ఐపీఎల్ 2026: బౌలర్ల గుండెల్లో రైళ్లు.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త 'బ్యాటింగ్ విప్లవం'!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే ఫోర్లు, సిక్సర్ల విందు. కానీ 2026 సీజన్ మాత్రం అంతకు మించి అన్నట్లుగా సాగుతోంది.;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే ఫోర్లు, సిక్సర్ల విందు. కానీ 2026 సీజన్ మాత్రం అంతకు మించి అన్నట్లుగా సాగుతోంది. ఒకప్పుడు టీ20ల్లో 200 పరుగులు చేస్తే గెలుపు ఖాయమని ధీమాగా ఉండే జట్లు.. ఇప్పుడు 250 పరుగులు చేసినా గెలుస్తామో లేదో అని వణికిపోతున్నాయి. బ్యాటర్ల విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ సీజన్ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. బౌలర్లకు నరకం చూపిస్తూ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుండటంతో 200+ ఛేజింగ్‌లు ఈ సీజన్‌లో సర్వసాధారణంగా మారిపోయాయి.
రికార్డుల రికార్డులు.. పాత రికార్డులన్నీ కనుమరుగు!
ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుండి 2025 వరకు (దాదాపు 18 ఏళ్లు) కేవలం ఐదు సార్లు మాత్రమే 220 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాలను జట్లు ఛేజ్ చేయగలిగాయి. కానీ విస్మయపరిచే విషయం ఏమిటంటే ఈ ఒక్క 2026 సీజన్ సగం ముగిసేలోపే ఆ రికార్డు ఐదుసార్లు బద్దలైంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్యాటర్లు ఎంతటి భీకరమైన ఫామ్‌లో ఉన్నారో! ముఖ్యంగా ఈ సీజన్‌లో నమోదైన కొన్ని అద్భుత ఛేజింగ్‌లను పరిశీలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఏకంగా 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ అయితే ఏకంగా ముంబై ఇండియన్స్ వంటి పటిష్టమైన బౌలింగ్ విభాగంపై 249 పరుగుల లక్ష్యాన్ని, రాజస్థాన్ రాయల్స్‌పై 229 పరుగులను అలవోకగా ఛేజ్ చేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఇటీవలే పంజాబ్ నిర్దేశించిన 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి తన సత్తా చాటింది.
ఈ పరుగుల సునామీకి కారణాలేంటి?
క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ భారీ స్కోర్ల వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఫ్లాట్ పిచ్‌లే కారణం.. బ్యాటింగ్‌కు అనుకూలమైన రోడ్డు లాంటి పిచ్‌లు బౌలర్ల వేగాన్ని ఏమాత్రం కనికరించడం లేదు. చిన్న బౌండరీలతో స్టేడియాల పరిమాణం బ్యాటర్లకు వరంగా మారింది. మిస్ హిట్ అయిన బంతులు కూడా సిక్సర్లుగా మారుతున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నిబంధన వల్ల జట్లు అదనపు బ్యాటర్‌తో బరిలోకి దిగుతున్నాయి. దీంతో వికెట్లు పడినా భయం లేకుండా చివరి వరకు బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు.
బౌలర్ల పరిస్థితి ఏంటి?
ఒకప్పుడు బౌలర్లు మ్యాచ్‌లను గెలిపిస్తారని అనేవారు. కానీ ఈ సీజన్‌లో బౌలర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. యార్కర్లు వేసినా, స్లో బంతులు వేసినా బ్యాటర్లు కనికరించడం లేదు. "ఇది క్రికెటా లేక బ్యాటర్ల ఆటనా?" అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బౌలర్ల ఎకానమీ రేటు 10 దాటడం సాధారణం అయిపోయింది. బౌలింగ్ యూనిట్లు ఇప్పుడు కేవలం వికెట్ల కోసం కాకుండా పరుగులను ఎలా నియంత్రించాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి.
వినోదమా.. ఆందోళనా?
ప్రేక్షకుల కోణం నుండి చూస్తే ఐపీఎల్ 2026 పండగలా ఉంది. ప్రతి మ్యాచ్‌లోనూ ఉత్కంఠ, ఆఖరి బంతి వరకు సాగే పోరాటాలు టోర్నమెంట్‌కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. అయితే, బ్యాటింగ్ బౌలింగ్ మధ్య సమతుల్యత దెబ్బతింటోందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
సీజన్ ఇంకా సగం కూడా ముగియలేదు. అప్పుడే ఇన్ని రికార్డులు నమోదయ్యాయి అంటే.. ఫైనల్స్ నాటికి ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో వేచి చూడాలి. మొత్తానికి 2026 ఐపీఎల్ సీజన్ క్రికెట్ చరిత్రలో 'బ్యాటర్ల స్వర్ణయుగం'గా నిలిచిపోవడం ఖాయం!