షాకింగ్ః టీ-కాంగ్రెస్ లో మ‌రో వికెట్ డౌన్.. బౌలింగ్ చేసింది వాళ్లేనా?

Update: 2021-03-15 15:50 GMT
తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని కాంగ్రెస్ నేత‌లు చెప్ప‌డంలో ప్ర‌త్యేక‌త ఏమీ లేదు. కానీ.. అధికార పార్టీ చెబితే..? అందునా ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంగీక‌రిస్తే..? అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తే..? హ‌స్తం పార్టీ బ‌ల‌ప‌డ‌డానికి ఇంత‌కు మించి ఏం కావాలి..? కానీ.. పైవన్నీ జరిగాయి కానీ.. కాంగ్రెస్ బలపడడం మాత్రం జరగలేదు. ప్రతిగా.. రోజురోజుకూ బలహీనం అవుతూ వచ్చింది.

ఈ పరిస్థితికి ఏ ఒక్క‌రో కాదు.. కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం దీనికి బాధ్య‌త వ‌హించాల్సిందేన‌ని సొంత కార్య‌క‌ర్త‌లు చెబుతారు. ఆధిప‌త్యం కోసం త‌మ‌లో తాము కీచులాడుకుంటూ.. ఎవ‌రికి వారు గ్రూపులు క‌ట్టుకొని కొట్టుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. ఒకే జెండా కింద ఉన్నామంటూనే.. సొంత ఎజెండాల‌తో ముందుసాగుతున్న నేత‌లు.. కాంగ్రెస్ పుట్టిముంచ‌డానికే ఉన్నార‌ని స‌గటు కాంగ్రెస్ కార్య‌ర్తలు ఆవేద‌న చెందుతున్నారు.

రాష్ట్ర నేత‌లం అని చెప్పుకుంటున్న‌వారు ఒక‌రినొక‌రు గిల్లుకుంటూ సాగుతుంటే.. ఇక‌, కాంగ్రెస్ తో లాభం లేదు అనుకునేవాళ్లు పార్టీని వ‌దిలేసి ఇత‌ర కండువాలు క‌ప్పుకుంటున్నారు. ఇప్ప‌టికే చాలా మంది నేత‌లు ఇలా కాంగ్రెస్ ను వ‌దిలి వెళ్ల‌గా.. తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, చేవెళ్ల‌ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

ఇప్ప‌టికిప్పుడు ఏ పార్టీలో చేర‌ట్లేద‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. ఓ మూడు మాసాలపాటు ఎదురు చూస్తాన‌ని తెలిపారు. ఆ త‌ర్వాతే రాజ‌కీయ భ‌విత‌వ్యంపై నిర్ణ‌యం తీసుకుంటాన‌ని వెల్ల‌డించారు. అయితే.. ఆయ‌న కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నార‌ని, అందుకే రాజీనామా చేశార‌ని ప్ర‌చారం సాగుతోంది.
Tags:    

Similar News