తిలక్ వర్మ రంగుపై అర్ష్‌దీప్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ ఒక అనూహ్య వివాదం క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ ఒక అనూహ్య వివాదం క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ముంబై ఇండియన్స్ యువ కెరటం తిలక్ వర్మ స్కిన్ కలర్‌ను ఉద్దేశిస్తూ చేసినట్లుగా భావిస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన సంభాషణే అయినప్పటికీ అందులోని పదజాలం జాతి వివక్ష ధోరణిలో ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
అసలేం జరిగింది?
పంజాబ్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకుంటున్న సమయంలో అర్ష్‌దీప్ సింగ్ దూరం నుంచి తిలక్ వర్మను ఉద్దేశిస్తూ “ఓయ్ అంధేరే” అని పిలిచాడు. హిందీలో 'అంధేరే' అంటే 'చీకటి' లేదా 'నలుపు' అని అర్థం.
ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం ముదిరింది. తిలక్ వర్మ చర్మ రంగును ఎగతాళి చేస్తూ అర్ష్‌దీప్ ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫన్నీ రీల్స్ , జోకులతో యాక్టివ్‌గా ఉండే అర్ష్‌దీప్ ఈసారి మాత్రం హద్దులు దాటాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలు
ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే క్రికెట్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. మెజారిటీ నెటిజన్లు అర్ష్‌దీప్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. "తోటి భారతీయ ఆటగాడిని, అందులోనూ జాతీయ జట్టుకు ఆడే సహచరుడిని ఇలా చర్మ రంగుతో పిలవడం అత్యంత అనాగరికం" అని ఒక నెటిజన్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ భారత ఆటగాళ్ల పట్ల ఉత్తర భారత ఆటగాళ్లు చూపే వివక్షకు ఇది నిదర్శనమని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించకూడదని, వెంటనే అర్ష్‌దీప్ సింగ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని లేదా కనీసం వార్నింగ్ ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన తిలక్ వర్మ!
వివాదాలు ఒకవైపు నడుస్తున్నా మైదానంలో మాత్రం తిలక్ వర్మ తన ఏకాగ్రతను కోల్పోలేదు. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో తిలక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. "మాటలతో కాదు.. నా ఆటతోనే సమాధానం చెబుతా" అన్నట్లుగా తిలక్ కేవలం 38 బంతుల్లోనే 75 పరుగులు చేసి ముంబై ఇండియన్స్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఈ ఇన్నింగ్స్ తర్వాత తిలక్ వర్మకు మద్దతు మరింత పెరిగింది. "అర్ష్‌దీప్ మాటలకు తిలక్ తన బ్యాట్‌తోనే సరైన సమాధానం ఇచ్చాడు" అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తిలక్ క్లాస్ ఇన్నింగ్స్ ముందు అర్ష్‌దీప్ వ్యాఖ్యలు చిన్నబోయాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలి!
ఐపీఎల్ వంటి అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లు కోట్లాది మంది ప్రజల పర్యవేక్షణలో ఉంటాయి. ఆటగాళ్లు మైదానం బయట ఎంత స్నేహంగా ఉన్నా బహిరంగంగా మాట్లాడేటప్పుడు లేదా తోటి ఆటగాళ్లను సంబోధించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సరదాగా అన్న మాటలైనా అవి ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసేలా ఉంటే.. అది వారి కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈ వివాదంపై అర్ష్‌దీప్ సింగ్ స్పందిస్తాడో లేదో వేచి చూడాలి.