ఇండియా వర్సెస్ పాక్.. మళ్లీ అదే కథ.. నో హ్యాండ్ షేక్..

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే కేవలం 22 గజాల పిచ్ మీద జరిగే ఆట కాదు.. అది అంతకుమించిన ఎమోషనల్ సినిమా.

Update: 2026-06-14 16:40 GMT

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే కేవలం 22 గజాల పిచ్ మీద జరిగే ఆట కాదు.. అది అంతకుమించిన ఎమోషనల్ సినిమా. సరిగ్గా ఇలాంటి సీన్లే ఇప్పుడు ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌లో రిపీట్ అవుతున్నాయి. టాస్ గెలవడమే ఆలస్యం, మన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏమాత్రం ఆలోచించకుండా "మేము బ్యాటింగ్ చేస్తాం బాస్ " అని తేల్చేసింది. అయితే ఇంగ్లాండ్ చల్లటి గాలులు, స్వింగ్ అయ్యే పిచ్‌లు మన బ్యాటర్లకు ఎప్పుడూ 'కత్తిమీద సామే' అని మరోసారి ప్రూవ్ అయింది.

ఆరంభంలోనే 'షాక్' ట్రీట్‌మెంట్.. మన ఓపెనర్ల ఘనకార్యం

సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తిస్తుందని ఆశించిన లేడీ సెహ్వాగ్ షెఫాలీ వర్మ.. ఈసారి కేవలం 6 పరుగులకే సాదియా ఇక్బాల్ వేసిన మాయాజాలానికి చిక్కి పెవిలియన్ దారి పట్టింది. సరే వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అయినా కాసేపు క్రీజులో పాతుకుపోతుందేమో అనుకుంటే.. ఆమె ఇంకాస్త అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించి "నువ్వు ఆరు చేస్తే, నేను ఒక్క పరుగుతోనే సరిపెట్టుకుంటా" అన్నట్టుగా ఒకే ఒక్క రన్‌కే తస్మియా బౌలింగ్‌లో ఔటైపోయింది. దీంతో స్కోరు బోర్డుపై 18 పరుగులు చేరేసరికే రెండు కీలక వికెట్లు లేచిపోయాయి. మైదానంలో పాకిస్తాన్ బౌలర్లు సాదియా ఇక్బాల్, తస్మియా ఏదో వరల్డ్ కప్ ఫైనల్ రేంజ్‌లో లైన్ అండ్ లెంగ్త్‌తో విరుచుకుపడుతుంటే మనవాళ్లు ఒత్తిడితో ఊపిరి బిగబట్టారు.

సీనియర్లు దిగారు.. బండి గాడిలో పడింది!

ఇలాంటి టైట్ సిట్యుయేషన్‌లో జట్టును ఆదుకోవడానికి క్లాస్ ప్లేయర్ స్మృతి మంధానా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రంగంలోకి దిగారు. అనవసరమైన 'హీరోయిజం' ప్రదర్శించి వికెట్లు పారేసుకోకుండా, చాలా బుద్ధిగా సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలిస్తూ.. "మేము ఉన్నాం, కంగారు పడకండి" అని ఫ్యాన్స్‌కు భరోసా ఇచ్చారు. చివరికి ఈ ఇద్దరి పుణ్యమా అని భారత్ 11.4 ఓవర్లలో 84 పరుగులకు చేరుకుని, అపాయం నుంచి గట్టెక్కి పటిష్ట స్థితికి చేరుకుంది.

అసలు మ్యాటర్ ఇది కాదు.. 'షేక్ హ్యాండ్' లొల్లి చూశారా?

మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల కంటే మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ఒక 'కోల్డ్ వార్' సీన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. టాస్ వేసిన తర్వాత మన భారత కెప్టెన్, పాకిస్తాన్ కెప్టెన్‌కు కనీసం మొహమాటానికైనా ఒక చిన్న నవ్వు నవ్వకుండా పెద్దగా ముచ్చటించకుండానే "బాయ్" చెప్పేసి వెనుదిరిగింది. ఇంకేముంది సోషల్ మీడియా పులులకు పెద్ద బోనస్ దొరికినట్లయింది! "పురుషుల క్రికెట్‌లో కనిపించే ఆ పాత పగ, కోపం.. ఇప్పుడు మహిళల క్రికెట్‌కు కూడా బాగానే పాకింది భయ్యా" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "క్రీడలను, రాజకీయాలను కలపకండి బాబోయ్.. మైదానంలో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ చూపించాలి" అని సుద్దులు చెబుతున్నారు. ఇంకో వర్గం వాళ్లేమో "దేశ ప్రయోజనాలే ముఖ్యం, సరిహద్దుల్లో అంత జరుగుతుంటే అక్కడ నవ్వులు చిందించాలా? మన కెప్టెన్ చేసింది వంద శాతం కరెక్ట్" అంటూ సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తున్నారు.

ఏది ఏమైనా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే మైదానంలో వికెట్లు పడినా పడకపోయినా.. మైదానం వెలుపల, సోషల్ మీడియాలో మాత్రం ఇరు దేశాల అభిమానుల మధ్య రచ్చ గ్యారెంటీ అని మరోసారి రుజువైంది. మరి ఈ ఉత్కంఠభరిత పోరులో చివరికి ఏ జట్టు ఒత్తిడిని జయించి 'రియల్ క్వీన్' లా నిలుస్తుందో చూడాలి.

Tags:    

Similar News