ఐపీఎల్ 2026 : బ్యాటర్ల స్వర్గం, బౌలర్ల నరకం!

బౌలింగ్ వేయడానికి గ్రౌండ్‌లోకి వచ్చేటప్పుడు స్ట్రాటజీ బుక్స్ కాకుండా ఏకంగా ప్రార్థనల పుస్తకాలు చేతబట్టుకుని వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Update: 2026-06-01 05:58 GMT

ఐపీఎల్ 2026 ముగిసింది. క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్యాన్స్ అయితే ఏకంగా ఆకాశంలో తేలుతున్నారు. కానీ ఈ సీజన్ ముగియగానే అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నది ఎవరైనా ఉన్నారంటే... అది కచ్చితంగా మన బౌలర్లే.. ఎందుకంటే ఈ ఏడాది వాళ్లు పడిన నరకం అంతా ఇంతా కాదు. బౌలింగ్ వేయడానికి గ్రౌండ్‌లోకి వచ్చేటప్పుడు స్ట్రాటజీ బుక్స్ కాకుండా ఏకంగా ప్రార్థనల పుస్తకాలు చేతబట్టుకుని వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ సీజన్ చూశాక "బౌలింగ్ అనేది ఒక ఆర్ట్" అనే పాత మాటలు మారిపోయి.. "బంతిని విసరడం... అది సిక్సర్ వెళ్లడం... మళ్లీ కొత్త బంతిని అందుకోవడం" అనే ఒక మెకానికల్ ప్రాసెస్‌లా మారిపోయింది.

రికార్డుల 'రచ్చ'... బౌలర్ల 'ఏడుపు'

గత 18 సీజన్ల రికార్డులను తిరగేసి "ఇవన్నీ ఎందుకు భయ్యా మాకు?" అన్నట్టుగా బ్యాటర్లు చింపి చేతిలో పెట్టారు. ఈ సీజన్ గణాంకాలు చూస్తే బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. గత 18 సీజన్ల రికార్డులను ఒక్కొక్కటిగా తీసుకుని "ఇవన్నీ ఎందుకు?" అన్నట్టుగా బ్యాటర్లు చిత్తు చేశారు. అత్యధిక రన్స్ (27,450), అత్యధిక ఫోర్లు (2,332), అత్యధిక సిక్సులు (1,426), అత్యధిక సెంచరీలు (15), 200కు పైగా స్కోర్లు (65)... ఇలా ఎక్కడ చూసినా కొత్త రికార్డులే కనిపించాయి.

పరిస్థితి ఎలా తయారైందంటే... మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ 220 కొట్టినా కెప్టెన్ ప్రశాంతంగా కూర్చోలేకపోయాడు. "220 కొట్టాం కదా... గెలుస్తామా? లేక టీ బ్రేక్ లోపే ఫినిష్ చేస్తారా?" అని గోళ్లు కొరుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 17 సార్లు 200 ప్లస్ టార్గెట్లను ప్రత్యర్థి జట్లు చాలా క్యాజువల్‌గా సాయంత్రం పూట పార్కులో వాకింగ్ చేసినంత ఈజీగా చేజ్ చేసేశాయి!

ఆర్సీబీ ఎట్టకేలకు గెలిచింది... కోహ్లీ 'భారం' దిగింది!

ఈ విధ్వంసాలన్నింటి మధ్య ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్‌సీబీ ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్లో విరాట్ కోహ్లీ ఎప్పటిలాగే క్లాస్ ఇన్నింగ్స్ ఆడి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. అయితే మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కింగ్ కోహ్లీ చేసిన కామెంట్స్ ఈ సీజన్‌కే హైలైట్. "గత ఏడాది ఉన్నంత ప్రెజర్ ఈసారి నా మీద లేదు. ప్రతి మ్యాచ్‌లో నేనే దిగి టీమ్‌ను కాపాడాల్సిన కర్మ ఈసారి తప్పింది. బాధ్యత పంచుకునేవాళ్లు దొరికారు!" అని విరాట్ కోహ్లీ తెలిపారు.

ఈ ఒక్క మాటతో సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురిసింది. "ఇన్నాళ్లూ కోహ్లీ ఒక్కడే బ్యాటింగ్ చేస్తుంటే మిగతావాళ్లు నాన్-స్ట్రైకర్ ఎండ్‌లోనూ డగౌట్‌లోనూ టికెట్ లేని ప్రేక్షకులుగా ఎంజాయ్ చేసేవారు. థాంక్ గాడ్... ఈసారి వాళ్లు కూడా బ్యాట్లు పట్టుకొచ్చారు" అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

కింగ్ 'డ్యాన్స్' ధమాకా!

ట్రోఫీ చేతికి రాగానే గ్రౌండ్‌లో కోహ్లీ చేసిన సెలబ్రేషన్స్ వేసిన స్టెప్పులు నెట్టింట వైరల్‌గా మారాయి. సాధారణంగా గ్రౌండ్‌లో తన బ్యాటింగ్‌తో బౌలర్లను పిచ్చెక్కించి డ్యాన్స్ చేయించే కింగ్.. ఈసారి తానే మైదానంలో నాటు నాటు స్టెప్పులేశాడు. అభిమానులు కూడా "ట్రోఫీ రానివ్వండి, మనోడిలో ఉన్న అసలైన డ్యాన్సర్ బయటకు వస్తాడు అనుకున్నాం... నిజంగానే వచ్చేశాడు" అని మురిసిపోతున్నారు.

మొత్తానికి ఐపీఎల్ 2026 అనేది కేవలం ఒక టోర్నమెంట్ కాదు. ఇది బ్యాటర్ల 'రాజ్యాభిషేకం' బౌలర్లకు 'కఠిన శిక్ష', ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు 'పునర్జన్మ'. ఈ సీజన్ చూశాక ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు... "ఇండియన్ ప్రీమియర్ లాంచ్ పాడ్" అని ఫిక్స్ అయిపోవచ్చు. బంతి పడిందా... స్పేస్ ఎక్స్ రాకెట్‌లా ఆకాశంలోకి లాంచ్ అవ్వాల్సిందే! బౌలర్లారా... కాస్త విశ్రాంతి తీసుకోండి, వచ్చే ఏడాది కైనా పిచ్‌లు మారుతాయేమోనని ఆశగా దేవుడికి మొక్కుకోండి..

Tags:    

Similar News