గర్ల్‌ఫ్రెండ్ కల్చర్‌కి BCCI చెక్.. ఈ ఐదుగురు క్రికెటర్లే కారణం!
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ కేవలం ఫోర్లు, సిక్సర్లకే పరిమితం కాలేదు.. మైదానం వెలుపల ఆటగాళ్ల వ్యక్తిగత ప్రవర్తన కూడా చర్చనీయాంశంగా మారింది.;
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ కేవలం ఫోర్లు, సిక్సర్లకే పరిమితం కాలేదు.. మైదానం వెలుపల ఆటగాళ్ల వ్యక్తిగత ప్రవర్తన కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఐపీఎల్‌లో నానాటికీ పెరుగుతున్న`గర్ల్‌ఫ్రెండ్ కల్చర్`పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఆటగాళ్ల భాగస్వాములు జట్టుతో పాటు హోటళ్లలో బస చేయడం.. విమానాల్లో ప్రయాణించడం వంటి పరిణామాలు జట్టు క్రమశిక్షణను దెబ్బతీస్తున్నాయని బోర్డు భావిస్తోంది. ఈ క్రమంలోనే రాబోయే సీజన్ల నుండి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని బిసిసిఐ సిద్ధమవుతోంది.
బిసిసిఐ ముఖ్యంగా ఐదుగురు స్టార్ క్రికెటర్ల వ్యవహారశైలిని నిశితంగా గమనిస్తోంది. ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు హార్దిక్ పాండ్యా, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్, యువ సంచలనం యశస్వి జైస్వాల్, పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ .. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ జాబితాలో ప్రముఖంగా ఉన్నారు. వీరంతా తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి పబ్లిగ్గా కనిపించడం.. ప్రయాణాల్లో వారిని వెంట ఉంచుకోవడం వంటివి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరి ప్రవర్తన వల్లే బోర్డు ఇప్పుడు అందరు ఆటగాళ్లకు వర్తించేలా కొత్త రూల్స్ తీసుకురావాలని నిర్ణయించుకుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు బిసిసిఐ ఆగ్రహానికి ఆజ్యం పోశాయి. జట్టు మేనేజర్ డగౌట్‌లో సెల్ ఫోన్ వాడటం ఒకెత్తయితే.. కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కడం వివాదాస్పదమైంది. ఇటు మైదానంలో నిబంధనల ఉల్లంఘన... అటు వ్యక్తిగత జీవితంలో విచ్చలవిడితనం పెరగడం వల్ల జట్టులోని ప్రొఫెషనలిజం దెబ్బతింటోందని ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా పెద్ద వివాదం తలెత్తకముందే `ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్` అన్నట్లుగా ముందస్తు చర్యలకు బోర్డు ఉపక్రమిస్తోంది.
ఇక్కడ బిసిసిఐని కలవరపెడుతున్న మరో అంశం `ఇన్‌ఫ్లుయెన్సర్ల` బెడద. ఇషాన్ కిషన్ .. ఇతర ఆటగాళ్ల భాగస్వాముల్లో కొందరు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. గతంలో కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ -జూదపు వెబ్‌సైట్‌లను ప్రమోట్ చేసిన చరిత్ర ఉంది. అటువంటి వారు జట్టు అంతర్గత విషయాలను లేదా ఆటగాళ్ల మానసిక స్థితిని బయటి ప్రపంచానికి వెల్లడిస్తే... అది బుకీలకు లేదా అవినీతి శక్తులకు వరంగా మారుతుందని యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయు) హెచ్చరిస్తోంది. `అఫీషియల్ గర్ల్‌ఫ్రెండ్` అనే ముసుగులో జరుగుతున్న ఈ తంతుకు చెక్ పెట్టాలని బోర్డు యోచిస్తోంది.
నిజానికి టీమ్ ఇండియా విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు బిసిసిఐ ఇప్పటికే కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. 45 రోజుల పర్యటనలో కుటుంబ సభ్యులను కేవలం ఒక వారం మాత్రమే అనుమతిస్తారు. అయితే 10 ఫ్రాంచైజీలు ఉండే ఐపీఎల్‌లో ప్రతి ఆటగాడిని పర్యవేక్షించడం బోర్డుకు సవాలుగా మారింది. భార్యలు- కుటుంబ సభ్యుల ప్రయాణాలపై పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా.. గర్ల్‌ఫ్రెండ్స్‌ను ప్రోత్సహించడం వల్ల డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం పాడవుతుందని బిసిసిఐ నమ్ముతోంది. ఫ్రాంచైజీ యాజమాన్యాలతో మాట్లాడి కామన్ ప్రోటోకాల్స్ అమలు చేసే అవకాశం ఉంది.
ఈ కల్చర్ వల్ల కేవలం క్రమశిక్షణే కాదు... చట్టపరమైన చిక్కులు కూడా వస్తున్నాయి. ఇటీవలి కాలంలో కొందరు ఐపీఎల్ క్రికెటర్లు తమ మహిళా స్నేహితుల నుండి పోలీస్ కేసులను ఎదుర్కోవడం బిసిసిఐకి తలనొప్పిగా మారింది. ఇటువంటి వివాదాలు క్రికెట్ ప్రతిష్టను దిగజారుస్తాయని బోర్డు భావిస్తోంది. ఆటగాళ్లు తమ మార్కెట్ క్రేజ్ .. వ్యక్తిగత సంబంధాల కంటే ఆటకు, జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని బిసిసిఐ స్పష్టం చేస్తోంది. ఏసీయూ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేయడం ద్వారా ఈ అవాంఛనీయ పరిణామాలను అడ్డుకోవాలని చూస్తున్నారు.
ఓవరాల్ గా ఐపీఎల్ ఆటగాళ్ల విచ్చలవిడి ప్రవర్తనకు అడ్డుకట్ట వేయడానికి బిసిసిఐ భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న ఈ అస్తవ్యస్త పరిస్థితులు ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా ప్రభావం చూపుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే సీజన్ నుండి గర్ల్‌ఫ్రెండ్స్ ప్రయాణాలు .. బసపై పూర్తి నిషేధం లేదా కఠిన పరిమితులు విధించే దిశగా అడుగులు పడుతున్నాయి. క్రికెట్ అనేది ఒక జెంటిల్‌మెన్ గేమ్ అని.. దాని హుందాతనాన్ని కాపాడటం ప్రతి ఆటగాడి బాధ్యత అని బోర్డు ఈ రూపంలో గట్టి సందేశాన్ని ఇస్తోంది.