టీమ్ ఇండియా బౌలర్లను చితక్కొట్టి..తెలుగు కుర్రాడి డబుల్ సెంచరీ
అమన్ ధాటికి షమీ 10 ఓవర్లలో 70 పరుగులు, ఆకాశ్ దీప్ 8 ఓవర్లలోనే 78 పరుగులు సమర్పించుకున్నారు. ముకేశ్ 7 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చాడు.;
గత నెలలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలంలో తెలంగాణ కుర్రాడు ఒకరిని రూ.30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. దీంతో ఎవరా కుర్రాడు? అంటూ అందరూ ఆరా తీశారు. అచ్చమైన తెలంగాణ కుర్రాడైన అతడు ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగి ఆడాడు. మొహమ్మద్ షమీ, ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్.. వీరంతా టీమ్ఇండియాకు ఆడిన మేటి బౌలర్లు. షమీ గురించి ఇక చెప్పేది ఏముంది..? ప్రపంచ స్థాయి బౌలర్ అతడు. కానీ, వీరందరినీ తెలుగు కుర్రాడు ఉతికేశాడు. ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో మంగళవారం పశ్చిమ బెంగాల్ జట్టుతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లో అతడు 154 బంతుల్లో 200 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 12 ఫోర్లు, 13 సిక్సులతో చెలరేగాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్ తో హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 352/5 భారీ స్కోరు సాధించింది. అమన్ ధాటికి షమీ 10 ఓవర్లలో 70 పరుగులు, ఆకాశ్ దీప్ 8 ఓవర్లలోనే 78 పరుగులు సమర్పించుకున్నారు. ముకేశ్ 7 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చాడు.
అనగనగా అమన్ రావు..
విజయ్ హజారే ట్రీఫీలో హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన యువ బ్యాటర్ పేరాల అమన్ రావు. ఐపీఎల్ వేలంలో ఇతడిని రాజస్థాన్ రూ.30 లక్షలకు కొనుక్కుంది. 21 ఏళ్ల అమన్ చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఆసక్తి చూపాడు. దీంతో తల్లిదండ్రలు ప్రోత్సహించారు. ఇతడి తండ్రి వ్యాపారి. ఏడేళ్ల వయసులో గల్లీ క్రికెట్ తో మొదలుపెట్టాడు. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలనే లక్ష్యంతో ట్రయినింగ్ తీసుకున్నాడు. పదేళ్లకే అండర్ 14 రాష్ట్ర జట్టుకు ఆడాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) లీగ్స్ లోనూ రాణించడంతో బీసీసీఐ అండర్ 14 సౌత్ జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. అండర్ 16 విజయ్ మర్చంట్ టోర్నీలో హైదరాబాద్ కెప్టెన్ అమన్ రావే. 238 పరుగులు చేయడంతో పాటు జట్టు సెమీస్ కు చేర్చాడు. గత ఏడాది ముస్తాక్ అలీ ట్రోఫీలో 234 పరుగులు చేశాడు. స్ట్రయిక్ రేట్ 164. సీకే నాయుడు అండర్-23 టోర్నీలో 709 పరుగులు బాదడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి.
సిరాజ్ కూల్చాడు..
బెంగాల్ తో రాజ్ కోట్ లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో టీమ్ ఇండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ తరఫున బరిలో దిగతాడు. 5 ఓవర్ల స్పెల్ 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. వాస్తవానికి హైదరాబాద్ ఈ ట్రోఫీలో నాకౌట్ రేసు నుంచి ఔట్ అయింది. ఈ మ్యాచ్ లో గనుక బెంగాల్ పై గెలిస్తే ఆ జట్టునూ నాకౌట్ చేరకుండా చేస్తుంది.
అమన్ కు మంచి భవిష్యత్..
బెంగాల్ తో మ్యాచ్ లో డబుల్ సెంచరీతో అందరి కళ్లూ ఇప్పుడు అమన్ రావుపై ఉన్నాయి. ఓపెనింగ్ బ్యాటర్ అయిన ఇతడికి ఐపీఎల్ లో రాజస్థాన్ మ్యాచ్ అవకాశం ఇస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మలా దూకుడు, కేన్ విలియమ్స్ లా క్లాస్ కలగలిసిన అమన్ కు రాజస్థాన్ జట్టులో యశస్వి జైశ్వాల్, వైభవ్ సూర్యవంశీ రూపంలో గట్టి పోటీ ఉంది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ప్లేస్ లో అమన్ కు అవకాశం వస్తుందేమో చూడాలి.