజర్స్ జట్టు వరుసగా ఐదు నుంచి ఆరు మ్యాచ్‌లు ఆడిందని ఆయన గుర్తు చేశారు. ఒకే పిచ్‌పై వరుసగా ఆడటం వల్ల అక్కడి పరిస్థితులను, పిచ్ స్వభావాన్ని బ్యాటర్లు పూర్తిగా అర్థం చేసుకున్నారని ఫలితంగానే భారీ స్కోర్లు మరింతగా పెరిగాయని పేర్కొన్నారు. గత సీజన్లలో హైదరాబాద్ వేదికగా 250 నుంచి 270 ప్లస్ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లు అనేకం జరగడం లివింగ్‌స్టోన్ చేసిన వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తోంది. లివింగ్‌స్టోన్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏది ఏమైనప్పటికీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్ లో స్కోర్లు విపరీతంగా పెరుగుతున్న కొద్దీ, బ్యాటర్-బౌలర్ మధ్య ఉండాల్సిన సమతుల్యతపై ప్రపంచ క్రికెట్‌లో చర్చలు మరింత తీవ్రమవుతున్నాయి. భవిష్యత్తులో పిచ్‌ల తయారీ విధానంలో మార్పులు చేస్తారా అలాగే బౌలర్లను బలిపశువులుగా మారుస్తోందని విమర్శలు ఎదుర్కొంటున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్‌ను బీసీసీఐ పునరాలోచిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే లివింగ్‌స్టోన్ వ్యాఖ్యలు ఐపీఎల్ నిర్వాహకులకు ఒక హెచ్చరిక లాంటివేనని విశ్లేషకులు భావిస్తున్నారు.